సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఇసుక, మట్టి, నీరు ఇలా దేన్నీ వదలని తెలుగు తమ్ముళ్లు.. ఇళ్ల కేటాయింపులోనూ చేతివాటం చూపించారు. పేదవాడి సొంతింటి కలపై పచ్చ రాజకీయం స్వారీ చేస్తోంది. ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఎక్కువ... మంజూరైనవి తక్కువ కావడంతో డిమాండ్ ఎక్కువై రేటు మరింత పెంచేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద జిల్లాలో చేపడుతున్న అర్బన్ హౌసింగ్‌కు ఒక్కో ఇంటి కేటాయింపు కోసం భారీగా వసూళ్లు చేశారు. లబ్ధిదారులకు ఇవ్వవలసిన పొజిషన్ సర్టిఫికెట్లకు ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.రెండు నుంచి రూ.5 వేలు వసూలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ గృహనిర్మాణ లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. పట్టణ పేదలకు సొంతింటి కల సాకారం అయ్యేందుకు ఇంకా చాలా సమయం పట్టనుంది. జిల్లా వ్యాప్తంగా రెండు దశల్లో నిర్మించాలని తలపెట్టిన ఇళ్లు 44,260 కాగా, ఇప్పటి వరకూ ఎనిమిది వేలు మాత్రమే పూర్తి అయ్యాయి. ఎన్నికల సమయానికి మరో పదివేలకు మించి పూర్తి అయ్యే అవకాశం కనపడటం లేదు. ఎన్నికలు ముందుకు వస్తుండటంతో హడావిడిగా పూర్తి అయిన ఇళ్లకు ఈ నెల 20 గృహ ప్రవేశాలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. స్థలం లేని కారణంగా 11,710 ఇళ్ల నిర్మాణం అసలు ప్రారంభం కాలేదు.
ఏలూరు నగరంలో హౌస్ ఫర్ ఆల్ పథకం కింద నగరంలోని పేద ప్రజలకు 11,816 ఇళ్లు మంజూరయ్యాయి. అయితే వాటిని నిర్మాణ పనులు ఇటీవలే చేపట్టారు. మొత్తం మూడు కేటగిరీలుగా ఈ ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. రూ.500, రూ.50 వేలు, రూ.లక్ష మొదటగా చెల్లించాల్సి ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ మినహాయిపు పోను మిగిలిన మొత్తానికి రుణాలుగా ఇప్పించేందుకు నగరపాలకసంస్థ అధికారులు బ్యాంకుల ఖాతాలను తెరుస్తున్నారు. మొత్తం 66 ఏకరాల్లో సుమారు 6,400 ఇళ్ల నిర్మా ణం జరుగుతుంది. ఇంకా 5,416 ఇళ్ల నిర్మాణానికి స్థలం కావాల్సి ఉండడంతో అధికారులు స్థలాన్ని సేకరించే పనుల్లో పడ్డారు. పాలకొల్లులో 6,784 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అందులో 2,500 మాత్రమే పూర్తి అయ్యాయి. లబ్ధిదారులకు పాలకొల్లు పట్టణంలో 19 బ్యాంకులు కేటాయించారు. వీటిలో ఒక్కో బ్యాంకుకు 352 మంది లబ్ధిదారులను కేటాయించారు. కాని కొన్ని బ్యాంకులు 60 సంవత్సరాలు ఉన్న లబ్ధిదారులకు నరకం చూపిస్తున్నారు.
మీకు రుణం ఇవ్వడం కుదరదని చెపుతున్నారు. భీమవరంలో జీప్లస్ 3 తరహాలో 8,352 ఇళ్లు 12వ వార్డు తాడేరు రోడ్డులో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సేకరించిన 82 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకూ మూడు వేల ఇళ్ల వరకు పూర్తి అయ్యాయి. తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ పరిధిలో 5,376 ఇళ్లు కేటాయించారు. దరఖాస్తులు ఆహ్వానించడం దగ్గర నుంచి ఇళ్ల కేటాయింపు వరకు టీడీపీ నాయకులదే హవాగా సాగింది. అధికారిక వార్డు కౌన్సిలర్‌లు దరఖాస్తు ఫారంపై సంతకం చేసి పంపిన వాటినే మునిసిపల్ ఉద్యోగులు ఆన్‌లైన్ చేశారు. నిడదవోలులో రెండోదశలో మంజూరు చేశారు. 1,248 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. పట్టణానికి 3 కిలోమీటర్ల దూరాన వీరుగూడెం 25వ వార్డులో మొదటి విడతగా 13 ఎకరాలను కొనుగోలు చేశారు. టీడీపీ నాయకులు వారి అనుచరులకు, జన్మభూమి కమిటీలు నిర్ణయించిన పార్టీ శ్రేణులకు మాత్రమే గృహాలను మంజూరు చేశారు. కొవ్వూరులో 1,904 మందికి ఇళ్లు మంజూరు చేశారు.
దీనిలో భాగంగా పట్టణంలో 7.51 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. దీనిలో ఎకరంన్నర భూమికి కోర్టు వివాదం కారణంగా ఆటంకం ఏర్పడింది. మిగిలిన భూమిలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభించారు. ఈ స్ధలం కేవలం 480 మందికి మాత్రమే సరిపోతుంది. మిగిలిన వాళ్ల ఇళ్ల నిర్మాణం చేద్దామన్నా మళ్లీ భూసేకరణ చేపట్టాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పరిధిలో పట్టణ శివారు 1వ వార్డు మార్కండేయపురంలో అర్బన్ హౌసింగ్ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే ఇది పట్టణానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో చేపట్టారు. మొదటి దశ కోసం 1056 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే సాధికార సర్వే ప్రకారం దానిలో ఉన్న లోపాలు కారణంగా చాలా మంది ఇళ్లు లేని వారికి ఇళ్లు మంజూరు కాలేదు. ఇకే ఇంట్లో మూడు కుటుంబాలు ఉన్నప్పటికీ మూడు కుటుంబాలకు ఇల్లు ఉన్నట్లు సాధికార సర్వేలో నమోదు కావడంతో ఆ ముగ్గురిలో ఇద్దరు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇల్లు మంజూరు కాలేదు. దీంతో ప్రజలు నగర పంచాయతీ చుట్టూ తిరుగుతున్నారు. నర్సాపురంలో స్థలాభావం వల్ల ఈ ప్రాజెక్టు అడుగు ముందుకు పడలేదు.
మొత్తం మంజూరైన ఇళ్లు 44,260
పూర్తి అయినవి 8000
పూర్తి కావాల్సినవి 36,260
Comments
Please login to add a commentAdd a comment