నవసేన
సాక్షి, సిటీబ్యూరో: జంట కమిషనరేట్ల పరిధిలో ఆదివారం భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. తొమ్మిది మంది కొత్తవారికి పోస్టింగ్ ఇచ్చారు. ఇందులో ఇద్దరిని సైబరాబాద్‌కు, ఏడుగురిని హైదరాబాద్‌కు కేటాయించారు. ఇక్కడ విధులు నిర్వహించిన 13 మంది ఇతర జిల్లాలకు, డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. జంట కమిషనరేట్లు ఏర్పాటయ్యాక ఇంత పెద్ద సంఖ్యలో ఐపీఎస్‌లు బదిలీ కావడం ఇదే తొలిసారి.
రాష్ట్ర విభజన నేపథ్యంలోనే ఈ బదిలీలు జరిగినట్టు తెలుస్తోంది. నగర పోలీసు కమిషనరేట్‌లో శాంతి భద్రతల విభాగానికి చెందిన ఐదుగురు, ట్రాఫిక్ విభాగానికి చెందిన ఇద్దరు ఐపీఎస్‌లకు స్థానచలనం కల్పించారు. సైబరాబాద్‌లో జాయింట్ పోలీసు కమిషనర్ వై.గంగాధర్‌తోపాటు ఐదు జోన్లలో కేవలం మాదాపూర్ మినహా మిగిలిన నాలుగు జోన్ల డీసీపీలు విశ్వప్రసాద్, రమేష్‌నాయుడు, ఏఆర్ శ్రీనివాస్, కోటేశ్వరరావులను కదిలించారు. వీరి స్థానంలో కేవలం మల్కాజిగిరి జోన్‌కు మాత్రమే కొత్తగా అధికారిని నియమించారు.
బాలానగర్, ఎల్బీనగర్ జోన్‌లకు అధికారులను నియమించాల్సి ఉంది. జాయింట్ పోలీసు కమిషనర్‌గా వచ్చిన కొత్త అధికారికి శంషాబాద్ జోన్ డీసీపీ బాధ్యతలను అదనంగా అప్పగించారు. త్వరలో సైబరాబాద్‌కు మరో ముగ్గురు ఐపీఎస్‌లు రావాల్సి ఉంది. ఇంటెలిజెన్స్‌లో ఎస్పీగా పనిచేసిన డాక్టర్ వి.రవీందర్ తూర్పు మండలం డీసీపీగా బదిలీ అయ్యారు.
సమర్ధవంతంగా..
వరంగల్ డీఐజీగా బదిలీ అయిన 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఎం.మల్లారెడ్డి సిటీ కమిషనరేట్‌లో సుదీర్ఘకాలం పని చేశారు. నాలుగేళ్ల మూడు నెలల పాటు సేవలందించారు. కడప జిల్లా ఎస్పీగా పని చేస్తూ మల్లారెడ్డి 2010 ఆగస్టులో హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు. ట్రాఫిక్ డీసీపీ-2గా ఏడాదికి పైగా విధులు నిర్వర్తించారు. అక్కడ నుంచి నగర భద్రతా విభాగం (సీఎస్‌డబ్ల్యూ) డీసీపీగా బదిలీ అయ్యారు. ఇక్కడ పని చేస్తుండగానే 2012 జూన్‌లో డీఐజీగా పదోన్నతి పొంది సిటీ ఆర్డ్మ్ రిజర్వ్ హెడ్-క్వార్టర్స్ సంయుక్త పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఏడాదిన్నర క్రితం స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. అనేక ఉద్యమాలు, ఉద్రిక్తతలతో పాటు కీలక ఘట్టాల్లోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలను సమర్ధవంతంగా పర్యవేక్షించారు.