భలే చౌకబేరము..! | sand smuggling in check posts | Sakshi
Sakshi News home page

భలే చౌకబేరము..!

Published Wed, Jun 4 2014 12:13 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

భలే చౌకబేరము..! - Sakshi

భలే చౌకబేరము..!

దాచేపల్లి, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పాటయిన చెక్‌పోస్టులు ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు అనుమతి ఉన్నా లేకపోయినా వ్యాపారులు ఇసుకను యథేచ్ఛగా హైదరాబాద్‌కు తరలించేవారు. అమరావతి, వైకుంఠపురంలో ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి లారీలకు పరిమితికి మించి లోడ్ చేసి వ్యాపారులు సొమ్ము చేసుకునేవారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడివడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నేపథ్యంలో దాచేపల్లి మండలం గామాలపాడు పంచాయతీ పరిధిలోని జేపీ సిమెంట్స్ వద్ద రవాణాశాఖ అధికారులు సోమవారం చెక్‌పోస్ట్ ప్రారంభించారు.
 
 ఒక రాష్ట్ర సరిహద్దు నుంచి మరో రాష్ట్రం సరిహద్దులోకిలోడ్‌తో ఉన్న లారీలు ప్రవేశించాలంటే తప్పనిసరిగా రవాణాశాఖకు చెందిన తనిఖీ కేంద్రంలో ఇచ్చే పాస్ అవసరం. అమరావతి, వైకుంఠపురం ఇసుకరీచ్‌లలో ఇసుకను నింపుకుని సుమారు 30 లారీలు మంగళవారం తెల్లవారుజామున దాచేపల్లికి చేరుకున్నాయి. జేపీ సిమెంట్స్ వద్ద రవాణాశాఖ అధికారులు అంతర్ రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారన్న విషయం తెలుసుకుని లారీ డ్రైవర్‌లు లారీలను దాచేపల్లి, ఇరికేపల్లి, గామాలపాడు గ్రామాల్లో నిలిపివేశారు. పరిమితికి మించిన లోడ్‌తో వస్తుండడంతో రవాణాశాఖ అధికారులు  కేసులు నమోదు చేస్తారనే భయంతో అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై లారీలను నిలిపివేశారు.
 
 అందినకాడికి ఇసుక విక్రయం..
 రవాణాశాఖ తనిఖీ కేంద్రం వద్ద నుంచి లారీ వెళ్లాలంటే నిబంధనల ప్రకారం లారీల్లో లోడ్ ఉండాల్సిందే. లారీలో భారీగా ఇసుక ఉండడంతో చెక్‌పోస్ట్ వద్దకు వెళ్తే ఇబ్బందులు వస్తాయని గమనించిన లారీ డ్రైవర్‌లు పరిస్థితిని లారీ యజమానులకు ఫోన్‌ద్వారా వివరించారు. యజమానుల ఆదేశాల మేరకు గత్యంతరం లేక పరిసర గ్రామాల్లోనే ఇసుకను అమ్మేందుకు డ్రైవర్‌లు ఏర్పాట్లు చేసుకున్నారు.
 
 ఇసుక రీచ్‌ల్లో నామమాత్రపు ధరను చెల్లించి లారీల ద్వారా ఇసుకను హైదరాబాద్ తరలించి అక్కడ టన్ను రూ.1,200 నుంచి రూ.1500కు వ్యాపారులు అమ్ముకునేవారు. హైదరాబాద్‌లో భవన నిర్మాణాలకు ఎక్కువగా ఇక్కడి నుంచే ఇసుకను తీసుకెళ్తుంటారు. దీంతో విపరీతమైన డిమాండ్ పెరిగి స్థానికంగా ఇసుక వ్యాపారులు ట్రాక్టర్ ఇసుక రూ.3 వేలకు విక్రయిస్తుండేవారు. ప్రస్తుతం చెక్‌పోస్ట్ పుణ్యమా అని మూడు టన్నులు పట్టే ట్రాక్టర్ ఇసుక కేవలం రూ.1,200 కే ఇచ్చారు. దీంతో స్థానికంగా ఉన్న వ్యాపారులతో పాటు ఇళ్లు నిర్మించుకునే సామాన్య ప్రజలు కూడా ఇసుకను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు.
 
 సొంత ట్రాక్టర్లు ఉన్న వారు డబ్బు చెల్లించి ఎక్కువగా ఇసుకను తరలించారు. కొన్ని లారీల్లో ఇసుకను పూర్తిగా విక్రయించగా, మరికొన్ని లారీల్లో మాత్రం నిబంధనల ప్రకారం లోడ్‌ను ఉంచుకుని మిగతా ఇసుకను విక్రయించారు. ఇరికేపల్లి గ్రామానికి చెందిన ఒకరు లారీ ఇసుకను రూ.12 వేలకు కొనుగోలు చేశారు. లారీని ఇంటికి తీసుకెళ్లే క్రమంలో అధికలోడ్ ఉండడంతో లారీ ముందు చక్రానికి ఉన్న కమాన్ కట్టలు విరిగాయి. దీంతో లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
 
 నిబంధనలు అతిక్రమిస్తే కేసు నమోదు
 అమరావతి, వైకుంఠపురం ఇసుకరీచ్‌ల నుంచి పరిమితికి మించి ఇసుకను లోడ్ చేసుకుని వచ్చిన కొన్ని లారీలను చెక్‌పోస్ట్ వద్ద ఆపి అనుమతులు పరిశీలించాం. లారీల్లో సామర్థ్యానికి మించి ఇసుక ఉండడంతో ఇతర రాష్ర్టంలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం లోడ్ ఉన్న లారీలను మాత్రమే తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతిచ్చాం. నిబంధలనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం.
 - రాంబాబు, చెక్‌పోస్ట్ ఇన్‌చార్జి
 

Related News By Category

Related News By Tags

Advertisement