మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు విభజన సెగ తగిలిన సంకేతాలు కనిపిస్తున్నాయి. అనుకున్న సమయానికి ‘పురపోరు’ జరిగే అవకాశాలు మందగించాయి.
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు విభజన సెగ
Published Tue, Aug 6 2013 3:44 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు : మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు విభజన సెగ తగిలిన సంకేతాలు కనిపిస్తున్నాయి. అనుకున్న సమయానికి ‘పురపోరు’ జరిగే అవకాశాలు మందగించాయి. జిల్లాలోని 12 పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఆయా మున్సిపల్ కమిషనర్లు పది రోజుల కిందటే సన్నాహాలు ప్రారంభించారు. ఆయా మున్సిపాల్టీల్లోని 371 వార్డుల రిజర్వేషన్లను కూడా ప్రకటించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం చైర్‌పర్సన్ల రిజర్వేషన్ల ప్రతిపాదనలను తయారు చేసిన అన్ని మున్సిపాల్టీల కమిషనర్లు హైదరాబాద్‌లోని మున్సిపల్ పరిపాలనా డెరైక్టర్(డీఎంఏ)కు పంపారు. మరో రెండు మూడు రోజుల్లో చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ఖరారవుతాయనగా, రాష్ట్ర విభజన ప్రకటన వెలువడింది. అప్పటి నుంచి వరసగా సీమాంధ్ర ఉద్యోగుల బంద్‌లు, ధర్నాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లోని పురపాలక శాఖ పరిపాలనా కార్యాలయంలో ఉద్యోగులు సైతం సీమాంధ్ర ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
దీనికి తోడు సీమాంధ్రకు చెందిన ఎన్‌జీవో జేఏసీ నాయకులు ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి విధులను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. మరో వైపు తెలంగాణ విషయం స్పష్టంగా తేలే వరకు మున్సిపోల్స్‌ను నిర్వహించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తేలిపోవాల్సిన చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు కూడా ఆలస్యమయ్యాయి. ఇప్పట్లో ఇవి తేలేట్లు లేవు. దీనికి తోడు ఈ నెల 2న జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లోనూ వెలువడాల్సిన పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ నిలిచిపోయింది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అభ్యంతరాల స్వీకరణ, రాజకీయ పార్టీల సమావేశాలు వాయిదా పడ్డాయి. ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు మరో తేదీని ప్రకటించాక దానికి అనుగుణంగా మిగతా తేదీలను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.
ఆలస్యమయ్యే అవకాశం...
మున్సిపల్ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం వుందని అధికార యంత్రాం గం చెపుతోంది. విభజన ఉద్యమాలు ఊపందుకున్న నేపథ్యంలో వివిధ దశల్లో జరగాల్సిన ఎన్నికల పనులన్నీ ఆలస్యమవుతాయని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ నెల 20 ఎన్నికల నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. అయితే జిల్లాలోని కొన్ని మున్సి పాల్టీల్లో ఇప్పటికీ ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తి కాలేదు. దీంతో సెప్టెంబరు 2 లోగా మున్సిపోల్స్ పూర్తవ్వాలన్న కోర్టు ఆదేశాలు అమలుకు నోచుకునే దాఖలాలు కనిపించడం లేదు. ఈ విషయమై గుంటూరు మున్సిపల్ ఆర్డీ జి. శ్రీనివాసరావును ‘సాక్షి’ సంప్రదించగా, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు ఏమీ చెప్పలేమన్నారు. అయితే పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మాత్రం వాయిదా పడిందనీ, సాధ్యమైనంత త్వరలో మరో తేదీని ప్రక టిస్తామన్నారు.
Advertisement
Advertisement