=జిల్లా పార్టీలో నిరుత్సాహం
=ఎన్నికల్లో పోటీ చేయడానికీ విముఖత
=పార్టీ మారేందుకు సిద్ధపడుతున్న వైనం
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిస్తేజంగా ఉంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి నాయకులు సిద్ధం కావడం లేదు. రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కన్నా, ఇతర పార్టీలను ఆశ్రయించడం మేలని ఆపార్టీ నాయకులు భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. 1983లో ఎన్‌టీ. రామారావు పార్టీ స్థాపించినపుడు కూడా ఇంతటి నిస్తేజాన్ని ఎదుర్కొనలేద ని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.
సాక్షి, తిరుపతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ డీలాపడగా, సమైక్యాంధ్ర వ్యవహారం తో పూర్తిగా కనుమరుగయింది. జిల్లాలో పార్టీ నాయకుల సందడి ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి తిరుపతికి వస్తే తప్ప, కాంగ్రెస్ నాయకులు ఇంటి నుంచి కదలడం లేదు. పార్టీ నాయకులకు నామినేటెడ్ పదవులు ఇచ్చినా, వారిలో అంతో ఇంతో కదలిక ఉండేదని పలువురు అంటున్నారు.
జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయినా ప్రయోజనం లేని స్థితికి చేరుకుంది. ఆయన తన గెలుపునకు సోపానంగా, పీలేరును మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నారు. జిల్లా నాయకులకు నామినేటెడ్ పదవులు ఇస్తామని ఊరించి, చేయిచ్చారు. మరోపక్క చిరంజీవి వర్గం కూడా పార్టీలో ఎటువంటి సందడి చేయడం లేదు. తిరుపతి నగరంలో పోటీ చేయడానికి కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థి కూడా లేని స్థితి వచ్చింది.
డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖరరెడ్డి కూడా జిల్లా కార్యవర్గం గురించి ఆలోచించడం లేదు. వారితో సమావేశాలు ఏర్పాటు చేయడం, మరో రెండు నెలల్లో రానున్న ఎన్నికలకు సంబంధించి, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయినట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇప్పటివరకు తిరుపతి నుంచి అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తూ వచ్చిన ఎం.వెంకటరమణకు పలు పార్టీల నుంచి ఆహ్వానం లభిస్తున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ నిస్తేజం
Published Fri, Jan 3 2014 4:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement
Advertisement