సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ ఆదాయార్జనలో వెనకడుగేస్తోంది. లక్ష్యం బారెడు కాగా ఆదాయం మూరెడులా ఉంది ఈ శాఖ పరిస్థితి. గతేడాది సంభవించిన హుద్‌హుద్ తుపానుతో పాటు రాష్ట్ర విభజన, శూన్యమాసం వెరసి ఆదాయానికి దెబ్బకొట్టాయి. రియల్ బూమ్ లావాదేవీలు కూడా కొన్ని చోట్ల మందగించడంతో ఆ ప్రభావం లక్ష్యంపై పడింది. 2015-16 మధ్య కాలానికి రిజిస్ట్రేషన్ శాఖ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రూ.102 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం రూ.67 కోట్లే సాధించగలిగాయి. ఏటా రియల్టర్ల భూ క్రయ విక్రయదారుల వల్ల ఆదాయం వస్తున్నా పలు చోట్ల వెలసిన అనధికార లే అవుట్లపై మున్సిపల్, పంచాయతీ అధికారులు కొరడా ఝులిపిస్తుండడంతో లావాదేవీలు నిలిచిపోతున్నాయి.
ఇదో కారణం
ఆదాయపన్నుశాఖలో మరింత సరళీకృతానికి వీలుగా రిజిస్ట్రేషన్‌శాఖలో జరిగే ప్రతి రూ.5 లక్షల లావాదేవీకి పాన్‌కార్డు జత చేయడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా కొన్నిచోట్ల ఇబ్బందులకు గురిచేస్తోంది. రిజిస్ట్రేషన్ల సమయంలో ఇరువర్గాలూ తమ ఆధార్‌కార్డుల వివరాలు కూడా పొందుపర్చాలని చెబుతుండడం వెనుక ఏదో మతలబు ఉంటుందన్న అనుమానాలు ఆస్తుల క్రయవిక్రయదారుల్లో నెలకుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో 30 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. రిజిస్ట్రేషన్లు జరిగేటప్పుడు పాన్ నంబర్ పొందుపర్చడం వల్ల మోసాలకు తావుండదని, ఆదాయం ఏ రూపంలో వస్తుందో, ఏ రూపంలో వెళ్తుందో సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే చాలా మందికి ఇప్పటికీ ఆధార్, పాన్‌కార్డుల్లేవ్. ఆధార్ సీడింగ్ శతశాతం పూర్తి చేశామని చెబుతున్నా వాటిల్లోని సాంకేతిక కారణాలు, నిర్లక్ష్యం కారణంగా వేలాది మందికి ఆధార్ కార్డులు ఇప్పటికీ రాలేదు.
అలాగే పాన్ కార్డు తీసుకుంటే ముప్పు వాటిల్లుతుందేమోనన్న భయంతో చాలామంది వీటిని తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అలాగేగ్రామీణ ప్రాంతాల్లో జరిగే ప్రతీ క్రయ విక్రయం వెనుక ఇప్పటివరకూ డాక్యుమెంట్ రైటర్లు, దళారులే చక్రం తిప్పేవారు. ఇప్పుడా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం పకడ్బందీగా ఆధార్, పాన్ నెంబర్ల నమోదును తప్పనిసరి చేసిందని చెబుతున్నా దీని వెనుక ఏదో మతలబు ఉందని అనుమానిస్తున్నారు. నిరుద్యోగుల పొట్టకొట్టేందుకు ఇదీ ఓ కారణం కావచ్చుని ఆక్షేపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల సమయంలో ఆధార్, పాన్ నంబర్లు పొందుపర్చడం వల్ల భవిష్యత్తులో ఇరువర్గాల మధ్య విభేదాలు రాకుండా ఉంటాయని, డాక్యుమెంట్ రైటర్లు, బ్రోకర్ల బారిన పడకుండా ఉండొచ్చుని, రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బందికి రూపాయి కూడా అనధికారికంగా చెల్లించకుండా ఉండేందుకు వీలవుతుందని చెబుతున్నా ఇప్పటికప్పుడు ఇది సాధ్యం కాదని సిబ్బందే చెబుతున్నారు.
రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయ గండం!
Published Fri, Jun 19 2015 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM
Advertisement
Advertisement