ఆ సర్వే పవన్‌కు షాకిచ్చిందా?.. పొత్తులపై కొత్త డ్రామా అందుకేనా? | Janasena Chief Pawan Kalyan New Drama On Alliances | Sakshi
Sakshi News home page

ఆ సర్వే పవన్‌కు షాకిచ్చిందా?.. పొత్తులపై కొత్త డ్రామా అందుకేనా?

Published Sun, Jul 9 2023 12:53 PM | Last Updated on Sun, Jul 9 2023 1:38 PM

Janasena Chief Pawan Kalyan New Drama On Alliances - Sakshi

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చిన పవన్ నేడు సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయమని ఎందుకు మాట్లాడారు.? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా అందరినీ ఏకం చేస్తానని శపథం చేసిన పవన్ నేడు పొత్తులకు ఇంకా సమయం ఉందని ఎందుకు పేర్కొన్నారు.? పొత్తుల కోసం అవసరమైతే బీజేపీ పెద్దలను ఒప్పించి తీరుతానని చెప్పిన పవన్ ఎన్నికలకు ఒంటరిగా వెళ్లాలా, పోత్తులతో ముందుకు వెళ్లాలా అనేది తరువాత మాట్లాడుకునే అంశమని ఎందుకు ప్రస్తావించారు? పొత్తులపై రోజుకో మాట మాట్లాడుతూ జనసేన నాయకులను, కేడర్‌ను ఉద్దేశపూర్వకంగా పవన్ ఎందుకు కన్ఫ్యూజన్ చేస్తున్నారు.? 

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యం అంటూ బహిరంగ సభల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఊగిపోతూ తెగ మాట్లాడేవారు. దీని కోసం రాష్ట్రంలో ఉన్న పార్టీలు కలిసి ముందుకు రావాలని, ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ టీడీపీకి జనసేనకి మధ్య పొత్తు ఉంటుందనే సంకేతాలను పంపించారు. టీడీపీ, జనసేనే కాదు బీజేపీ, జనసేన, టీడీపీ మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్లేలా బీజేపీ జాతీయ పెద్దలను కూడా ఒప్పిస్తానని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం పదవిపై చంద్రబాబుతో జరిగిన ఒప్పందాన్ని కూడా  పవన్ కళ్యాణ్ బయటపెట్టేసారు.

తనకు సీఎం అయ్యే అర్హత లేదని, పొత్తుల్లో భాగంగా సీఎం అభ్యర్థి చంద్రబాబునేనని  పవన్ కళ్యాణ్,  ఈ సందర్భంగా తన మనసులో మాటను బయిట పెట్టారు.. సీఎం పదవి పొందాలంటే దానికి తగ్గట్టు సీట్లు ఉండాలని, అ సీట్లు తన దగ్గర లేవని స్పష్టం చేశారు.. సీఎం పదవి పొందేందుకు, అందుకు కావలసిన ఎమ్మెల్యేలు సంఖ్యా బలం తన దగ్గర లేనప్పుడు తాను ఎలా సీఎం అవుతాను అంటూ తిరిగి జనసేన నాయకులను, కార్యకర్తలను ప్రశ్నించారు.. రెండు పార్టీల పొత్తులో భాగంగా సీఎం అభ్యర్థి చంద్రబాబునేనని పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు.
 చదవండి: అన్నా లెజెనెవా ఎవరు? పవన్‌కు ఎలా పరిచయమయ్యారు?

దీంతో ఒక్కసారిగా జనసేన పార్టీలో కలకలం రేగింది.. జనసేన నాయకులు, జన సైనికులు పవన్ కళ్యాణ్ తీరును తప్పుపట్టారు.. పవన్  సీఎం అవ్వాలని ఆశించిన కాపుల్లో, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ తీరుపై ఆగ్ర ఆవేశాలు వ్యక్తం అయ్యాయి.. నువ్వు సీఎం కాలేనప్పుడు నీకు ఓటు వేయడం ఎందుకని, నీకు వేసే ఓటు కూడా దండగని మండిపడ్డారు.. చంద్రబాబును సీఎం చేయడం కోసం తమను బలి పశువులను చేయ వద్దని పవన్ కళ్యాణ్‌కు హితవు పలికారు..

కాపు నాయకుడైన వంగవీటి రంగాను అత్యంత కిరాతకంగా హత్య చేయించిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఏ విధంగా మద్దతు పలుకుతారు అనే చర్చ జనసేన పార్టీలోనూ కాపుల్లోనూ మొదలయ్యింది.. పవన్ కళ్యాణ్ తీరుతో విసిగిపోయిన జనసేన శ్రేణులు, కాపులు జనసేన సభలకు సమావేశాలకు మొహం చాటేస్తున్నారు.. నీ ప్యాకేజీ కోసం, నీ అవసరాల కోసం కాపులందరి నీ బలి పశువులను చేస్తావా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.

తాను సీఎంను కానంటూ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అంతర్గతంగా సర్వే చేయించారనే టాక్ జనసేన వర్గాల్లో నడుస్తోంది. ఈ సర్వేలో నివేదికలు పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే విధంగా  బయటపడినట్లు తెలుస్తోంది. తాను సీఎంను కాదు చంద్రబాబు సీఎం అవుతారంటూ పవన్ కళ్యాణ్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానుల్లోనూ, పవన్ ను అభిమానించే కాపుల్లో వ్యతిరేకత మొదలైందనే విషయం బయటపడింది.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను అభిమానించే యువతలో ఆగ్ర ఆవేశాలు వ్యక్తమయ్యాయి.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో అయితే జనసేనకు ఓటు వేయడానికి చాలామంది అసహ్యించుకుంటున్నారు.

పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలపై ప్రజల నాడి ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు చంద్రబాబు కూడా అనేక సర్వేలు చేయించారనే ప్రచారం జరుగుతుంది.. టీడీపీ చేయించిన సర్వేల్లో కూడా పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది.. ఇప్పుడు కాపులు జనసేన శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు, వారి దృష్టి మరలచేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరో కొత్త డ్రామాకు తెరలేపారనే చర్చ టీడీపీ, జనసేనలో వినిపిస్తోంది. పవన్ తీరుపై వస్తున్న వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చడం కోసం అధ్యయనం తర్వాతే పొత్తులు గురించి చర్చ అంటూ పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు చిలక పలుకులు పలికిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

సమయం వచ్చినప్పుడు పొత్తులు గురించి ప్రస్తావన ఉంటుందని చెబుతున్నారే తప్ప ఎక్కడ కూడా జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని కానీ 175 కు 175 స్థానాల్లో జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థులు బరిలో ఉంటారని కానీ పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వడం లేదు.. జనసేన కార్యకర్తలో నాయకుల నుంచి  ఆగ్రహ ఆవేశాల నుంచి దృష్టి మరల్చడం కోసమే పవన్ కళ్యాణ్ కొత్తగా సమగ్ర అధ్యయనం తరువాతే  పొత్తుల చర్చ అంటూ వారిని తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చదవండి: రాజకీయం అంటే వెబ్‌ సిరీస్‌ కాదు: పవన్‌పై మంత్రి అమర్నాథ్‌ ఫైర్‌

జనసేన నాయకులు కార్యకర్తల్లో  కన్ఫ్యూజన్ సృష్టించి పవన్ కళ్యాణ్ పై ఉన్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడం కోసమే పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.. బయటికి పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు మాట్లాడుతున్నా అంతర్గతంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఇప్పటికే సీట్లు పంపకానికి సంబంధించి కూడా చర్చలు పూర్తయ్యాయని వాదన కూడా వినిపిస్తోంది.
-స్వామి నాయుడు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్, విశాఖపట్నం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement