ఇంట గెలవకనే.. రచ్చకు !
తిరుపతి: ఇంట గెలవకనే రచ్చ గెలిచేందుకు పోయినట్టుంది మాజీ సీఎం వ్యవహారం. ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షులుగా ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ బుధవారం పురుడు పోసుకుంటోంది. ఇందుకు గోదావరి తీరం రాజమండ్రి వేదిక కానుంది. పలు రాజకీయ సంచలనాలకు కేంద్రబిందువైన సొంత జిల్లాలోని తిరుపతిని కాకుండా అయన రాజమండ్రిని ఎంపిక చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం జిల్లాలో ఆయనకు పట్టులేకపోవడమే అని విమర్శకులు అంటున్నారు.
.సుమారు మూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు జిల్లా కాంగ్రెస్ పార్టీపై గానీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై గానీ ఎప్పుడూ పట్టులేదు. జిల్లా ప్రజల్లోనూ తనదంటూ ముద్ర వేసుకోవడంలో విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో కిరణ్ జై సమైక్యాంధ్ర పేరుతో కొత్త పార్టీని స్థాపించడమంటే ఇంట గెలవకనే రచ్చ గెలిచే ప్రయత్నమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరి దారి వారిదన్నట్టు వ్యవహరించారు.
ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన తరువాత తన వెంట జిల్లా నుంచి ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యేను నిలుపుకోలేని పరిస్థితి ఆయనది. అభివృద్ధి పనులన్నింటినీ పీలేరుకు కేటాయించుకున్న కిరణ్ సొంత నియోజకవర్గంలో తనకు ఎదురు లేకుండా చేసుకునేందుకు టీడీపీకి చెందిన ఇంతియాజ్ అహ్మద్, జీవీ శ్రీనాథరెడ్డిని కాంగ్రెస్‌లో చేర్పించారు. ఒకరికి సమాచార కమిషనర్ పదవిని మరొకరికి టీటీడీ పాలకమండలిలో సభ్యత్వం ఇప్పించుకోగలిగారు. అంతకు మించి జిల్లాలో ఆయన వల్ల రాజకీయంగా ప్రయోజనం పొందిన వారు లేరంటే అతిశయోక్తి లేదు. జిల్లాను ఏ మాత్రం పట్టించుకోని కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు ఏకంగా కొత్త పార్టీ పెట్టి ఎవరిని ఉద్ధరిస్తారనే ప్రశ్న లేవనెత్తుతున్నారు.
సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ తరువాత జిల్లా వైపు కన్నెత్తి చూడలేదు. రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు అవకాశం ఇచ్చిన జిల్లాను, నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదనే అపవాదును మాజీ సీఎం మూటగట్టుకుంటున్నారు. గత నెల 19వ తేదీన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన రాష్ట్ర రాజధానికే పరిమితమయ్యారు.