కేబినెట్ భేటీని ఏర్పాటు చేసిన గవర్నర్
హాజరుకానున్న సలహాదారులు
గురువారమే మరో రెండు కీలక సమావేశాలు
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి గురువారం మూడు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఇందులో రెండు సమావేశాలు హైదరాబాద్‌లో మరొకటి ఢిల్లీలో జరగనుంది. విభజనకు ఐదు రోజులు మాత్రమే గడువు ఉండటంతో సంబంధిత ప్రతిపాదనల ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గురువారం సాయంత్రం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గవర్నర్ సలహాదారులు సలావుద్దీన్ అహ్మద్, ఎ.ఎన్.రాయ్ ఈ భేటీలో పాల్గొంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. పదో షెడ్యూల్‌లో చేర్చాల్సిన సంస్థలకు సంబంధించిన ప్రతిపాదనలకు ఈ భేటీలో అమోదం తెలుపనున్నారు. అలాగే పోలవరం ముంపు ప్రాంతాలను ఖమ్మం జిల్లా నుంచి సీమాంధ్ర జిల్లాలకు మార్చాల్సి ఉంది.
ఈ ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలుపనున్నారు. అలాగే రాష్ట్ర విభజనకు సంబంధించిన మిగతా ప్రతిపాదనలన్నింటికీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలు పంపాల్సిందిగా గవర్నర్ కార్యాలయం మంగళవారం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో చివరి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని (ఎస్‌ఎల్‌బీసీ) సీఎస్ మహంతి గురువారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఇందులో గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ ప్రణాళిక అమలు పురోగతిని వివరించనున్నారు. అలాగే జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు వ్యవసాయ రుణాల మంజూరుపై కూడా చర్చించాల్సిందిగా గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్ర విభజన నేపథ్యంలోనూ బ్యాంకర్లు ఎప్పటిలాగానే రెండు రాష్ట్రాల రైతులకు వ్యవసాయ రుణాలను మంజూరు చేయాల్సిందిగా సీఎస్ కోరే అవకాశం ఉంది.
ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ సమావేశం
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక అంశాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు గురువారం ఉదయం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో సీఎస్ మహంతితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రుణంగా ఇచ్చిన రూ.17 వేల కోట్లను మాఫీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖను కోరనుంది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో శాంతిభద్రత ల పరిరక్షణకు, ఇతర సందర్భాల్లో కేంద్ర పోలీసు బలగాలను పంపినందున రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రూ.1,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. విభజన నేపథ్యంలో ఈ రూ.1,000 కోట్లను కూడా మాఫీ చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నారు. అలాగే కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలు ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందువల్ల రెండు ఆర్థిక సంవత్సరాల పాటు రెండు రాష్ట్రాలకు ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. విభజన నేపథ్యంలో సీమాంధ్ర రాష్ట్రానికి, అలాగే రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సాయం చేస్తామని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ఎంత మేరకు ఆర్థిక సాయం అందిస్తారనే అంశంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. సీమాంధ్ర రాష్ట్రానికి ఏర్పడే రెవెన్యూ లోటులో ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందనే అంశంపైనా చర్చించనున్నారు.
నేడు ఢిల్లీలో కీలక భేటీ
రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలపై చర్చ
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు బుధవారం ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలు, ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఏర్పాటైన రాష్ట్ర సలహా కమిటీ చైర్మన్ కమలనాథన్‌తోపాటు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్, సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, కేంద్ర హోం, సిబ్బంది మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు బుధవారం ఉదయం ఢిల్లీలో 10 గంటలకు సమావేశం కానున్నారు. ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాల ఖరారు అంశంలో భాగమైన రాష్ట్రపతి ఉత్తర్వులు, అధికరణ 371(డి), సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు, తెలంగాణ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతిపత్రాలపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. తద్వారా స్థూలంగా ముసాయిదా మార్గదర్శకాలపై ఒక అవగాహనకు రానున్నారు. అనంతరం వీటిని ప్రజల ముందు చర్చకు పెడతారు. అభ్యంతరాలు, సూచనలు, సలహాలకు రెండువారాల గడువిస్తారు. ఢిల్లీ సమావేశంలో పాల్గొనేందుకు కమలనాథన్, మహంతి, పీవీ రమేశ్, నాగిరెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. మరోవైపు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల పంపిణీ మార్గదర్శకాల ఖరారుకు ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ కూడా బుధవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ఇదిలా ఉండగా ఈ నెల 29, 30న ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎస్ మహంతి మంగళవారం హైదరాబాద్‌లో తనను కలసిన ఉద్యోగ సంఘాల నేతలతో చెప్పారు.
విభజన ప్రతిపాదనలకు రేపు ఆమోదం!
Published Wed, May 28 2014 2:12 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM
Advertisement