ఆ ముగ్గురి ఎన్నిక లాంఛనమే! | Three nominations have been filed for the Rajya Sabha biennial election | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురి ఎన్నిక లాంఛనమే!

Published Fri, Feb 16 2024 4:19 AM | Last Updated on Fri, Feb 16 2024 5:59 AM

Three nominations have been filed for the Rajya Sabha biennial election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలో భాగంగా రాష్ట్రం నుంచి మూడు స్థానాలకు గాను మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం నామినేషన్ల గడువు పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి రెండు, బీఆర్‌ఎస్‌ నుంచి ఒక నామినేషన్‌ దాఖలు కావడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి సీనియర్‌నేత రేణుకా చౌదరి, యువనేత అనిల్‌కుమార్‌ యాదవ్‌ చెరి మూడేసి సెట్ల చొప్పున, బీఆర్‌ఎస్‌ నుంచి వద్దిరాజు రవిచంద్ర రెండుసెట్ల నామినేషన్‌పత్రాలను సమర్పించారు.

కాంగ్రెస్‌ అభ్యర్థులు మూడే    సి సెట్ల నామినేషన్లలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు (ఒక్కో దాంట్లో పదేసి మంది చొప్పున మొత్తం 60 మంది సభ్యులు)సంతకాలు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. గురువారం రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఉపేందర్‌రెడ్డికి రేణుకా చౌదరి తమ నామినేషన్‌ పత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో సమర్పించారు.

అనిల్‌కుమార్‌ యాదవ్‌ తమ పత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు డి. శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో అందజేశారు. వద్దిరాజు రవిచంద్ర తమ పత్రాలను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు గంగుల కమలాకర్, నాగేందర్, జగదీశ్‌రెడ్డి సమక్షంలో రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు.  

రేణుక, అనిల్‌కు బీఫామ్స్‌ అందజేసిన సీఎం 
అంతకుముందు సీఎం చాంబర్‌లో అభ్యర్థులు రేణుకాచౌదరి, అనిల్‌కుమార్‌కు రేవంత్‌రెడ్డి బీఫామ్స్‌ అందజేసినపుడు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆదిశ్రీనివాస్, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఈర్లపల్లి శంకర్, తదితరులున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించారు. గురువారం ఉదయం తెలంగాణ భవన్‌లో జరిగిన సంత్‌ సేవాలాల్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న వద్దిరాజు తెలంగాణ తల్లి విగ్రహానికి దండలు వేసి అసెంబ్లీకి చేరుకున్నారు. తొలుత అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరుల స్తూపానికి నివాళులర్పించారు. 

ఎన్నిక ఏకగ్రీవమే! 
వచ్చే ఏప్రిల్‌ 2న బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్‌ పదవీ కాలం ముగియనుండడంతో రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి.

ఈ మూడు సీట్లకు గాను నామినేషన్ల గడువు ముగిసే సమయానికి మూడు నామినేషన్లే దాఖలు కావడంతో... కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బలాబలాల ఆధారంగా ఈ నెల 27న ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేకుండానే వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

ఈ నేపథ్యంలో ఈ నెల 16న పత్రాల నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 20న నామినేషన్ల ఉపసంహరణకు అఖరి రోజు. ఈ గడువు ముగియగానే ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement