మాట్లాడుతున్న కొత్తపల్లి సుబ్బారాయుడు
సాక్షి, నరసాపురం: నరసాపురం తెలుగుదేశం పార్టీలో ‘కొత్త’ చిచ్చు రాజుకుంది. నరసాపురం అసెంబ్లీ స్థానాన్ని సీఎం చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడికి కేటాయించి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుకు మొండిచేయి చూపించారు. దీంతో కొత్తపల్లి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆఖరి నిమిషం వరకూ టికెట్ తనదేనంటూ నమ్మించి వంచించారని ఆరోపించారు. మంగళవారం రుస్తుంబాదలోని ఆయన నివాసంలో తన వర్గీయులతో సమావేశం నిర్వహించారు. కొత్తపల్లి మాట్లాడుతూ ఏడు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పోటీ చేసిన తనకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. కచ్చితంగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ప్రస్తుతానికి పార్టీలోనే కొనసాగుతానని ఎలా పోటీ చేయాలి, దేనికి పోటీ చేయాలి? అనే విషయాలను రెండు రోజుల్లో వెల్లడిస్తానని అన్నారు.
కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన సత్తా ఏంటో చూపిస్తానన్నారు. కొత్తపల్లి పార్టీపై ఎదురు దాడికి దిగడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. సీటు చిచ్చు టీడీపీలో చీలిక తీసుకురావడంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళనలో ఉన్నారు. కొత్తపల్లి వేరే పార్టీలోకి వెళ్లడం అనేది దాదాపుగా ఖరారు అయ్యింది. అయితే అది ఏపార్టీ అనే అంశంలో సందేహాలు నెలకొ న్నాయి. ఇంకోవైపు అన్నీ పార్టీల్లోనూ సీట్లు ఖరారు అయిపోయాయి. దీంతో కొత్తపల్లి వ్యూహం ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. రెబల్‌గా అయినా ఆయన పోటీలో ఉండే అవకాశం కనిపిస్తోంది.
భీమవరంలో అసంతృప్తి జ్వాలలు
భీమవరం: భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు రోజురోజుకూ ఎగసిపడుతున్నాయి. రెండేళ్లుగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) వ్యవహార శైలి నచ్చక శ్రేణులు తీవ్ర అసంతృప్తి ఉన్నారు. అయినా ఈసారి ఎన్నికల్లో అంజిబాబుకు సీటు కేటాయించడంతో వలసలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇది నాయకుల్లో గుబులు రేపుతోంది. వీరవాసరం మండలంలో ఒక నాయకుడిని పక్కన పెడితేనే తాము ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేస్తామని చెప్పినా సోమవారం సమావేశాన్ని ఆ నాయకుడి ఆధ్వర్యంలో ఏర్పాటుచేయడంతో పలువురు సీనియర్ నాయకులు డుమ్మా కొట్టారు. ఇటువంటి సమయంలో భీమవరం నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పోటీచేస్తారనే ప్రచారం టీడీపీని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment