కొవ్వూరులో విలేకరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: చివరి నిమిషం వరకూ నాన్చి నిడదవోలు, నరసాపురం సీట్లు సిట్టింగ్‌లకే కేటాయించడంతో టీడీపీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల పట్ల పార్టీలోని అసంతృప్త వర్గం రోడ్డెక్కింది. నరసాపురంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి కొత్తపల్లి సుబ్బారాయుడు రాజీనామా చేశారు. కొవ్వూరులో పాయకరావుపేట నుంచి తీసుకువచ్చి వంగలపూడి అనితను రంగంలోకి దింపడంతో ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు చిం తలపూడిలో అభ్యర్థి కర్రా రాజారావు తమను కలుపుకుపోవడం లేదంటూ మాజీ మం త్రి పీతల సుజాత వర్గం సహకరించకూడదని నిర్ణయం తీసుకుంది. పోలవరంలో సిట్టిం గ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ను కాదని సీటు కేటాయించిన బొరగం శ్రీనివాస్ అసలు ఎస్టీ కాదంటూ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిడదవోలులో సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు కేటాయించడంతో వ్యతిరేక వర్గం నేత కుందుల సత్యనారాయణ అలకబూనారు. ఆయన పార్టీ మారడమా, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడమా అన్న విషయమై తన అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఈ స్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతుండటంతో అధిష్టానం తలపట్టుకుంటోంది.
నరసాపురం సీటు విషయంలో చివరి వరకు టిక్కెట్ ఇస్తామని ఊరించి మోసం చేశారని కొత్తపల్లి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం రుస్తుంబాదలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో 7 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా పోటీ చేసిన తనకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటో పార్టీ నాయకత్వం చెప్పాలన్నారు. తాను మాత్రం పోటీ చేసి తీరుతానని ఆయన స్పష్టం చేశారు. భీమవరంలో కూడా పార్టీలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వీరవాసరం మండలంలోని రాయకుదురు గ్రామంలో సోమవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఒక వర్గం గైర్హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశంగా మారిది.
అంజిబాబు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోకుండా చిన్నచూపు చూస్తున్నారని అంతేగాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన అంజిబాబు తన వెంట వచ్చిన నాయకులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ నామినేటెట్ పదవులు కట్టబెడుతున్నారని వారు బహిరంగంగానే విమర్శించారు. మరోవైపు కొవ్వూరులో కూడా అసంతృప్తి సెగలు ఇంకా చల్లారలేదు. కొవ్వూరు టిక్కెట్‌కి స్థానికేతరులకు ఇచ్చి తనకు అన్యాయం చేసినందుకు నిరసనగా టీడీపీకీ రాజీనామా చేస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ప్రకటించారు. మెడలో ఉన్న టీడీపీ కండువాను పక్కన పడవేసి, వేసుకున్న పసుపు రంగు చొక్కా తీసేసి, నల్లగుడ్డ కప్పుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment