దశ దిశలా... ఉద్యమ జ్వాల
Published Sat, Aug 10 2013 2:23 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
ఉద్యమ జ్వాల దశదిశలా వ్యాపించింది. విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఆందోళనలు జిల్లా వ్యాప్తంగా పదో రోజు కూడా కొనసాగాయి. అన్ని వర్గాల ప్రజలూ వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వివిధ వృత్తుల వారు తమ సత్తా చూపుతున్నారు. ఇంత ఉద్ధృతంగా ఉద్యమ సెగలు రగులుతున్నా చీమకుట్టినట్టయినా లేని ప్రజాప్రతినిధులను రోడ్ల మీద నిలదీస్తున్నారు. ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోతే ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరిస్తున్నారు.
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సమైక్య ఉద్యమం జిల్లాలో ఉప్పెనలా ఎగసిపడుతోంది. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించవద్దని కోరుతూ ప్రజలు చేయి చేయి కలిపి స్వచ్ఛందంగా ఆందోళనలు చేపట్టారు. ఎక్కడికక్కడ తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. పార్వతీపురంలో ఎమ్మెల్యే జయమణి వాహనాన్ని అడ్డుకున్న సమైక్యవాదులు, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే తాను రాజీనామా చేశానని, ఆ పత్రాన్ని పీసీసీ అధ్యక్షునికి పంపించాని ఆమె చెప్పడంతో వారు శాంతించి, వాహనానికి దారిచ్చారు. విజయనగరం పట్టణంలోని ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.
చాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు పట్టణంలోని అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ పాటించడంతో పాటు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అన్ని సంస్థల యజమానులు, సిబ్బంది మయూరి జంక్షన్ వద్దకు చేరుకుని మానవహారం నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. డీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 5 గంటల నుంచే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రహదారులపైకి వచ్చి బంద్ పాటించారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శుక్రవారం వినూత్న రీతిలో ప్రదర్శన చేపట్టారు. జేఏసీ కన్వీనర్ మామిడి అప్పలనాయుడు నేతృత్వంలో సోనియా, రాహుల్‌గాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దున్నపోతులతో తొక్కిస్తూ నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కోట జంక్షన్‌లో ఉపాధ్యాయులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. స్థానిక మయూరి జంక్షన్ వద్ద జరిగిన కార్యక్రమంలో సమైక్యవాదులంతా సమైక్యమే ముద్దు... విభజన వద్దు అంటూ నినాదాలు చేశారు.
విద్యుత్ ఉద్యోగులు ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విద్యుత్ భవనం ఎదుట చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం కొనసాగాయి. రిలే దీక్షల్లో పి. విద్యాసాగర్, ఎన్. సూర్యనారాయణ, వి.ఎ.వి. శర్మ, కే.దాలిరాజు, పి.శ్రీను, ఎ. శ్రీనివాస్ పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో 300 మంది విద్యుత్ ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విజయనగరం- శ్రీకాకుళం మార్గంలో రాస్తారోకో చేశారు. శ్రీ పైడిమాంబ యువజన సమరాంగణ కళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినూత్న తరహాలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కళాకారులంతా కత్తులు, కర్రలతో యుద్ధ విన్యాసాలు చేస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా అన్ని ప్రధాన కూడళ్లలో కళాకారులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
పీడబ్ల్యూ టింబర్ మర్చంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో మర్చంట్స్, సిబ్బంది భారీ ర్యాలీగా కోట జంక్షన్ వరకు వచ్చి అక్కడ మానవహారం చేపట్టిన అనంతరం కేసీఆర్, సోనియాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా వాహనాలకు జై సమైక్యాంధ్ర నినాదంతో కూడిన స్టిక్కర్లను అతికిస్తూ నిరసన చేపట్టారు. పట్టణంలోని మొబైల్స్ దుకాణాల యజమానులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నెల్లిమర్ల నియోజక వర్గంలో సమైక్యవాదుల ఆందోళన హోరెత్తింది. నెల్లిమర్ల నగర పంచాయతీతో పాటు నాలుగు మండలాల్లోనూ తీవ్రస్థాయిలో సమైక్యవాదులు ఆందోళన చేపట్టారు. నియోజక వర్గ కేంద్రమైన నెల్లిమర్లలో 200 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి విజయనగరం - పాలకొండ రహదారిని దిగ్బంధించారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మకు చెప్పులు వేసి ఊరేగించారు. కర్రలతో కొట్టి తమ నిరసన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి పతివాడ ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. వంటావార్పు కార్యక్రమం చేపట్టిన సమైక్య వాదులు రోజంతా రోడ్డుపైనే గడిపారు. పూసపాటిరేగ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై సమైక్యవాదులు ఆందోళన చేపట్టి రహదారిని దిగ్బంధించారు. డెంకాడ, భోగాపురం మండల కేంద్రాల్లో కూడా సమైక్యవాదుల నిరసనలు మిన్నంటాయి.
చీపురుపల్లి మూడు రోడ్ల జంక్షన్‌లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. గరివిడిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గరివిడి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గరివిడి-చీపురుపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో, వంటావార్పు చేశారు. జేఏసీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్‌ఓబీ జంక్షన్‌లో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.ఎస్.కోటలో జేఏసీ నేతృత్వంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. స్థానిక ఎల్‌ఐసీ ఏజెంట్లు శుక్రవారం నిరాహార దీక్షలు నిర్వహించారు. ఉపాధ్యాయులు పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. ఎస్.కోట మండలం గౌరీపురంలో విశాఖ - అరుకు రోడ్డుపై పలువురు నిరసనకారులు వంటావార్పు చేశారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా రామభద్రాపురం రోడ్డులో విద్యార్థులు ర్యాలీ చేపట్టగా, కొటారుబిల్లి జంక్షన్, తాటిపూడిలలో యువకుల బైక్ ర్యాలీ నిర్వహించారు. బొబ్బిలిలో సమైక్యాంధ్ర సాధన సమితి ఆధ్వర్యం తలపెట్టిన బొబ్బిలి బంద్ విజయవంతమైంది. కాంగ్రెస్ మినహా మిగిలిన రాజకీయ పార్టీలు, పట్టణంలోని దాదాపు 40 సంఘాల వారు దీనిలో పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్‌ఆర్ సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్‌కృష్ణరంగారావు పాల్గొన్నారు. ఆందోళనలో భాగంగా ప్రధాన రహదారిపై వంటావార్పు చేశారు.
బొబ్బిలి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల నిరాహారదీక్ష చేపట్టగా రాముడువలసలో కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మల దహనం చేశారు. రామభద్రపురం మండల కేంద్రంతో పాటు బూసాయవలస, ఆరికతోటల్లో వంటావార్పులు చేసి ఉద్యమకారులు తమ నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా మత్య్సకారులు, ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్, సైకిల్ మెకానికల్ వర్కర్స్, కల్లుగీత కార్మికులు సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు చేశారు. సాలూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించగా , ముస్లింలు సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన ర్యాలీ చేపట్టారు. పార్వతీపురంలో ఎమ్మెల్యే జయమణిని సమైక్యాంధ్రకు మద్దతుగా నినదించాలని సమైక్యాంధ్రా పర్యవేక్షణ పోరాటసమితి చుట్టుముట్టింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ముస్లింలు మౌన ప్రదర్శన చేపట్టగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంటవార్పు నిర్వహించారు.
Advertisement
Advertisement