renuka chaudhary
-
రాజ్యసభకు ఆ ముగ్గురూ ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోటాలో మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ఒక్కరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రక టించారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వారి లో కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్, వద్ది రాజు రవిచంద్ర మంగళవారం రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డి చేతుల మీదుగా ఎన్నిక ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. బుధవారం ధ్రువీకరణ పత్రం తీసుకుంటానని రేణుకా చౌదరి రిటర్నింగ్ అధికారికి సమాచారం ఇచ్చారు. భారీ ప్రదర్శనగా వచ్చిన అనిల్ యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ ధ్రువీకరణ పత్రాన్ని అందుకునేందుకు పార్టీ కార్యకర్తలతో భారీ ప్రదర్శనగా అసెంబ్లీకి చేరుకున్నారు. అనిల్ వెంట ఆయన తండ్రి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తదితరులున్నారు. అనిల్‌కుమార్ యాదవ్‌ను అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుతో పాటు పలువురు అభినందించారు. ఈ సందర్భంగా అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజ్యసభకు వెళ్లే అవకాశం దక్కడం తన విజయం కాదని, తెలంగాణ యువజన కాంగ్రెస్ విజయమని వ్యాఖ్యానించారు. ఒక బీసీ బిడ్డను పెద్దల సభకు పంపి కాంగ్రెస్ అధిష్టానం బీసీలందరికీ తగిన గౌరవం ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్‌కు రుణపడి ఉంటానన్న వద్దిరాజు రాజ్యసభకు 2022లో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరపున తొలిసారిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర మరోమారు రాజ్యసభలో అడుగు పెడుతున్నారు. రెండోమారు రాజ్యసభకు ఎన్నికైన ఆయన రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్ గుప్తాతో పాటు పార్టీ నాయకులు ఉన్నారు. తనను రెండోసారి రాజ్యసభకు పంపిన పార్టీ అధినేత కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని, తెలంగాణకు రావాల్సిన విభజన హామీలపై పార్లమెంటులో గొంతెత్తుతానని వద్దిరాజు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయడంతో పాటు కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి అయ్యేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. కాగా, ఈ నెల 8న రాష్ట్రం కోటాలో మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా 15 వరకు నామినేషన్లు స్వీకరించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్ ఒక స్థానం దక్కాయి. మూడు స్థానాలకు ముగ్గురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడం.. పరిశీలన, విత్‌డ్రా గడువు ముగియడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంగళవారం రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. -
కొత్త ఈక్వేషన్స్.. ఖమ్మం.. రసవత్తర రాజకీయం
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఖమ్మం జిల్లాకు నేతలకు రాజ్యసభ అవకాశం కల్పించడం ఇప్పుడు కొత్త సమీకరణాలకు దారి తీసింది. నిజానికి రాజ్యసభకు వెళ్తున్న ఇద్దరూ ఖమ్మం పార్లమెంట్ బరిలో నిలుస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, పార్టీలు మాత్రం కొత్త ఊహగానాలకు తెరలేపారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేలు, మిత్రపక్షమైన సీపీఐ ఎమ్మెల్యే కలిపి 65 మంది ఉన్నారు. సంఖ్యా బలం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ రెండు రాజ్యసభ స్థానాలు గెలుచుకోనుంది. ఇక బీఆర్ఎస్కు ఎమ్మెల్యేల సంఖ్య ఆ పార్టీ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర గెలుపు కూడా లాంఛనమే కానుంది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరీ అయినా, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు అయినా.. ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు కావడం విశేషం. రేణుకాచౌదరీ కమ్మ సామాజిక వర్గం కాగా.. వద్దిరాజు రవిచంద్ర కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. గత కొన్నాళ్లుగా నేనే పోటీ చేస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు. సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటి చేయకపోతే ఖమ్మం సీటు నుంచి తానే పోటీ చేస్తానంటూ టీవీ ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. ఖమ్మం నుంచి తనకు మాత్రమే అర్హత ఉందని రేణుకా చౌదరీ చెప్పుకోవడం పార్టీలో పెద్ద దూమారమే రేపింది. రేణుకా చౌదరి ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా విజయం సాధించారు. అయితే, 2009లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై, 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. టీడీపీలో ఉండగా రేణుకాచౌదరి 1997–98లో దేవెగౌడ కేబినెట్లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1998లో కాంగ్రెస్‌లో చేరారు. ఈసారి ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో టికెట్ కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే.. ఆమెను ప్రత్యక్ష ఎన్నికల బరినుంచి అధిష్టానం తప్పించి రాజ్యసభకు పంపింది. ఇక ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా ఎవరు పోటీ చేయనున్నారన్న దానిపై చర్చ మొదలైంది. ప్రస్తుతం రేసులో ముగ్గురు ఆశావాహులు ఉన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు నామినేట్ అవుతోన్న వద్దిరాజు రవిచంద్రది కాపు సామాజిక వర్గం. తెలంగాణలో కాపులు, మున్నూరు కాపులు, రెడ్డి కాపులున్నారు. ఈ ఓట్లు ఎక్కువగా నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో మూడు పార్లమెంటు స్థానాలున్నాయి. వద్దిరాజుకు అవకాశం ఇచ్చాం కాబట్టి కాపు ఓట్లపై కన్నేయాలన్న ఆలోచన బీఆర్ఎస్లో కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు టికెట్ దాదాపు ఖారారు అయ్యే అవకాశం ఉంది. ఇదీ చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్‌లో ఉన్నారు: బండి సంజయ్ -
ఆ ముగ్గురి ఎన్నిక లాంఛనమే!
