విభజన ప్రతిపాదనలకు నేడు ఆమోదం
గవర్నర్ ఆధ్వర్యంలో కేబినెట్ ప్రత్యేక సమావేశం
శాశ్వతంగా భవనాల కేటాయింపు
పోలవరం ముంపు ప్రాంతాల్లో మార్పులు
షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన
పదేళ్ల పాటు ప్రస్తుత ప్రవేశ పరీక్షల విధానం
పలు విభజన కమిటీల ప్రతిపాదనలకు ఆమోదం
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రతిపాదనల ఆమోదానికి గవర్నర్ నరసింహన్ ఆదివారం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేబినెట్ సమావేశాన్ని గవర్నర్ ఏర్పాటు చేయడం ఏమిటని ఆశ్యర్యపడుతున్నారా? రాష్ట్రపతి పాలనలో గవర్నర్ సీఎంగా, ఆయన సలహాదారులు మంత్రులుగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలోనే విభజన ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపడానికి ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గవర్నర్ సలహాదారులు సులావుద్దీన్ అహ్మద్, ఏ.ఎన్.రాయ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి పాల్గొంటారు. ఈ సమావేశంలో అన్ని శాఖలకు చెందిన విభజన ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. సచివాలయంతో పాటు రాజధానిలోని ప్రభుత్వ శాఖలు, సంస్థల భవనాలను ఇరు రాష్ట్రాలకు తాత్కాలికంగా కేటాయింపులు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గవర్నర్ నరసింహన్ తాత్కాలిక కేటాయింపులు కాకుండా శాశ్వత కేటాయింపులు చేయాలని నిర్ణయించడంతో జారీ చేసిన జీవోలు ఓపెన్ కాకుండా కాన్ఫిడెన్షియల్‌గా ఉంచారు. ఆదివారంనాటి సమావేశంలో సచివాలయంతోపాటు పలు శాఖల భవనాలను శాశ్వత కేటాయింపులుగా ఆమోదం తెలుపుతారు.
భద్రాచలం డివిజన్‌లోని పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. గతంలో పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలుగా జారీ చేసిన జీవోలో మరికొన్ని గ్రామాలను చేర్చాల్సి ఉంది. ఈ మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలకు గవర్నర్ నిర్వహించే కేబినెట్ సమావేశం ఆమోదం తెలుపుతుంది. అలాగే రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా రెండు రాష్ట్రాల్లో పదేళ్ల పాటు విద్యా సంస్థల్లో ప్రవేశపరీక్ష ప్రస్తుత విధానంలోనే కొనసాగే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది.
రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9, 10లో గల సంస్థలను రెండుగా విభజించడంతో పాటు ఏడాది పాటు అవే సంస్థలు ఇరు రాష్ట్రాలకు సేవలందించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే పలు శాఖలకు చెందిన విభజన కమిటీల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఫైళ్ల విభజన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఫైళ్ల విభజనతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన ఉమ్మడి కరెంట్ ఫైళ్ల స్కానింగ్ కూడా పూర్తి అయింది. 4.53 కోట్ల పేజీలను స్కానింగ్ చేశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో 42 వేల ప్రభుత్వ వాహనాలున్నట్లు గుర్తించారు. ఈ వాహనాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. అలాగే చరాస్తులు 4.69 లక్షలు కాగా స్థిరాస్తులు 66 వేలుగా గుర్తించారు.
శాఖల విలీనం, విభాగాల కుదింపు ఇరు రాష్ట్రాల సీఎంల ముందు రాష్ట్ర విభజన నేపథ్యంలో శాఖల విలీనం, విభాగాల కుదింపు ప్రతిపాదనలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంల ముందు ఉంచాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మంత్రుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖలను ఒకే శాఖ కింద విలీనం చేయడానికి అధికారులు ప్రతిపాదించారు. అలాగే విభాగాల సంఖ్య కుదింపునకు ప్రతిపాదించారు. కొత్త రాష్ట్రాల్లోని సీఎంల నిర్ణయం మేరకు శాఖల విలీనం, విభాగాల కుదింపు ఆధారపడి ఉంటుంది.
ఫైళ్ల విభజన ఇలా...
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ ఫైళ్లు 15.48 లక్షలు
ఆంధ్రప్రదేశ్ ఫైళ్లు 6.46 లక్షలు
తెలంగాణ ఫైళ్లు 6.26 లక్షలు
రెండు రాష్ట్రాలకు చెందిన ఫైళ్లు 2.76 లక్షలు
ఉమ్మడి రాష్ట్రంలో డిస్పోజల్ ఫైళ్లు 28.75 లక్షలు
ఆంధ్రప్రదేశ్ ఫైళ్లు 8.93 లక్షలు
తెలంగాణ ఫైళ్లు 10.33 లక్షలు
రెండు రాష్ట్రాలకు చెందిన ఫైళ్లు 9.49 లక్షలు