రాకరాక వచ్చిన వర్షం జిల్లా రైతుల్లో హర్షం నింపగా.... రెండుకుటుంబాల్లో మాత్రం విషాదం కుమ్మరించింది. ఊరించి, ఊరించి కురిసిన వాన తనతో పాటు యమపాశాన్ని తీసుకొచ్చింది.
పిడుగు కాటుతోమృత్యు ఘోష వినిపించింది
Published Tue, Aug 6 2013 3:48 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
రాకరాక వచ్చిన వర్షం జిల్లా రైతుల్లో హర్షం నింపగా.... రెండుకుటుంబాల్లో మాత్రం విషాదం కుమ్మరించింది. ఊరించి, ఊరించి కురిసిన వాన తనతో పాటు యమపాశాన్ని తీసుకొచ్చింది. అమృతధారలు కురిపించి ధాన్యరాశులను పండించవలసిన చోట మృత్యు ఘోష వినిపించింది. బతుకు పండించుకోవాలని భాగానికి పొలం తీసుకున్న బడుగుజీవి కుటుంబానికి దిక్కులేకుండా చేసింది. కొడుకు కళ్లెదుటే తండ్రిని మరణశయ్యపై ఎక్కించింది. ఎస్.కోట మండలం కొట్టాం గ్రామ సమీపంలో సోమవారం పిడుగుపడడంతో ఒక వ్యవసాయ కూలీ, రైతు మృతి చెందారు. దీంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు...
కొట్టాం(శృంగవరపుకోట రూరల్), న్యూస్‌లైన్: కొట్టాం గ్రామ సమీపంలో ఉన్న నడిమిడెప్పి దగ్గర వ్యవసాయ పనుల కోసం వ్యవసాయ కూలీ గుర్రపు ముత్యాలు తాను భాగానికి చేస్తున్న పొలంలో పారతో గట్లను సరి చేసేందుకు మరో కూలీ కురుపిల్లి బుచ్చులతో కలిసి వెళ్లాడు. అక్కడకు దగ్గరలో ఉన్న తన పొలంలో వ్యవసాయపనులు చేసేందుకు అదే గ్రామానికి చెందిన రైతు బొడ్డు సూర్యారావు కూడా తన పెద్ద కుమారుడు బొడ్డు అవతారంతో పాటు రైతులు బొడ్డు అప్పన్న, బొడ్డు సింహాద్రిలతో కలిసి వెళ్లారు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉండగా మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో వర్షం పడడంతో వారంతా తమ పొలాలకు దగ్గరలో ఉన్న నక్కిడి చెట్టు కిందకు చేరుకున్నారు. ఇంతలో ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడడంతో గుర్రపు ముత్యాలు, బొడ్డు సూర్యారావు అక్కడికక్కడే మృతి చెందారు. అవతారం,బొడ్డు అప్పన్న, బొడ్డు సింహాద్రి, కురుపిల్లి బుచ్చులు గాయపడ్డారు.
గాయపడిన వ్యక్తుల్లో కొందరు గ్రామస్తులకు సమాచారం అందజేయడంతో వారు సం ఘటనా స్థలానికి వచ్చి మిగతా క్షతగాత్రులను జామి పీహెచ్‌సీకి తరలించారు. క్షతగాత్రుల్లో బొడ్డు అప్పన్న పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరంలోని కేంద్రాస్పత్రికి రిఫర్ చేశారు. కాగా మృతుల్లో గుర్రపు ముత్యాలు వ్యవసాయ కూలీ. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన మృతితో ఆ కుటుంబం వీధిన పడింది.
ఆయనకు భార్య నారాయణమ్మ, కుమార్తెలు కోటలక్ష్మి, పార్వ తి, కుమారుడు సురేష్ ఉన్నారు. మరో మృతుడు బొడ్డు సూర్యారావుకు భార్య కోట మ్మ, కుమారులు అవతారం, ప్రసాద్, కుమార్తె ప్రభ ఉన్నారు. మృతుడు సూర్యారావు చిన్న కుమారుడు బొడ్డు ప్రసాద్ చిత్తూరు జిల్లా నగ రి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా పని చేస్తున్నారు.
విషాదంలో కొట్టాం
పిడుగుపాటుకు కొట్టాం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో పాటు మరో నలుగురు గాయపడడంతో గ్రామంలో విషాదఛాయ లు అలుముకున్నాయి. మృతుల కుటుంబీకుల రోదనలు గ్రామంలో మిన్నంటాయి. గ్రామానికి చెందిన వారంతా మృతుల కుటుంబీకులను పరామ ర్శించి వారిని ఓదార్చుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
పిడుగుపాటుకు మృతి చెందిన గుర్రపు ముత్యాలు, బొడ్డు సూర్యారావు కుటుంబాలతో పాటు గాయపడిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆ గ్రామ మాజీ సర్పంచులు జి. నారాయణమూర్తి, ఎస్. కోటారావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు తూర్పాటి శ్రీను, తదితరులు కోరుతున్నారు.
కాగా వీఆర్‌ఓ పి. అప్పల గురువులు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎ సంతోష్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని హెచ్‌సీలు వెంకటరావు, నాగేశ్వరరావు పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు.
Advertisement
Advertisement