గవర్నర్ ఆమోదించినా, పెండింగ్‌లో పెట్టిన అధికారులు
జీవో జారీలో జాప్యం
బిల్లుల సమర్పణకు గడువు 17 వరకే
ఐఏఎస్‌లకు మాత్రం డీఏ వచ్చేసింది
హెదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం (డీఏ) ఫైలును ఆర్థిక శాఖ తొక్కిపెట్టింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలోనే ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ మంజూరు చేస్తూ గవర్నర్ నరసింహన్ ఫైలుపై సంతకం చేశారు. ఇది జరిగి నాలుగు రోజులు గడిచినా, ఆర్థిక శాఖ జీవో జారీ చేయకుండా ఫైలును పెండింగ్‌లో పెట్టింది. వచ్చే నెల 2న రాష్ట్రం రెండుగా విడిపోతున్న నేపథ్యంలో ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు పెన్షన్‌ను ఈనెల 24నే చెల్లించేందుకు ఆర్థిక శాఖ జీవో కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో జనవరి నుంచి జూన్ వరకు ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే ఇవ్వాలన్న ఉద్యోగుల కోరికను ‘సాక్షి’ వెల్లడించింది. దీంతో ఆర్థిక శాఖ 8.56 శాతం డీఏ మంజూరు ఫైలును గవర్నర్‌కు పంపింది. గవర్నర్ వెంటనే దానికి ఆమోదం తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, గవర్నర్ సూచన మేరకు ఫైలును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆమోదం కోసం పంపారు. భన్వర్‌లాల్ వెంటనే ఆమోదించారు. ఈ ఫైలు శుక్రవారం ఆర్థిక శాఖకు చేరింది. అప్పటి నుంచి ఆర్థిక శాఖ జీవో జారీ చేయకుండా ఫైలును పెండింగ్‌లో పెట్టింది. మరో పక్క ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపునకు బిల్లుల సమర్పణ గడువు ఈ నెల 17తో ముగుస్తోంది. అంటే గడువు ఇంకా 3 రోజులే ఉంది.
ఈలోగా డీఏ జీవోను ఇవ్వకపోతే ఉద్యోగులకు కరువు భత్యం శాతం లెక్కకట్టి బిల్లుల సమర్పణ సాధ్యం కాదు. డీఏ ఇవ్వకపోతే గవర్నర్ సంతకానికి విలువ ఉండదని, ఆ ఉద్దేశంతోనే జీవో జారీ చేయకుండా ఆర్థిక శాఖ జాప్యం చేస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు డీఏ జీవో జారీ కాకపోతే, వచ్చే నెలలో రాష్ట్ర విభజన జరిగాక సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే డీఏ చెల్లించాల్సి వస్తుంది. అంటే డీఏ మరింత జాప్యమవుతుంది. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని ఉమ్మడి రాష్ట్రంలోనే డీఏ మంజూరుకు వీలుగా వెంటనే జీవో జారీ చేయించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఐఏఎస్ అధికారులకు మాత్రం డీఏ మంజూరయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఐఏఎస్‌లు డీఏ తీసుకోనున్నారు.
డీఏపై కనికరించని ఆర్థిక శాఖ
Published Wed, May 14 2014 1:08 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM
Advertisement