హైదరాబాద్.. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది: కిరణ్కుమార్
హైదరాబాద్ ఏ ఒక్క ప్రాంతానికో సంబంధించినది కాదని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిదీ అని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మరోసారి నిరసన గళం వినిపించారు. ఓ ఇంటర్వ్యూలో కిరణ్ మాట్లాడుతూ ఒక సమస్యను పరిష్కరించడానికి మరో పెద్ద సమస్యను సృష్టించరాదని అన్నారు. పార్టీ కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనల్ని పరిష్కరించనిదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ముందుకెళ్లడం చాలా కష్టమని కిరణ్ అన్నారు. తెలంగాణపై నోట్ను కేంద్ర కేబినెట్ ముందు చర్చకు పెట్టిన తర్వాత అసెంబ్లీ ఆమోదం కోసం పంపుతామన్న కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటనపై పైవిధంగా స్పందించారు.
తెలంగాణ ప్రకటన వెలువడ్డాక కాంగ్రెస్, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్ననిరసనల గురించి కిరణ్ ప్రస్తావించారు. కాంగ్రెస్తో ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తారా అన్న ప్రశ్నకు.. 'పార్టీ వ్యతిరేక వైఖరికి సంబంధించిన విషయం కాదిది. ప్రజల భయాందోళనలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. లక్షలాది ప్రజలు తమ భవిష్యత్పై ఆందోళన చెందుతున్నారు. వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నాపై ఉంది' అని కిరణ్ బదులిచ్చారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం గురించే సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తున్నారన్నారు. పార్టీ కంటే రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు. విభజన వల్ల చాలా సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నదీ జలాల పంపిణీతో పాటు హైదరాబాద్తో ఉన్న విద్య, వైద్య సదుపాయాలు, ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి చాలా సమస్యలు వస్తాయని వివరించారు. హైదరాబాద్లో పెట్టుబడుతు పెట్టినందువల్లే సీమాంధ్ర నాయకులు విభజనను వ్యతిరేకిస్తున్నారన్నవాదనతో ఆయన విభేదించారు. 'నేను హైదరాబాద్లో పుట్టి, ఇక్కడే చదువుకుని పెరిగాను. 53 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాదంటే ఎలా? హైదరాబాద్ మాదని ఎవరూ చెప్పరాదు. హైదరాబాద్ సుదీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది' అని ముఖ్యమంత్రి అన్నారు.