మహిళాసాధికారతను మాటలకే పరిమితం చేయొద్దు | Governor ESL Narasimhan Speech About Women Empowerment | Sakshi
Sakshi News home page

మహిళాసాధికారతను మాటలకే పరిమితం చేయొద్దు

Published Mon, Jan 21 2019 1:28 AM | Last Updated on Mon, Jan 21 2019 1:29 AM

Governor ESL Narasimhan Speech About Women Empowerment - Sakshi

నోవాటెల్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ జాగృతి యూత్‌ లీడర్‌షిప్‌ సదస్సుకు హాజరైన గవర్నర్‌ నరసింహన్‌. చిత్రంలో వాటర్‌మెన్‌ రాజేంద్ర సింగ్, ఎంపీ కవిత, రెజ్లర్‌ బబితా, మలావత్‌ పూర్ణ

సాక్షి, హైదరాబాద్‌:  మహిళాసాధికారతను మాటలకే పరిమితం చేయకుండా ఆచరించి చూపాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. మహిళలపై హింస, వివక్ష లేకుండా చూడాలని, వారి భద్రత, సౌకర్యాలకు పెద్దపీట వేయాలని సూచించారు. యువశక్తిలోనూ మహిళాశక్తి అంతర్భాగమని గుర్తించాలన్నారు. ఆదివారం ఇక్కడ హైటెక్స్‌లో జరిగిన తెలంగాణ జాగృతి ఇంటర్నేషనల్‌ యూత్‌ లీడర్‌షిప్‌ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్ముడు ప్రవచించిన అహింస, సహనం, ప్రేమ, శాంతి వంటి మహోన్నత లక్ష్యాలను స్ఫూర్తిగా తీసుకొని అన్ని రంగాల్లో యువత పురోగమించాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ, సహజవనరుల సంరక్షణ, మహిళలను గౌరవించడం వంటి అంశాలకు పెద్దపీట వేయాలని సూచించారు. యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు తెలంగాణ జాగృతి మూడురోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమం అద్భుతమన్నారు. సాంకేతికాభివృద్ధిని సమాజహితం కోసమే వాడాలని, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లతో కాలక్షేపం చేయకుండా వ్యక్తిగత, సమాజ హితం కోసం పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.  

వాతావరణ మార్పులపై అప్రమత్తత అవసరం
రామన్‌మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్‌ మాట్లాడుతూ గ్లోబల్‌ వార్మింగ్, వాతావరణ మార్పుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత ఐదేళ్లుగా తాను 40 దేశాల్లో జలసంరక్షణపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కవిత మాట్లాడుతూ ఈ సదస్సులో 110 దేశాలకు చెందిన 550 మంది ప్రతినిధులు పాల్గొన్నారని, ఐక్యరాజ్యసమితి 2015లో పేర్కొన్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యువతకు అవగాహన కల్పించామన్నారు. ఇక నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఇలాంటి సమ్మేళనాలను నిర్వహిస్తామని, జాగృతి సంస్థ యువశక్తితో గ్లోబల్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తుందన్నారు. తమ సంస్థ ద్వారా 19 వేలమందికిపైగా యువతకు వృత్తివిద్యలో శిక్షణనివ్వడంతోపాటు వారిలో 15 వేలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రెజ్లర్‌ బబితా పోగట్, ఎవరెస్ట్‌ను అధిరోహించిన మలావత్‌ పూర్ణలకు గవర్నర్‌ అవార్డులను ప్రదానం చేశారు. సామాజిక సేవారంగంలో విశిష్ట సేవలందించిన వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌కు జాగృతి జీవితకాల సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు.

భౌతిక అక్షరాస్యత పెంపొందించండి!
ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలన్న ధృడ సంకల్పం, క్రమశిక్షణ యువత విజయతీరాలకు చేరేందుకు తారకమంత్రాలని అంతర్జాతీయ క్రీడాకారులు అన్నారు. ఆదివారం ఇక్కడ ‘రెజిలియన్స్‌ ఫర్‌ యూత్‌ డెవలప్‌మెంట్‌: సక్సెస్‌ అండ్‌ బియాండ్‌’పేరుతో ఓ చర్చాగోష్టి జరిగింది.ఈ గోష్టికి అఫ్గానిస్తాన్‌కు చెందిన నీలమ్‌ భక్తియార్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. పుల్లెల గోపీచంద్‌ మాట్లాడుతూ ఈ కాలం పిల్లలకు అ, ఆ లు వస్తున్నా మన శరీర కదలికలపై అవగాహన లేకుండాపోతోందని, ఈ భౌతిక అక్షరాస్యత కల్పించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా అవసరమన్నారు. కొన్నేళ్ల క్రితం తాను ఒక 13 ఏళ్ల బాలికకు కోచింగ్‌ ఇస్తుండగా చేతులతో షటిల్‌ ఎలా పట్టుకోవాలో నేర్పించాలని ఆ బాలిక అడగడం తనలో ఎన్నో ఆలోచనలకు నాందీ అయిందని చెప్పారు. క్రీడాభివృద్ధికి ప్రభుత్వాలు ఏం చేయాలన్న ఎంపీ కవిత ప్రశ్నకు గోపీచంద్‌ సమాధానమిస్తూ ఇప్పటికిప్పుడు క్రీడల, కళల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టకపోతే సమీప భవిష్యత్తులోనే ఆసుపత్రులు, వైద్య పరిశోధనలపై ఎన్నోరెట్లు ఎక్కువ నిధులు ఖర్చుపెట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.  

నేనెవరికీ తీసిపోను: మలావత్‌ పూర్ణ
ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో మూడో బేస్‌క్యాంపు వద్ద బోలెడన్ని శవాలు కనిపించినా, తనపై తనకు నమ్మకం సడలలేదని, శిక్షణలో భాగంగా నేర్పించిన ‘‘నేను ఎవరికీ తీసిపోను.. ఏదైనా సాధించగలను’’అన్న నినాదాన్ని గుర్తు చేసుకుంటూ లక్ష్యాన్ని సాధించానని పూర్ణ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. డిగ్రీ చదువుతున్న తాను సివిల్‌ సర్వీసెస్‌లో చేరాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు.

వందరెట్లు ఎక్కువ కష్టపడ్డాం: బబిత
రెజ్లింగ్‌ శిక్షణ విషయంలో దంగల్‌ సినిమాలో చూపింది చాలా తక్కువని, వాస్తవానికి తమ తండ్రి ఇంతకు వందరెట్లు ఎక్కువ శ్రమ పెట్టారని రెజ్లర్‌ బబితా ఫొగాట్‌ తెలిపారు. ఆడపిల్లలను సుకుమారంగా పెంచడం, నియంత్రణ పెట్టడం సరికాదని, ఏ పనైనా చేయగలరన్న నమ్మకంతో ప్రోత్సహిస్తే విజయం కచ్చితంగా లభిస్తుందనేందుకు తమ తల్లిదండ్రుల పెంపకమే నిదర్శనమని ఆమె వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement