రచ్చబండలో సీఎం ఫ్లెక్సీలు చించటం, తగులబెట్టటం ఏంటి నాన్సెన్స్..ఇది శోచనీయం.. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయనే ప్రభుత్వ సారధి, ఆయనకు రెండు ప్రాంతాల ప్రయోజనాలు చూడాల్సిన బాధ్యత ఉంది.
కూసుమంచి, న్యూస్‌లైన్: రచ్చబండలో సీఎం ఫ్లెక్సీలు చించటం, తగులబెట్టటం ఏంటి నాన్సెన్స్..ఇది శోచనీయం.. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయనే ప్రభుత్వ సారధి, ఆయనకు రెండు ప్రాంతాల ప్రయోజనాలు చూడాల్సిన బాధ్యత ఉంది... రాష్ట్ర విభజనపై సీఎం వాదనలో తప్పేం లేదు, సీఎం క్రమశిక్షణ కలిగిన నాయకుడు’- అంటూ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని సమర్థిస్తూ వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌నుంచి జిల్లా పర్యటనకు వచ్చిన రేణుకాచౌదరికి జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఆమె పైవిధంగా స్పందించారు.
సీఎం సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడుతున్నారు... తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్నప్పుడు ఆయనకు ఈలెక్కలు గుర్తుకు రాలేదా అంటూ విలేకరులు ప్రశ్నించగా నాడు ఆయన కూడా ఆత్మహత్యలు వద్దని అప్పీలు చేశారుగా, సీఎం ఏప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు..రెండు ప్రాంతాలకు సమన్యాయం గురించి మాట్లాడుతున్నారే తప్ప మరోలా కాదు అంటూ రేణుకాచౌదరి బదులిచ్చారు. ఒక సమస్య వలన మరో సమస్య తలెత్తకూడదనేది సీఎం ఆలోచనని అన్నారు. సీఎం రాష్ట్ర విభజనపై తలెత్తే సమస్యలను ముందుంచుతున్నారు.. ఆయనను కేంద్రం సీఎంగా నియమించింది తన భాధ్యతను తాను నిర్వర్తించాల్సిన బాధ్యత ఆయనపై ఉందని అన్నారు.
‘జిల్లా ఆడబిడ్డగా భద్రాచలం నుంచి గడ్డిపోచను కూడా పోనివ్వను..ఖబడ్దార్’ అంటూ ఈ సందర్భంగా రేణుకాచౌదరి అన్నారు. భద్రాద్రి రాముడు ఆశీస్సులతో, కాంగ్రెస్ కార్యకర్తల అండతో భద్రాచలాన్ని కాపాడేందుకు పోరాడతానని అన్నారు. నేను జిల్లా ఆడబిడ్డగా జిల్లాకోసం పోరాడుతున్నా ..నాకు అడ్డుచెప్పేవారు ఉంటే ముందుకు రమ్మనండి అంటూ సవాల్ విసిరారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రేస్ నాయకులు సోమ్లా నాయక్, అయితం సత్యం, పోరిక లక్ష్మీబాయి, రాయల నాగేశ్వరరావు, పరుచూరి మురళీకృష్ణ , కొరివి వెంకటరత్నం, పోటు లెనిన్ తదితరులు పాల్గొన్నారు.