సాక్షి, అమరావతి : గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తాం.. అంటూ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పదే పదే చెబుతూ పేద ప్రజల్లో సొంతింటిపై ఆశలు కల్పించారు. కాని ఈ మూడేళ్లలో 8.41 లక్షల ఇళ్లు పూర్తి చేశామని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో 5 లక్షల ఇళ్లు కూడా పూర్తి కాలేదు. వాస్తవానికి బిల్లులు సరిగా ఇవ్వకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. ప్రభుత్వం అనుకున్న ప్రకారం 25 లక్షల ఇళ్లు పూర్తీ చేయాలంటే రూ.78,093 కోట్లు అవసరమవుతాయని అధికారుల అంచనా. కాగా ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల మేరకు మాత్రమే బిల్లులు మంజూరు చేశారు.
జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిందే
చంద్రబాబు ప్రభుత్వంలో ఇల్లు మంజూరు కావాలనుకునే పేదలు.. జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ తిరిగి వారికి సమర్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మంజూరైన ఇళ్లకు సైతం బిల్లులు సకాలంలో అందక అప్పు తెచ్చుకొని నిర్మాణాలు చేపడుతున్న పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గృహ నిర్మాణాల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నా నిర్మాణాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. సింగపూర్, మలేషియా, చైనాల టెక్నాలజీ ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టి పేదల కల సాకారం చేస్తామని చంద్రబాబు ఘనంగా పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. కాని ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగినప్పటికీ.. పేదల సొంతింటి కల మాత్రం నెరవేరలేదు.
వైఎస్ హయాంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి హయాంలో అడిగిన ప్రతి పేదవాడికి ఇళ్లు మంజూరు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పాదయాత్ర ద్వారా సొంతిల్లు లేని పేదల ఇబ్బందులను కళ్లార చూసిన ఆయన... ముఖ్యమంత్రి కాగానే అడిగిన వారందరికీ ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరు చేశారు. ఇందిరమ్మ పథకం కింద రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 44.80 లక్షల ఇళ్లు మంజూరు చేసి.. ఏకంగా 31.24 లక్షల ఇళ్లను పూర్తి చేశారు. మిగిలిన 13.56 లక్షల ఇళ్లకు టీడీపీ ప్రభుత్వం బిల్లులు నిలిపివేయడంతో ఇంటి నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయి.
ఇప్పటికీ అవి మొండి గోడలుగా దర్శనమిస్తున్నాయి. గతంలో ఉన్న ప్రభుత్వాలు పేదల గురించి ఆలోచించక పోవడంతో.. ప్రతి రోజూ ఎక్కడో ఒక ప్రాంతంలో ఇంటి పట్టా, ప్రభుత్వ ఇళ్ల కోసం కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిత్యం ఆందోళనలు జరిగేవి. వైఎస్ అధికారంలోకి వచ్చాక.. అడిగిన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలు ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు.
ఇళ్లు లేని పేదలు 30 లక్షల మందికి పైగానే:
ప్రభుత్వం నిర్వహించిన పల్స్ సర్వేలో.. రాష్ట్రంలో 30.31 లక్షల మంది పేదలు ఇంకా గుడిసెల్లోనే నివాసం ఉంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. శ్రీకాకుళం జిల్లాలో 1,53,716, విజయనగరంలో 1,23,076, విశాఖపట్నంలో 1,91,358, తూర్పు గోదావరి 4,85,219, పశ్చిమ గోదావరిలో 3,75,220, కృష్ణాలో 3,19,586, గుంటూరులో 3,08,722 మంది పేదలకు ఇంకా సొంతిళ్లు లేవని గుర్తించారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 2,10,370, నెల్లూరులో 1,59,744, చిత్తూరులో 1,51,472, వైఎస్సార్ కడపలో 1,25,571, అనంతపురంలో 2,03,817, కర్నూలు జిల్లాలో 2,23,418 కుటుంబాలు గుడిసెల్లోనే నివాసం ఉంటున్నట్లు గుర్తించింది.
ఎన్నికల కోసమే గృహాలు
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ ప్రభుత్వం గృహాల నిర్మాణాలకు అట్టహాసంగా ప్రారంభోత్సవం చేసినట్టు అర్థమవుతోంది. మార్కాపురం లో గతేడాది నవంబర్‌లో మంత్రి లోకేశ్ చేసిన శంకుస్థాపనలు పునాది దాటలేదు. ఎప్పుడు పూర్తవుతాయో అధికారులు చెప్పడం లేదు. స్థల సేకరణ కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. వైఎస్ హయాంలో దరఖాస్తు చేయగానే ఇళ్లు మంజూరయ్యాయి. బిల్లుల మంజూరు ఎలాంటి జాప్యం జరగలేదు.
– కె.వెంకటేశ్వరరెడ్డి, మార్కాపురం
రెండు నెలలుగా బిల్లులు రాలేదు..
ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద నాకు ఇల్లు మంజూరైంది. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఇంటి నిర్మాణం అసంపూర్తిగానే ఉండిపోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించి నాకు బిల్లులు మంజూరు చేస్తే మిగతా పనులు పూర్తిచేసుకుంటా.
– బూదాల ప్రదీప్, రాయవరం,
ప్రకాశం జిల్లా ఇంతవరకు దిక్కులేదు
ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇళ్లు మంజూరు కావడంతో నిర్మాణాన్ని మొదలెట్టాం. బిల్లు కోసం హౌసింగ్ అధికారులను సంప్రదిస్తే బేస్ లెవెల్ అయ్యాక ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత 35 బ్యాగుల సిమెంట్ మాత్రమే ఇచ్చి.. బిల్లులు అకౌంట్‌లో పడతాయని చెప్పారు. ఎలాగో బిల్లు వస్తుంది కదా అని రూ.2.5 లక్షల వరకూ అప్పుచేసి ఇళ్లు కట్టుకుంటూ వచ్చాం. బిల్లు కోసం అడిగిన ప్రతిసారీ అధికారులు ఖాతాలో పడతాయనే చెబుతున్నారు. ఇంత వరకూ దిక్కు లేదు. అప్పు చేసే ధైర్యం లేక ఇంటి నిర్మాణాన్ని ఆపేశాం.
- గొల్ల రుక్మిణి, కసాపురం, గుంతకల్లు మండలం, అనంతపురం జిల్లా
డి. రాజగోపాల్ సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment