నేరం.. కేరాఫ్ విజయవాడ | Crime c / o: Vijayawada | Sakshi
Sakshi News home page

నేరం.. కేరాఫ్ విజయవాడ

Published Mon, Jun 2 2014 1:21 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

Crime c / o: Vijayawada

  • చెలరేగిపోతున్న దొంగలు
  •  అసాంఘికశక్తులకు అడ్డా
  •  షెల్టర్‌జోన్‌గా మారుతున్న వైనం
  •  మహానగరంగా మారుతున్న వేళ పోలీసులకు పెనుసవాల్
  • సాక్షి, విజయవాడ : అసాంఘికశక్తులకు విజయవాడ అడ్డాగా మారుతోంది. ఇతర ప్రాంతాల్లో దొంగతనాలు, దోపిడీలు, కిడ్నాపులు, కిరాయి హత్యలు చేసే ముఠాలకు షెల్టర్‌జోన్‌గా తయారైంది. ఒకప్పుడు రౌడీయిజానికి బెజవాడ రాష్ట్రస్థాయిలోనే పేరుగాంచింది. పోలీసులు తీసుకున్న చర్యలు.. రౌడీల ప్రవర్తనలో వచ్చిన మార్పులు.. ఏదైతేనేం రౌడీయిజం కనుమరుగైంది.

    ఆ స్థానాన్ని వైట్‌కాలర్  నేరాలు ఆక్రమించాయి. నగర పరిధి విస్తృతంగా పెరిగిన క్రమంలో ఇంటా బయటా చోరీలు, బైక్ దొంగతనాలు నిత్యకృత్యమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యాపారిని కిడ్నాప్ చేయాలని పథకం రచించిన ముఠా పోలీసులకు చిక్కడంతో నగరవాసులు మళ్లీ ఉలిక్కిపడ్డారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అతి పెద్ద నగరంగా అవతరించనున్న విజయవాడకు ఇవన్నీ సవాళ్లేనని చెప్పాలి.
     
    కౌన్సెలింగ్‌లతో తెరమరుగు..

    విజయవాడ నగరంలో దాదాపు 15 ఏళ్ల క్రితం వరకు రౌడీలు తమ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగించేవారు. పోలీసుల వరుస ట్రీట్‌మెంట్లు, కౌన్సెలింగ్‌లతో అనేకమంది రౌడీలు తెరమరుగయ్యారు. మరికొందరు జిల్లాను వీడి దూరంగా వెళ్లిపోయారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో 20 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటిలో మొత్తం 340 మంది రౌడీషీటర్లు ఉన్నారు. వీరిలో ఏ ప్లస్ కేటగిరీలో 80 మంది ఉన్నారు.

    రౌడీషీటర్లు దాదాపు నాలుగేళ్లుగా తమ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కాగా బ్లేడ్‌బ్యాచ్ ముఠాలు, గంజాయి విక్రయించే ముఠాలు ఉన్నాయి. వీరితోపాటు ఇతరప్రాంతాల్లో కిరాయి హత్యలు, దొంగతనాలకు పాల్పడే వారు అనేకమంది నగరాన్ని షెల్టర్‌జోన్‌గా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సింగ్‌నగర్, వాంబే కాలనీ, న్యూరాజరాజేశ్వరీపేట తదితర ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలుగా మార్చుకున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది.

    తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన బంగారు నగల వ్యాపారిని కిడ్నాప్ చేసి కోటి  రూపాయలుడిమాండ్ చేయాలని చూసిన ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు నేరచరిత్ర లేనప్పటికీ కేవలం డబ్బు ఆశతోనే ఇలా చేశారు. దీన్నిబట్టి చూస్తే నగరంలో నేరాలు ఏ స్థాయిలో ఉన్నాయో అవగతమవుతుంది.

    విజయవాడ కమిషనరేట్ అయినప్పటికీ నగర పరిధి బాగా పెరగడం, చుట్టూ జాతీయ రహదారులు ఉండడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. కిరాయి హత్యలు, కిడ్నాప్‌లను నియంత్రించడంలో మాత్రం పోలీసులు సఫలీకృతులయ్యారు. ఏడేళ్లుగా ఇలాంటి నేరాలు జరగకపోవడమే దీనికి నిదర్శనం.
     
    నిత్యం దొంగతనాలు...

    నగరంలో దొంగతనాలు నిత్యకృత్యంగా మారాయి. రోజూ ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక చోరీ తప్పక జరుగుతుంది. నగరం నలుదిక్కులా జాతీయ రహదారి ఉండడంతో దొంగతనం చేసిన పదిహేను నిమిషాల్లో దొంగలు నగరం వదిలి పారిపోతున్నారు. ఫలితంగా దొంగతనాల జోరు బాగా పెరిగింది. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన దొంగల ముఠాలు ప్రస్తుతం నగరంలో స్వైరవిహారం చేస్తున్నాయి. నకిలీ పోలీసుల ముఠాలు కూడా తమ హవా కొనసాగిస్తున్నాయి.
     
    నెలకు 200కు పైగా కేసులు..
    రెండు నెలలుగా సగటున నెలకు 200కు పైగా దొంగతనాల కేసులు
     
    గత నెల 19న కమిషనరేట్ పరిధిలోని కంకిపాడులో పట్టపగలే రెండిళ్లలో చోరీలు జరిగాయి. రెండు లక్షల సొత్తు అదృశ్యమైంది.
     
    అదేరోజు ఆటోనగర్‌లో పోలీసులమని చెప్పి నకిలీ పోలీసులు వృద్ధురాలి నుంచి తొమ్మిది కాసుల బంగారం అపహరించారు.
     
    గత నెల 21న ఆటోనగర్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న మహిళ నుంచి రూ.40 వేల విలువైన బంగారం అపహరించారు.
     
    గత నెల 25న కృష్ణలంక ప్రాంతంలోని ఓ ఇంట్లో దొంగలు చొరబడి 20 కాసుల బంగారం, 50 వేల నగదు అపహరించారు.
     
    ఇలా వరుస దొంగతనాలు జరుగుతున్న క్రమంలో పోలీసులు నాకాబందీ నిర్వహించి తనిఖీలు చేస్తున్నా ఆశించిన మేర ప్రయోజనం కలగడం లేదు. దీనికితోడు పోలీసులే  మైకు ప్రచారం నిర్వహించి నగరవాసులను అప్రమత్తం చేస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement