‘ఫలితాల’కు ముందే పూర్తిచేయాలి
మే 15వ తేదీ కల్లా విభజన పని పూర్తి చేయాలి
జూన్ 2 నుంచి రెండు రాష్ట్రాల్లోనూ పథకాలు,
కార్యక్రమాలు, సేవలు సజావుగా కొనసాగాలి
అధికారులతో సమీక్షలో నరసింహన్ ఆదేశం
హదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియను ఎట్టిపరిస్థితుల్లోను మే 15వ తేదీ కల్లా పూర్తి చేయాల్సిందిగా గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మే 16వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయని, ఆ తరువాత విభజన ప్రక్రియ కొనసాగేందుకు రాజకీయ ఒత్తిడిలు వస్తాయని, ఉద్యోగులు కూడా దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. కాబట్టి విభజనకు సంబంధించిన అన్ని రకాల ప్రక్రియలను మే 15వ తేదీకల్లా పూర్తి చేయాలని నిర్దేశించారు.
రాష్ట్ర విభజన ప్రక్రియపై గవర్నర్ శనివారం రాజభవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, విభజన అపెక్స్ కమిటీ చైర్మన్ ఎస్.పి.టక్కర్, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు అజేయ కల్లం, ప్రేమచంద్రారెడ్డి, పి.వి.రమేశ్, సాంబశివరావు, రామకృష్ణారావులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన అమలులోకి వచ్చే జూన్ రెండో తేదీన.. కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, సేవలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్పష్టంచేశారు.
ప్రధానంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ సరుకులు సరఫరా, వివిధ రకాల పింఛన్ల పంపిణీ, విత్తనాల సరఫరా రెండు రాష్ట్రాల్లో యధావిధిగా కొనసాగాలని.. ఇందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలో వ్యాట్, స్టాంపులు - రిజిస్ట్రేషన్లు, రవాణా, మద్యం, గనుల ద్వారా వచ్చే పన్నుల ఆదాయాలకు సంబంధించి ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం పేరుతో టిన్ నెంబర్లను తయారు చేయటంతో పాటు తెలంగాణ రాష్ట్రం పేరుతో రశీదులను, అవసరమైన నోటిఫికేషన్లను, రబ్బరు స్టాంపులను సిద్ధం చేయాలని గవర్నర్ సూచించారు.
జూన్ రెండు నుంచి ఈ-సేవ, మీ-సేవలు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో యధావిధిగా కొనసాగాలని, ఇందుకు అవసరమైన రశీదులను తెలంగాణ పేరుతో తయారు చేయాలని సూచించారు.
రాష్ట్ర విభజనలో ఆస్తులు, ఆప్పుల పంపిణీ పెద్ద సమస్య ఉండదని, అకౌంటెంట్ జనరల్ సూచన మేరకు ఇరు రాష్ట్రాల సంచిత నిధికి నిధులు జమ అవుతాయని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు గవర్నర్‌కు ప్రజెంటేషన్ ఇచ్చారు.
రాష్ట్ర విభజనపై ఏర్పాటైన వివిధ కమిటీల పనితీరును అపెక్స్ కమిటీ చైర్మన్ టక్కర్ గవర్నర్‌కు వివరించారు.
అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు సంబంధించి కేంద్రం ఇంకా కమిటీని ఏర్పాటు చేయకపోవడం పట్ల గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఫైళ్ల విభజనతో పాటు విభజను సంబంధించి ప్రతి పనినీ పద్ధతి ప్రకారం, పారదర్శకంగా మే రెండో వారానికల్లా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్, ఇతర సీనియర్ అధికారులకు గవర్నర్ సూచించారు.
రాష్ట్ర విభజనకు సంబంధించి సోమవారం ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు, శిక్షణ సంస్థలు, ఇంధన రంగాలపై గవర్నర్ సమీక్షిస్తారని సీఎస్ మహంతి తెలిపారు.
పునర్ వ్యవస్థీకరణ విభాగం అధికారుల్లో మార్పులు
రాష్ర్ట పునర్వ్యవస్థీకరణ విభాగం అధికారుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విభాగం నుంచి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావును తప్పించారు. కొత్తగా ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులకు చోటు కల్పించారు. ఈ విభాగానికి టక్కర్‌ను చైర్మన్‌గాను, సభ్యులుగా వి.నాగిరెడ్డి, పి.వి.రమేశ్, ఎన్. శివశంకర్, కౌముది, ఆర్.జి కలఘట్గిలను, కన్వీనర్‌గా జయేశ్ రంజన్ కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉద్యోగుల పంపిణీ సున్నిత సమస్య
ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీ చాలా కీలకాంశంగా మారనుందనే అభిప్రాయం గవర్నర్ సమీక్షలో వ్యక్తమైంది. ఉద్యోగుల పంపిణీ, ఏ ప్రాంతానికి చెందిన రాష్ట్ర కేడర్ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు, మార్గదర్శకాలు తదితర అంశాలపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్ గవర్నర్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు 84,200 ఉండగా వాటిలో 56 వేల పోస్టుల్లో మాత్రమే ఉద్యోగులు పనిచేస్తున్నారని, మిగతా పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయని వివరించారు. తెలంగాణలో పుట్టిపెరిగి తెలంగాణలో పనిచేస్తున్న వారి సంఖ్య, అలాగే సీమాంధ్రలో పుట్టిపెరిగి తెలంగాణలో పనిచేస్తున్న వారి సంఖ్యను కూడా రమేశ్ ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు.
జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల పంపిణీ జరగాల్సి ఉన్నప్పటికీ గతంలో ఏర్పడిన రాష్ట్రాల విభజన సందర్భంగా రెండు లేదా మూడేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగులు, అలాగే భార్య - భర్త కేసుల్లో ఉద్యోగులు ఇచ్చే ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుం దన్నారు. ఈ రెండు రంగాల్లో ఉద్యోగుల సంఖ్య 45 శాతం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. లెక్కలను పరిశీలించిన గవర్నర్ కూడా ఇది చాలా సున్నితమైన, సమస్యాత్మక అంశంగా మారనుందని, ఈ విషయంలో లెక్కలను ఒకటికి రెండు సార్లు సరిచూడాలని నిర్దేశించారు. ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను కమల్‌నాథన్ కమిటీ రూపొందించే మార్గదర్శకాల ఆధారంగా చేయాల్సి ఉంటుందని, ఈ విషయంలో రాజీపడ రాదని స్పష్టంచేశారు.