
రాష్ట్ర విభజనకు ఓ బ్రోకరే కారణం... అతనెవరో త్వరలో వెల్లడిస్తా: దాసరి
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ఓ బ్రోకరే కారణమని మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అతనెవరో త్వరలోనే వెల్లడిస్తాననీ ఆయన పేర్కొన్నారు. పోసాని కృష్ణమురళి నటించిన ‘బ్రోకర్-2’ సినీ గీతాల ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమలో దాసరి మాట్లాడుతూ.. ‘‘నేను చదువుకునే రోజుల్లో బ్రోకర్ అనే మాట చాలా చౌకబారు పదం. కానీ, ఇప్పుడు అది పవిత్రమైన పదంలా తయారైంది. రాజకీయ పార్టీలు మొదలు రాష్ట్రాలను విడగొట్టడం వరకూ బ్రోకర్లు పని చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి గురించి కూడా దాసరి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘తెలుగునాట సినిమా హాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే చాలా విషయాలున్నాయి. దాదాపు 200 దాకా సినిమాలు తొలి కాపీలు వచ్చి, రిలీజుకు నోచుకోకుండా పడి ఉన్నాయి. అసమర్థ ప్రభుత్వాలు, మంత్రుల వల్లే చిన్న సినిమాలకు హాళ్ళు దొరకని దుస్థితి తలెత్తింది. రేపు రానున్న రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.