NTR Housing Programme
-
అర్బన్ హౌసింగ్‌లో అక్రమాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఇసుక, మట్టి, నీరు ఇలా దేన్నీ వదలని తెలుగు తమ్ముళ్లు.. ఇళ్ల కేటాయింపులోనూ చేతివాటం చూపించారు. పేదవాడి సొంతింటి కలపై పచ్చ రాజకీయం స్వారీ చేస్తోంది. ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఎక్కువ... మంజూరైనవి తక్కువ కావడంతో డిమాండ్ ఎక్కువై రేటు మరింత పెంచేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద జిల్లాలో చేపడుతున్న అర్బన్ హౌసింగ్‌కు ఒక్కో ఇంటి కేటాయింపు కోసం భారీగా వసూళ్లు చేశారు. లబ్ధిదారులకు ఇవ్వవలసిన పొజిషన్ సర్టిఫికెట్లకు ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.రెండు నుంచి రూ.5 వేలు వసూలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ గృహనిర్మాణ లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. పట్టణ పేదలకు సొంతింటి కల సాకారం అయ్యేందుకు ఇంకా చాలా సమయం పట్టనుంది. జిల్లా వ్యాప్తంగా రెండు దశల్లో నిర్మించాలని తలపెట్టిన ఇళ్లు 44,260 కాగా, ఇప్పటి వరకూ ఎనిమిది వేలు మాత్రమే పూర్తి అయ్యాయి. ఎన్నికల సమయానికి మరో పదివేలకు మించి పూర్తి అయ్యే అవకాశం కనపడటం లేదు. ఎన్నికలు ముందుకు వస్తుండటంతో హడావిడిగా పూర్తి అయిన ఇళ్లకు ఈ నెల 20 గృహ ప్రవేశాలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. స్థలం లేని కారణంగా 11,710 ఇళ్ల నిర్మాణం అసలు ప్రారంభం కాలేదు. ఏలూరు నగరంలో హౌస్ ఫర్ ఆల్ పథకం కింద నగరంలోని పేద ప్రజలకు 11,816 ఇళ్లు మంజూరయ్యాయి. అయితే వాటిని నిర్మాణ పనులు ఇటీవలే చేపట్టారు. మొత్తం మూడు కేటగిరీలుగా ఈ ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. రూ.500, రూ.50 వేలు, రూ.లక్ష మొదటగా చెల్లించాల్సి ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ మినహాయిపు పోను మిగిలిన మొత్తానికి రుణాలుగా ఇప్పించేందుకు నగరపాలకసంస్థ అధికారులు బ్యాంకుల ఖాతాలను తెరుస్తున్నారు. మొత్తం 66 ఏకరాల్లో సుమారు 6,400 ఇళ్ల నిర్మా ణం జరుగుతుంది. ఇంకా 5,416 ఇళ్ల నిర్మాణానికి స్థలం కావాల్సి ఉండడంతో అధికారులు స్థలాన్ని సేకరించే పనుల్లో పడ్డారు. పాలకొల్లులో 6,784 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అందులో 2,500 మాత్రమే పూర్తి అయ్యాయి. లబ్ధిదారులకు పాలకొల్లు పట్టణంలో 19 బ్యాంకులు కేటాయించారు. వీటిలో ఒక్కో బ్యాంకుకు 352 మంది లబ్ధిదారులను కేటాయించారు. కాని కొన్ని బ్యాంకులు 60 సంవత్సరాలు ఉన్న లబ్ధిదారులకు నరకం చూపిస్తున్నారు. మీకు రుణం ఇవ్వడం కుదరదని చెపుతున్నారు. భీమవరంలో జీప్లస్ 3 తరహాలో 8,352 ఇళ్లు 12వ వార్డు తాడేరు రోడ్డులో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సేకరించిన 82 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకూ మూడు వేల ఇళ్ల వరకు పూర్తి అయ్యాయి. తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ పరిధిలో 5,376 ఇళ్లు కేటాయించారు. దరఖాస్తులు ఆహ్వానించడం దగ్గర నుంచి ఇళ్ల కేటాయింపు వరకు టీడీపీ నాయకులదే హవాగా సాగింది. అధికారిక వార్డు కౌన్సిలర్లు దరఖాస్తు ఫారంపై సంతకం చేసి పంపిన వాటినే మునిసిపల్ ఉద్యోగులు ఆన్లైన్ చేశారు. నిడదవోలులో రెండోదశలో మంజూరు చేశారు. 1,248 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. పట్టణానికి 3 కిలోమీటర్ల దూరాన వీరుగూడెం 25వ వార్డులో మొదటి విడతగా 13 ఎకరాలను కొనుగోలు చేశారు. టీడీపీ నాయకులు వారి అనుచరులకు, జన్మభూమి కమిటీలు నిర్ణయించిన పార్టీ శ్రేణులకు మాత్రమే గృహాలను మంజూరు చేశారు. కొవ్వూరులో 1,904 మందికి ఇళ్లు మంజూరు చేశారు. దీనిలో భాగంగా పట్టణంలో 7.51 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. దీనిలో ఎకరంన్నర భూమికి కోర్టు వివాదం కారణంగా ఆటంకం ఏర్పడింది. మిగిలిన భూమిలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభించారు. ఈ స్ధలం కేవలం 480 మందికి మాత్రమే సరిపోతుంది. మిగిలిన వాళ్ల ఇళ్ల నిర్మాణం చేద్దామన్నా మళ్లీ భూసేకరణ చేపట్టాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పరిధిలో పట్టణ శివారు 1వ వార్డు మార్కండేయపురంలో అర్బన్ హౌసింగ్ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే ఇది పట్టణానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో చేపట్టారు. మొదటి దశ కోసం 1056 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే సాధికార సర్వే ప్రకారం దానిలో ఉన్న లోపాలు కారణంగా చాలా మంది ఇళ్లు లేని వారికి ఇళ్లు మంజూరు కాలేదు. ఇకే ఇంట్లో మూడు కుటుంబాలు ఉన్నప్పటికీ మూడు కుటుంబాలకు ఇల్లు ఉన్నట్లు సాధికార సర్వేలో నమోదు కావడంతో ఆ ముగ్గురిలో ఇద్దరు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇల్లు మంజూరు కాలేదు. దీంతో ప్రజలు నగర పంచాయతీ చుట్టూ తిరుగుతున్నారు. నర్సాపురంలో స్థలాభావం వల్ల ఈ ప్రాజెక్టు అడుగు ముందుకు పడలేదు. మొత్తం మంజూరైన ఇళ్లు 44,260 పూర్తి అయినవి 8000 పూర్తి కావాల్సినవి 36,260 -
గూడు లేని గోడు.. అలసత్వంలో ప్రభుత్వం
సాక్షి, అమరావతి : గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తాం.. అంటూ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పదే పదే చెబుతూ పేద ప్రజల్లో సొంతింటిపై ఆశలు కల్పించారు. కాని ఈ మూడేళ్లలో 8.41 లక్షల ఇళ్లు పూర్తి చేశామని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో 5 లక్షల ఇళ్లు కూడా పూర్తి కాలేదు. వాస్తవానికి బిల్లులు సరిగా ఇవ్వకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. ప్రభుత్వం అనుకున్న ప్రకారం 25 లక్షల ఇళ్లు పూర్తీ చేయాలంటే రూ.78,093 కోట్లు అవసరమవుతాయని అధికారుల అంచనా. కాగా ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల మేరకు మాత్రమే బిల్లులు మంజూరు చేశారు. జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిందే చంద్రబాబు ప్రభుత్వంలో ఇల్లు మంజూరు కావాలనుకునే పేదలు.. జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ తిరిగి వారికి సమర్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మంజూరైన ఇళ్లకు సైతం బిల్లులు సకాలంలో అందక అప్పు తెచ్చుకొని నిర్మాణాలు చేపడుతున్న పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గృహ నిర్మాణాల కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నా నిర్మాణాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. సింగపూర్, మలేషియా, చైనాల టెక్నాలజీ ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టి పేదల కల సాకారం చేస్తామని చంద్రబాబు ఘనంగా పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. కాని ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగినప్పటికీ.. పేదల సొంతింటి కల మాత్రం నెరవేరలేదు. వైఎస్ హయాంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి హయాంలో అడిగిన ప్రతి పేదవాడికి ఇళ్లు మంజూరు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పాదయాత్ర ద్వారా సొంతిల్లు లేని పేదల ఇబ్బందులను కళ్లార చూసిన ఆయన... ముఖ్యమంత్రి కాగానే అడిగిన వారందరికీ ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరు చేశారు. ఇందిరమ్మ పథకం కింద రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 44.80 లక్షల ఇళ్లు మంజూరు చేసి.. ఏకంగా 31.24 లక్షల ఇళ్లను పూర్తి చేశారు. మిగిలిన 13.56 లక్షల ఇళ్లకు టీడీపీ ప్రభుత్వం బిల్లులు నిలిపివేయడంతో ఇంటి నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయి. ఇప్పటికీ అవి మొండి గోడలుగా దర్శనమిస్తున్నాయి. గతంలో ఉన్న ప్రభుత్వాలు పేదల గురించి ఆలోచించక పోవడంతో.. ప్రతి రోజూ ఎక్కడో ఒక ప్రాంతంలో ఇంటి పట్టా, ప్రభుత్వ ఇళ్ల కోసం కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిత్యం ఆందోళనలు జరిగేవి. వైఎస్ అధికారంలోకి వచ్చాక.. అడిగిన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలు ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఇళ్లు లేని పేదలు 30 లక్షల మందికి పైగానే: ప్రభుత్వం నిర్వహించిన పల్స్ సర్వేలో.. రాష్ట్రంలో 30.31 లక్షల మంది పేదలు ఇంకా గుడిసెల్లోనే నివాసం ఉంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. శ్రీకాకుళం జిల్లాలో 1,53,716, విజయనగరంలో 1,23,076, విశాఖపట్నంలో 1,91,358, తూర్పు గోదావరి 4,85,219, పశ్చిమ గోదావరిలో 3,75,220, కృష్ణాలో 3,19,586, గుంటూరులో 3,08,722 మంది పేదలకు ఇంకా సొంతిళ్లు లేవని గుర్తించారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 2,10,370, నెల్లూరులో 1,59,744, చిత్తూరులో 1,51,472, వైఎస్సార్ కడపలో 1,25,571, అనంతపురంలో 2,03,817, కర్నూలు జిల్లాలో 2,23,418 కుటుంబాలు గుడిసెల్లోనే నివాసం ఉంటున్నట్లు గుర్తించింది. ఎన్నికల కోసమే గృహాలు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ ప్రభుత్వం గృహాల నిర్మాణాలకు అట్టహాసంగా ప్రారంభోత్సవం చేసినట్టు అర్థమవుతోంది. మార్కాపురం లో గతేడాది నవంబర్‌లో మంత్రి లోకేశ్ చేసిన శంకుస్థాపనలు పునాది దాటలేదు. ఎప్పుడు పూర్తవుతాయో అధికారులు చెప్పడం లేదు. స్థల సేకరణ కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. వైఎస్ హయాంలో దరఖాస్తు చేయగానే ఇళ్లు మంజూరయ్యాయి. బిల్లుల మంజూరు ఎలాంటి జాప్యం జరగలేదు. – కె.వెంకటేశ్వరరెడ్డి, మార్కాపురం రెండు నెలలుగా బిల్లులు రాలేదు.. ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద నాకు ఇల్లు మంజూరైంది. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఇంటి నిర్మాణం అసంపూర్తిగానే ఉండిపోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించి నాకు బిల్లులు మంజూరు చేస్తే మిగతా పనులు పూర్తిచేసుకుంటా. – బూదాల ప్రదీప్, రాయవరం, ప్రకాశం జిల్లా ఇంతవరకు దిక్కులేదు ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇళ్లు మంజూరు కావడంతో నిర్మాణాన్ని మొదలెట్టాం. బిల్లు కోసం హౌసింగ్ అధికారులను సంప్రదిస్తే బేస్ లెవెల్ అయ్యాక ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత 35 బ్యాగుల సిమెంట్ మాత్రమే ఇచ్చి.. బిల్లులు అకౌంట్లో పడతాయని చెప్పారు. ఎలాగో బిల్లు వస్తుంది కదా అని రూ.2.5 లక్షల వరకూ అప్పుచేసి ఇళ్లు కట్టుకుంటూ వచ్చాం. బిల్లు కోసం అడిగిన ప్రతిసారీ అధికారులు ఖాతాలో పడతాయనే చెబుతున్నారు. ఇంత వరకూ దిక్కు లేదు. అప్పు చేసే ధైర్యం లేక ఇంటి నిర్మాణాన్ని ఆపేశాం. - గొల్ల రుక్మిణి, కసాపురం, గుంతకల్లు మండలం, అనంతపురం జిల్లా డి. రాజగోపాల్ సాక్షి, అమరావతి -
నిలువ నీడ లేని ఆడ బిడ్డ..
ఈమె పేరు కొప్పుల నాగమణి. స్వగ్రామం కృష్ణా జిల్లా చోడవరం. కొన్నేళ్ల కిందట భర్త చనిపోయాడు. పెళ్లిళ్లలో వంట చేస్తూ ఉపాధి పొందుతోంది. ఎక్కడికెళ్లినా... దివ్యాంగురాలైన కూతురిని తనతోపాటు తీసుకెళ్తూ కంటికి రెప్పలా చూసుకుంటోంది. సొంత ఇల్లు లేని నాగమణికి... ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రకటించిన ఎన్టీఆర్ హౌసింగ్ పథకంలోనైనా పక్కా గృహం వస్తుందని ఆశిస్తే నిరాశే మిగిలింది. అధికార పార్టీ స్థానిక నాయకులను కలిసినా ఫలితం లేకపోయిందని వాపోతోంది. తనకున్న కొద్దిపాటి స్థలంలో ఇల్లు కట్టుకుంటానని అధికారులను వేడుకుంటే, పునాది వేశాకే డబ్బు మంజూరు చేస్తామంటున్నారు. ఆ స్థాయి స్థోమత కూడా లేని నాగమణి ఇదుగో ఇలా స్థలం చుట్టూ పాక వేసుకుని, ఇంటికి రక్షణగా ఫ్లెక్సీలను ఉంచి జీవనం వెళ్లదీస్తోంది. -
సర్కారీ ఇంటికి సరికొత్త కొర్రీ
స్థలం ఉన్నవారికే అవకాశం 50 శాతం మందికి దక్కని ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం మెరక పనులకు నోచుకోని ఇందిరమ్మ స్థలాలు పత్తాలేని ఎన్టీఆర్ గృహనవీకరణ పథకం మండపేట : స్థలం లేని పేదల సొంతింటి కల ఇప్పట్లో సాకారమయ్యే అవకాశం కనిపించడం లేదు. పేదల గృహనిర్మాణానికి ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపినా కొందరికే ప్రయోజనం చేకూరనుంది. సొంత స్థలం ఉన్న వారికి మాత్రమే రుణం మంజూరు కానుంది. మరోపక్క ఎన్టీఆర్ గృహనవీకరణ పథకం లబ్ధిదారుల ఎంపిక ఇంకా కొలిక్కి రాకపోగా ప్రభుత్వం పెండింగ్ బిల్లుల విడుదల ఊసెత్తడం లేదు. పట్టణ ప్రాంతాలకు నిర్ధేశించిన అమృత పథకం అధికార పార్టీ నేతల పైరవీలతో పక్కదారి పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు టీడీపీ ప్రభుత్వం గృహనిర్మాణ రుణాల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం పేరిట నియోజకవర్గానికి 1,250 చొప్పున, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్‌కు 500 చొప్పున మొత్తం జిల్లాకు 19,750 ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి రూ.2.9 లక్షలు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఇళ్ల నిర్మాణం కోసం జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ భూమిపూజలు నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉన్నా నిబంధనల మేరకు ఎంతమందికి లబ్ధి చేకూరుతుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. జిల్లాకు మంజూరైన ఇళ్లలో 50 శాతం సొంత స్థలాలు ఉన్న వారికి మంజూరు చేస్తారు. మిగిలిన 50 శాతం ఇళ్లను గత ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలాల్లో మంజూరుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే జిల్లా వ్యాప్తంగా గతంలో సేకరించిన వందలాది ఎకరాల ఇందిరమ్మ స్థలాల్లో చాలాచోట్ల ఇప్పటికి మెరక పనులు చేయలేదు. వీటిని మెరక చేసి లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి గృహ నిర్మాణ రుణాల మంజూరు చేయడం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఆ దిశగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలేవి లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. గ్రామాల్లో సొంత స్థలాలు లేని పేదవర్గాల వారి సొంతింటి కల ఇప్పట్లో సాకారం సాకారమయ్యే దాఖలాలు కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు 19,750 ఇళ్లు మంజూరుకు గాను ప్రస్తుత మార్గదర్శకాల మేరకు సుమారు సగం మందికి మాత్రమే లబ్ధి చేకూరతుతుందని పలువురు అంటున్నారు. కొత్త ఇళ్ల నిర్మాణానికి అనుమతిలిచ్చిన సర్కారు పెండింగ్ బిల్లులను విడుదల చేసే దిశగా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినకాడికి అప్పులు చేసుకుని ఇళ్లు నిర్మించుకున్నామని, బిల్లులు రాకపోవడంతో రుణగ్రస్తులుగా మారిపోయామని కొందరు వాపోతుండగా, బిల్లులు రాక పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్ బిల్లులు సుమారు రూ.40 కోట్ల వరకు విడుదల కావాల్సి ఉన్నట్టు అంచనా. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మరోపక్క 1993 - 2004 మధ్య కాలంలో నిర్మించిన గ్రామాల్లోని పేదల ఇళ్లను ఎన్టీఆర్ గృహనవీకరణ పథకం కింద ఆధునీకరించుకునేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అర్బన్ నియోజకవర్గాలు మినహా మిగిలిన 17 నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మంజూరు చేసింది. ఒక్కో ఇంటి మరమ్మతుల నిమిత్తం రూ.10 వేలు చొప్పున రూ.17 కోట్లను కేటాయించింది. ఆ కాలంలో జిల్లాలో 2,01,780 ఇళ్లను నిర్మించగా ఎన్టీఆర్ గృహనవీకరణ పథకం కింద 17 వేల ఇళ్లను మాత్రమే ఎంపిక చేశారు. మార్చి నాటికి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా ఇప్పటికీ పూర్తికాకపోవడం గమనార్హం. అధికారపార్టీ కనుసన్నల్లోనే అమృత అమృత పథకం కింద జిల్లాలోని పట్టణ ప్రాంతాలకు మంజూరైన 24,332 ప్లాట్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ప్లాటు రూ. 5.5 లక్షలు చొప్పున జీఫ్లస్ 1 తరహాలో ఇళ్ల నిర్మాణం చేయనున్నారు. జిల్లాలోని తుని మున్సిపాల్టీకి 5,090 ప్లాట్లు మంజూరవ్వగా, కాకినాడ కార్పొరేషన్‌కు 4,608 ప్లాట్లు, రాజమండ్రికి 4,200, పెద్దాపురం మున్సిపాల్టీకి 1,724, సామర్లకోటకు 1,048, రామచంద్రపురంనకు 1,088, మండపేటకు 4,064, పిఠాపురంనకు 874, అమలాపురంనకు 1,636 ప్లాట్లు మంజూరయ్యాయి. అర్హులతో నిమిత్తం లేకుండా పలు మున్సిపాల్టీల్లో అధికార పార్టీ నేతలు తమకు కావాల్సిన వారికి కట్టబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒత్తిళ్లకు తలొగ్గకుండా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేద వర్గాల వారు కోరుతున్నారు.