లెక్కలు సెటిల్‌ చేసుకోవడంలో సీఎం బిజీ | Kiran Kumar reddy busy with collection, says Harish rao | Sakshi
Sakshi News home page

లెక్కలు సెటిల్‌ చేసుకోవడంలో సీఎం బిజీ

Published Fri, Oct 4 2013 5:53 AM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM

Kiran Kumar reddy busy with collection, says Harish rao

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనను పూర్తిగా విస్మరించి, వసూళ్ళపైనే దృష్టి పెట్టారని తెరాస నేత హరీష్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణకు పైసా ఇవ్వకుండా చిత్తూరులో తాగునీటి పథకానికి ఏకంగా రూ.6 వేల కోట్లు కేటాయించడం ఏమిటని మండిపడ్డారు. చిత్తూరులో తాగు నీటికి నిధులు కేటాయిస్తూ జీవో విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం తెరాస నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి నిరసన తెలిపారు. ఈ జీవోను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నంలో సిఎం ఉన్నారని, రాష్ట్రంలో అనిశ్చితి కొనసాగుతున్నా, కాంట్రాక్టులు, బిడ్డింగులు ఆగడం లేదని ఆరోపించారు. లెక్కలు సెటిల్‌ చేసుకునే దిశగా ముఖ్యమంత్రి ఫైళ్ళపై విరామం లేకుండా సంతకాలు చేస్తున్నారని ఆరోపించారు. చిత్తూరు మంచినీటి పథకానికి కేబినెట్‌ అనుమతి లేకుండానే రూ.6 వేల కోట్లు కేటాయిస్తూ ఎలా జీవో విడుదల చేశారని ప్రశ్నించారు. దీనికి ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ జీవోను నిలిపివేయాలని సీఎస్‌ను కోరానని హరీష్‌రావు చెప్పారు.

కిరణ్‌కు కొనసాగే అర్హత లేదు: దిలీప్‌
కిరణ్‌కుమార్‌ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఎంతమాత్రం లేదని తెలంగాణా రాష్ట్రీయ లోక్‌దళ్‌ పార్టీ నేత, ఎమ్మెల్సీ దిలీప్‌ వ్యాఖ్యానించారు. సీఎం సీమాంధ్రకే పరిమితమయ్యారని విమర్శించారు. వరంగల్‌ విమానాశ్రయానికి రూ.25 కోట్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి, గన్నవరం ఎయిర్‌పోర్టుకు రూ.125 కోట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.


అన్నింటా పక్షపాతమే: పోచారం ముఖ్యమంత్రి పక్షపాత ధోరణి వల్ల అన్ని శాఖల్లోనూ తెలంగాణ పట్ల వివక్ష కొనసాగుతోందని తెలంగాణ ప్రాంత నేత పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణ వాదులు రెచ్చిపోవడం ఖాయమని హెచ్చరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement