కేంద్రం తీరుపై మండిపాటు ‘సమైక్య’ దీక్ష
Published Thu, Aug 8 2013 2:33 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
ప్రాణాలు అర్పించైనా సరే సమైక్యాంధ్రను పరిరక్షించుకుంటామని తమిళనాడులోని తెలుగు సంఘాలు శపథం చేశాయి. ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా తెలుగు సంఘాలు చెన్నైలో బుధవారం నిరాహారదీక్ష నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండి పడ్డాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి: సమైక్యాంధ్ర ఉద్యమంతో సీమాంధ్ర అట్టుడికి పోతోంది. చెన్నైలోని తెలుగువారు సైతం ఉద్యమబాట పట్టారు. తెలుగు సంఘాల ఆధ్వర్యంలో మైలాపూరులోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరంలో బుధవారం నిరాహారదీక్ష జరిగింది. పొట్టి శ్రీరాములు ప్రాణాలు అర్పించిన చోట వెలసిన స్మారక మందిరంలోని ఆయన విగ్రహానికి ముందుగా నివాళులర్పించా రు. తర్వాత సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ నిరాహారదీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి తంగుటూరి రామకృష్ణ ప్రసంగించారు.
ఒక మంచికి, మరో చెడ్డకు సైతం తెలుగువారే ముందుండి నిలిచారని అన్నారు. ఆనాడు భాషా సంయుక్త రాష్ట్రాల కోసం అశువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారు కావడం అదృష్టమన్నారు. ఒకే భాషను మాట్లాడుకునే వారికి రెండు రాష్ట్రాలు అనే దుష్ట సంప్రదాయానికి నాంది పలికిన టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్ తెలుగువారే కావడం అత్యంత దురదృష్టకరమన్నారు. నిరాహారదీక్షలు చేస్తే చాలు ప్రత్యేక రాష్ట్రాలు వస్తాయనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం దేశానికి చాటిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరాభివృద్ధి సమష్టికృషిగా ఆయన అభివర్ణించారు. విభజన నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలే విభేదిస్తున్నారని పేర్కొన్నారు.
అర్థం లేని డిమాండ్
నిరాహారదీక్ష సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. వీరికి కెన్సెస్ అధినేత కె.నరసారెడ్డి పండ్ల రసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌లోనే అర్థం లేదని విమర్శించారు. ఎలాంటి చర్యలు చేపడితే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందో విశ్లేషించుకుని దానిపై దృష్టి సారించాలన్నారు. అలా చేయకుండా ప్రత్యేక రాష్ట్రం కోరడం అవివేకమని అన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వారి సంఖ్య 30 లక్షలు దాటిందన్నారు. ఈ రెండు ప్రాంతాల వారే లేకుంటే హైదరాబాద్ లేదు, హైదరాబాద్ లేకుంటే తెలంగాణకు గుర్తింపే లేదని అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల తీవ్రవాదం, శాంతిభద్రతల సమస్య వంటివి ఏర్పడగలవని ఏనాడో రుజువైందని పేర్కొన్నారు. ఇప్పటికైనా విభజన నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలన్నారు.
అనంతరం ఘంటసాల రత్నకుమార్ మాట్లాడారు. సీమాంధ్రలో ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి చెన్నైలోని తెలుగువారు మద్దతు పలకడం కనీస కర్తవ్యమని అన్నారు. ఈ ఆశయాన్ని సాధించే వరకు ఉద్యమాన్ని విరమించకూడదని కోరారు. రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ ఉద్యమాన్ని లేవదీశారని రంగనాయకులు అన్నారు. పొట్టి శ్రీరాములు లాంటి వ్యక్తుల త్యాగాల ఫలంగా సిద్ధించిన ఆంధ్రప్రదేశ్‌ను కొందరి స్వార్థం కోసం విభజించరాదని ఉప్పులూరి విజయలక్ష్మి అన్నారు. విదేశీవనితగా భారత్‌లోకి అడుగుపెట్టిన సోనియాగాంధీకి ఆంధ్రప్రదేశ్ విలువ గురించి ఏమి తెలుసని కృష్ణారావు విమర్శించారు. విభజన ద్రోహులకు, సమైకాంధ్ర ఉద్యమకారులకు తెలుగు సంఘాల వారు ప్రకటించిన అవార్డులను ఆస్కా ట్రస్టీ శ్రీనివాసులురెడ్డి చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎం.వి.నారాయణ గుప్త, స్మారక మందిరం కార్యదర్శి రామకృష్ణ, ఆస్కా ట్రస్టీలు ఎరుకలయ్య, విజయేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement