జిల్లాలో సమైక్య ఉద్యమం ఉద్ధృతరూపం దాల్చింది. రాష్ర్ట విభజన ప్రకటనకు వ్యతిరేకంగా జిల్లాలో అన్ని వర్గాల వారు ఆందోళన పట్టారు.
కొనసాగుతున్న నిరసనల హోరు జంక్షన్లు జామ్
Published Tue, Aug 6 2013 3:45 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్య ఉద్యమం ఉద్ధృతరూపం దాల్చింది. రాష్ర్ట విభజన ప్రకటనకు వ్యతిరేకంగా జిల్లాలో అన్ని వర్గాల వారు ఆందోళన పట్టారు. సోమవారం కూడా ఈ నిరసనల హోరు ఇసుమంతైనా తగ్గలేదు. పలు కూడళ్ల వద్ద, జాతీయ రహదారిపై సమైక్యవాదులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి, టైర్లను తగలబెట్టడంతో చాటా చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విద్యాసంస్థలు ఈ నెల 11 వరకు బంద్ ప్రకటించగా వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. మద్యం దుకాణాలను కూడా సమైక్యవాదులు బంద్ చేయిస్తున్నారు.
కురుపాం నియోజకవర్గంలో కేంద్ర మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఇంటి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ధర్నా చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం శివారుప్రాంతంలోని మజ్జిపేట కాలనీ వద్ద విజయనగరం నుంచి విశాఖ వెళుతున్న దుర్గ్ పాసింజర్, విశాఖ నుంచి విజయనగరం వస్తున్న గూడ్స్ రైలును ఆందోళనకారులు అరగంటపాటు అడ్డుకున్నారు. జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులంతా నోటికి నల్ల రిబ్బన్లు తగిలించుకుని మౌన దీక్ష చేపట్టారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్, దిగ్విజయ్ సింగ్, షిండే, సోనియా మాస్కులు ధరించిన వ్యక్తులను ఇనుప సంకెళ్లతో బంధించి ఊరేగించారు. టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టగా, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. విజయనగరంలో ఉద్యమాలు అధిక సంఖ్యలో జరగటంతో పట్టణానికి రాకపోకలు స్తంభించాయి.
ఆటోవాలాలు తమ వాహనాలను తిప్పకుండా స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, గజపతినగరం మార్గాల్లోని కూడళ్లలో నిరసన కారులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. శ్రీకాకుళం వెళ్లే రూటులో జమ్మునారాయణపురం వద్ద భారీ చెట్టును ఆందోళన కారులు నరికి వేసి రోడ్డుకు అడ్డంగా పడవేశారు. అలాగే విజయనగరం నుంచి విశాఖ వెళ్లే రహదారిలో కోర్టు జంక్షన్, వీటీ అగ్రహారం జంక్షన్‌ల వద్ద ఆందోళనకారులు ఉదయం 6 నుంచే రహదారులకు అడ్డంగా పెద్ద మొత్తంలో టైర్లను కాల్చి పడేశారు. మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమాలు చేపట్టడంతో జాతీయ రహదారుల్లో భారీ వాహనాలు బారులు తీరాయి. రాష్ర్ట కమిటీ పిలుపు నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది విధులు బహిష్కరించారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో పట్టణ వీధుల్లో మోటార్ వాహనాల ర్యాలీ జరిగింది.
అలాగే స్థానిక కోట జంక్షన్ వద్ద బహిరంగ సభ జరిగింది. ఆర్టీసీ ఎంప్లాయీస్ స్వచ్ఛందంగా బంద్ పాల్గొనడంతో సర్వీసులు రద్దయ్యాయి. నెల్లిమర్ల నియోజక వర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ఉపాధ్యాయులు విధులను బహిష్కరించి సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. భోగాపురం 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆందోళన కారులు ఓ వైపు వంటా వార్పు కార్యక్రమం చేపడుతూనే మరోవైపు వాలీబాల్ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. అలాగే డెంకాడలోని నాతవలస రహదారిని స్థానికులు రోజంతా దిగ్భందించారు. పూసపాటిరేగ మండలంలో సైతం జాతీయ రహదారిని ఆందోళన కారులు దిగ్బంధించారు. ఎస్.కోటలో గాంధీపార్క్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి సమైక్యవాదులు పాలాభిషేకం చేశారు. సర్వేపల్లి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు ‘జై సమైక్యాంధ్ర ’ అక్షరాల ఆకృతిలో మానవహారంగా ఏర్పాటై నిరసన వ్యక్తం చేశారు. వెయ్యి మంది విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్ కూడలి వద్ద టీడీపీ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం జరిగింది. ైవె ఎస్‌ఆర్ సీపీ నియోజక వర్గ సమన్వయ కర్త జి.ఉదయభాను ఆధ్వర్యంలో బాయ్స్ ఆర్‌సీఎం స్కూల్ విద్యార్థులు, కార్యకర్తలతో నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రాన్ని అందజేశారు. నర్సిపురంలో యువత ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. దీంతో సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. కురుపాం నియోజకవర్గం పరిధిలోని చినమేరంగిలో సుమారు రెండు వేల మందితో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెయిన్ బజార్‌లో సోనియా, బొత్స, కేసీఆర్, మన్మోహన్‌సింగ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. గజపతినగరం మండలంలోని మరుపల్లిలో పాలిటెక్నికల్ విద్యార్థులు ఖాళీ కంచాలతో రోడ్డుపై బైఠాయించారు.
మర్రివలస గ్రామంలో సమైక్యాంధ్రకు మద్ధతుగా గజపతినగరం నుంచి మెంటాడ వెళ్లే ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులను కూడా సుమారు 3గ ంటల పాటు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. అలాగే స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ప్రెస్‌క్లబ్ సభ్యులు ర్యాలీ నిర్వహించి, మానవహారంగా నిలబడ్డారు. చీపురుపల్లి మండలంలో మెట్టపల్లి గ్రామస్తులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాదయాత్ర చేసి చీపురుపల్లి మూడు రోడ్లు జంక్షన్ వరకు వచ్చి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఐదుగురు విద్యార్థులు గుండ్లు గీయించుకొని సమైక్యాంధ్రకు మద్ధతుగా నిరసన తెలిపారు. సాలూరు బోసుబొమ్మ కూడలిలో వాసవి కళాశాల విద్యార్థులు మానవహారం చేశారు. బైక్ మోకానిక్ యూనియన్ మోటార్ బైక్‌ల ర్యాలీ నిర్వహించింది. అనంతరం కేసీఆర్, సోనియా, బొత్సల దిష్టిబొమ్మలను దహనం చేశారు. మాజీ కౌన్సిలర్లు, రాజకీయ నాయకులు నిరసన దీక్షలు చేపట్టారు. మున్సిపల్ ఉద్యోగులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేశారు. న్యాయవాదులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు.
నేడు కొనసాగనున్న ఆందోళనలు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఆందోళన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోట నుంచి గంటస్తంభం వరకు నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక ప్రేమసమాజంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కళాకారులతో నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు.
Advertisement
Advertisement