సాక్షి, హైదరాబాద్: సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు సామాన్యుడికి తోడ్పడే గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ.. రాష్ర్ట విభజన తర్వాత తెలంగాణలో కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణలో మంత్రిత్వ శాఖలు 17కే పరిమితంకానున్న నేపథ్యంలో ఈ దిశగా కసరత్తు జరుగుతోంది. కొత్త ప్రభుత్వంలో ముఖ్యమైన శాఖలను మాత్రమే కొనసాగించి, మిగతా వాటిని విలీనం కానీ, రద్దు కానీ చేయాల్సి ఉంటుంది. దీంతో గృహ నిర్మాణ శాఖను రద్దు చేసి దాని పరిధిలోని సంస్థలను ఇతర శాఖలకు అప్పగించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. మంగళవారం సాయంత్రం గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన జరిగిన గృహ నిర్మాణ సంస్థ బోర్డు సమావేశంలో దీనిపై చర్చించారు.
ప్రస్తుతం గృహ నిర్మాణ సంస్థ(హౌసింగ్ కార్పొరేషన్), గృహ నిర్మాణ మండలి(హౌసింగ్ బోర్డు), రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌లతో గృహ నిర్మాణ శాఖ కొనసాగుతోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ బాధ్యతను గ్రామీణాభివృద్ధి శాఖకు, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ బాధ్యతను పురపాలక శాఖకు అప్పగిస్తూ గృహ నిర్మాణ సంస్థ, గృహ నిర్మాణ మండలిని రద్దు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం దివాలా తీసి అప్పులు తీర్చేందుకు భూములు అమ్మే పనిలో బిజీగా ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌ను కూడా పురపాలక శాఖలో విలీనం చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ప్రతిపాదనలను దాని ముందుంచాలని అధికారులు నిర్ణయించారు. కాగా, గృహ నిర్మాణ సంస్థను విభజించేందుకు మంగళవారం గృహ నిర్మాణ బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో జూన్ 2 తర్వాత తెలంగాణలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకు వీలుగా ఆ సంస్థ పేరును రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అయితేరాష్ట్ర హౌసింగ్ బోర్డు విభజన మాత్రం ఇప్పట్లో ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని సంస్థలు రాష్ట్ర విభజన తర్వాత సంవత్సరం వరకు ఉమ్మడిగా ఉండే వెసులుబాటు రాష్ట్ర విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో కల్పించినందున హౌసింగ్ బోర్డుపై తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఇక గృహ నిర్మాణ శాఖలో ప్రస్తుతం ఓ ప్రత్యేక విభాగంగా ఉన్న ‘దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్(దిల్)’ను హౌసింగ్‌బోర్డులో విలీనం చేయాలని నిర్ణయించారు.