రెండుగా బ్యాంక్ యూనియన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్ర విభజన అంశం బ్యాంకు యూనియన్లు తాకింది. త్వరలోనే అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోనుండటంతో దీనికి అనుగుణంగా బ్యాంకు యూనియన్లు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. వచ్చే రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు ప్రత్యేక శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు బ్యాంకు యూనియన్లు పేర్కొన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మార్చి నెలలో ఒకసారి సమావేశం నిర్వహించామని, ఆగస్టు మొదటి వారంలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఏఐబీఈఏ) ప్రకటించింది.
రెండు రాష్ట్రాల్లో పనిచేసే ఉద్యోగస్తుల ప్రయోజనాలు కాపాడే విధంగా ప్రత్యేక శాఖలను ఏర్పాటు చేయనున్నామని, ఆగస్టు 2-3 తేదీల్లో జరిగే సమావేశంలో దీనికి సంబంధించి విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు ఏఐబీఈఏ ముఖ్య కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. చత్తీస్‌ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు అనుసరించిన విధానాలే ఇక్కడా పాటించనున్నామని, యూనియన్లకు ఉన్న ఆస్తులు, అప్పులను చెరి సమానంగా పంచనున్నట్లు రాంబాబు తెలిపారు.
రాష్ట్రంలో ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బీహెచ్, సెంట్రల్ బ్యాంక్, సిండికేట్ వంటి బ్యాంకులకు అధిక సంఖ్యలో శాఖలు ఉండగా, యూకో, దేనా వంటి చిన్న బ్యాంకులు నామమాత్ర శాఖలను కలిగి ఉన్నాయి. ఇలా తక్కువ శాఖలు కలిగి ఉన్న బ్యాంకు యూనియన్లను విడదీయకుండా అదే విధంగా కొనసాగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం సంయుక్త రాష్ట్రంలో సుమారు 5,000 శాఖల్లో 90,000కి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత ఉద్యోగస్తుల్లో నెలకొన్న సెంటిమెంట్‌ను ఇదే విధంగా కొనసాగించడం కష్టమని, దీంతో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకంగా యూనియన్లను ఏర్పాటు చేయడమే మంచిదని మరో బ్యాంకింగ్ యూనియన్ ప్రతినిధి పేర్కొన్నారు.
ఆఫీసర్లు దూరం..: రెండు రాష్ట్రాలకు ప్రత్యేకంగా యూనియన్లను విడదీసే ఆలోచన లేదని ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బీఐ ఆఫీసర్స్ యూనియన్స్ స్పష్టం చేశా యి. రాష్ట్ర విభజన జరిగినా ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్‌లోనే ఉండటంతో అటువంటి ఆలోచన చేయడం లేదని ఆంధ్రాబ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హరినాథ్ స్పష్టం చేశారు. తమ యూనియన్‌నూ విడదీసే ఆలోచన లేదని ఎస్‌బీఐ ఆఫీసర్స్(ఏపీ) అసోసియేషన్స్ ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌బీఐలో సుమారు 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.