నాలుగు నెలల బడ్జెట్‌కు ఆమోదం
జూన్ 2నుంచి వ్యయానికి గవర్నర్ గ్రీన్‌సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌కు రూ. 34, 595 కోట్లు
తెలంగాణకు రూ. 26,516 కోట్లు
విభజన ప్రక్రియపై నరసింహన్ సమీక్ష
రాష్ర్ట విభజన చట్ట సవరణకు కేంద్రానికి పలు ప్రతిపాదనలు
సలహా కమిటీ పునర్వ్యవస్థీకరణకు నిర్ణయం
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జూన్ 2 నుంచి నాలుగు నెలల కాలానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించిన వేర్వేరు బడ్జెట్లను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 34,595 కోట్లు, తెలంగాణకు రూ. 26,516 కోట్లు కేటాయించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల వేతనాలు, ప్రభుత్వ నిర్వహణకు రెవెన్యూ బడ్జెట్ కింద రూ. 28,626 కోట్లు, ఆస్తుల కల్పనకు రూ. 3,882 కోట్లు కేటాయించారు. బడ్జెట్ లోటును ఆ రాష్ర్ట ప్రభుత్వం రుణాల రూపంలో భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ బడ్జెట్ కింద రూ. 21,295 కోట్లు, ఆస్తుల కల్పన కోసం రూ. 3,046 కోట్లు మంజూరు చేశారు. ఇక్కడ కూడా మిగిలిన నిధులను తెలంగాణ ప్రభుత్వం రుణంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆదివారం రాజ్‌భవన్‌లోని సుధర్మ బ్లాక్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితోపాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో గవర్నర్ నరసింహన్ సమావేశం నిర్వహించారు. ఆరు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఇప్పటికే శాసనసభ ఆమోదించిన విషయం విదితమే. కాగా రాష్ర్టపతి పాలన సందర్భంగా రెండు నెలల బడ్జెట్‌ను వ్యయం చేయగా.. మిగిలిన నాలుగు నెలల కాలానికి ఈ బడ్జెట్‌ను ఇరు రాష్ట్రాలకు గవర్నర్ కేటాయించారు. కాగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ పదిలో ఉన్న 107 సంస్థలకు అదనంగా మరో 38 సంస్థలను చేర్చి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
ఇక కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డుకు సంబంధించిన ప్రతిపాదనలు అసంబద్ధంగా ఉన్నట్లు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి.. గవర్నర్ దృష్టికి తీసుకుని వచ్చారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న 16 ప్రాజెక్టుల సమాచారాన్ని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చలేదన్నారు. నాగిరెడ్డి చేసిన ప్రతిపాదనను కూడా గవర్నర్ ఆమోదించి.. కేంద్రానికి పంపించారు. ఆ మేరకు చట్ట సవరణ చేయాలని కోరనున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఫైళ్ల విభజన, వాటి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని సీఎస్ వివరించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన స్థిర, చరాస్తుల పంపిణీ కూడా పూర్తయినట్లు తెలిపారు. వాహనాల కేటాయింపు ప్రక్రియ కూడా ముగిసిందన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఏర్పాటైన కమిటీలన్నీ తమ నివేదికలను అందించాయని, వాటిని కేంద్రానికి పంపిస్తున్నట్లు సీఎస్ చెప్పారు. సలహా, అపెక్స్ కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు కూడా ఆయన వివరించారు.
సలహా కమిటీలకు చైర్మన్‌గా కమలనాథన్ వ్యవహరిస్తారు. సభ్యులుగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, హోం, ఆర్థిక, న్యాయ శాఖల కార్యదర్శులు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ శాఖ కార్యదర్శి ఉంటారు. అపెక్స్ కమిటీలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కో చైర్మన్లుగా, ప్రణాళిక, హోం, ఆర్థిక, నీటిపారుల, ఇంధన, ఉన్నత విద్య, పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, రెవెన్యూ విభాగాల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. షెడ్యూల్ తొమ్మిదిలోని పరిశ్రమలు, కార్పొరేషన్లు.. వాటి విభజన ప్రతిపాదనలను ముగ్గురు నిపుణుల కమిటీకి ఇవ్వాలని సీఎస్ సూచించారు. అఖిల భారత, రాష్ట్ర సర్వీసు అధికారుల సమస్యలను కూడా ఈ సందర్భంగా సమీక్షించారు. ప్రభుత్వ క్వార్టర్ల విభజన కూ గవర్నర్ ఆమోదం తెలిపారు.