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలో భాగంగా రాష్ట్రం నుంచి మూడు స్థానాలకు గాను మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం నామినేషన్ల గడువు పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు, బీఆర్ఎస్ నుంచి ఒక నామినేషన్ దాఖలు కావడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్‌నేత రేణుకా చౌదరి, యువనేత అనిల్‌కుమార్ యాదవ్ చెరి మూడేసి సెట్ల చొప్పున, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర రెండుసెట్ల నామినేషన్‌పత్రాలను సమర్పించారు. కాంగ్రెస్ అభ్యర్థులు మూడే సి సెట్ల నామినేషన్లలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు (ఒక్కో దాంట్లో పదేసి మంది చొప్పున మొత్తం 60 మంది సభ్యులు)సంతకాలు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. గురువారం రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డికి రేణుకా చౌదరి తమ నామినేషన్ పత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో సమర్పించారు. అనిల్‌కుమార్ యాదవ్ తమ పత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు డి. శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో అందజేశారు. వద్దిరాజు రవిచంద్ర తమ పత్రాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు గంగుల కమలాకర్, నాగేందర్, జగదీశ్‌రెడ్డి సమక్షంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రేణుక, అనిల్‌కు బీఫామ్స్ అందజేసిన సీఎం అంతకుముందు సీఎం చాంబర్లో అభ్యర్థులు రేణుకాచౌదరి, అనిల్‌కుమార్‌కు రేవంత్‌రెడ్డి బీఫామ్స్ అందజేసినపుడు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆదిశ్రీనివాస్, మల్రెడ్డి రంగారెడ్డి, ఈర్లపల్లి శంకర్, తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించారు. గురువారం ఉదయం తెలంగాణ భవన్లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న వద్దిరాజు తెలంగాణ తల్లి విగ్రహానికి దండలు వేసి అసెంబ్లీకి చేరుకున్నారు. తొలుత అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరుల స్తూపానికి నివాళులర్పించారు. ఎన్నిక ఏకగ్రీవమే! వచ్చే ఏప్రిల్ 2న బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ పదవీ కాలం ముగియనుండడంతో రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ మూడు సీట్లకు గాను నామినేషన్ల గడువు ముగిసే సమయానికి మూడు నామినేషన్లే దాఖలు కావడంతో... కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలాబలాల ఆధారంగా ఈ నెల 27న ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేకుండానే వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న పత్రాల నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 20న నామినేషన్ల ఉపసంహరణకు అఖరి రోజు. ఈ గడువు ముగియగానే ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. -
రేణుకమ్మల పోలరైజ్ పాలిటిక్స్
కొమ్మినేని శ్రీనివాసరావు : తెలంగాణలో కమ్మ సామాజికవర్గ ప్రతినిధిగా తనను తాను ఫోకస్ చేసుకోవడానికి కాంగ్రెస్‌నేత రేణుకాచౌదరి చాలా కష్టపడుతున్నారు. అందులో భాగంగా ఆమె కాంగ్రెస్ అధిష్టానం వద్దకు కొందరు కమ్మ జేఏసీ నేతలను తీసుకెళ్లారు. వచ్చే అసెంబ్లీఎన్నికల్లో కమ్మ వర్గానికి పన్నెండు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1982లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఏపీలో రెండు పార్టీల వ్యవస్థ ఆవిర్భవించిందని చెప్పాలి. 1983కు ముందు కమ్మవర్గం కాంగ్రెస్‌తోనే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. తదుపరి టీడీపీ కమ్మ సామాజికవర్గం ఆధిపత్యంలో ఉంటే, కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యంలో ఉన్నట్టు లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఆయా ఎన్నికల్లో ఇతర సామాజిక వర్గాలను ఎవరు ఆకర్శించగలిగితే ఆ పార్టీ అధికారంలోకి వస్తోంది. రెడ్డి సామాజికవర్గం ఆంధ్ర, తెలంగాణలలో రెండు చోట్ల ప్రాముఖ్యత కలిగి ఉంది. కమ్మ వర్గం ప్రధానంగా ఆంధ్రకే పరిమితమైందని చెప్పాలి. రెడ్డి వర్గం ప్రతి ఎన్నికలోనూ రెండు ప్రాంతాల్లో కలిపి సుమారు ఎనభై నుంచి తొంభైమంది ఎమ్మెల్యేలుగా గెలుస్తుంటే.. కమ్మవర్గం అత్యధికంగా ఆంధ్రలోనే గెలుస్తోంది. రెండు ప్రాంతాల్లో కలిపి వీరు అత్యధికంగా 1994లో 53 మంది, అత్యల్పంగా 2018లో తెలంగాణలో ఐదుగురు, 2019లో ఏపీలో పదిహేడు మంది అంటే రెండు రాష్ట్రాలలో కలిపి ఇరవై రెండు మంది గెలిచారు. 2014లో రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 38 మంది.. ఉమ్మడి ఏపీలో 2009లో 27, 2004లో 35, 1999లో 43, 1994లో 53 , 1989లో 36, 1985లో 52, 1983లో 51, 1978లో 41, 1972లో 35, 1967లో 41, 1962లో 39 మంది గెలిచారు. అయితే ఇప్పటివరకు తెలంగాణలో మాత్రం కమ్మ వర్గం నుంచి 1985లో అత్యధికంగా ఎనిమిది, మిగతా ఎన్నికల్లో రెండు నుంచి ఏడుగురు వరకు మాత్రమే గెలిచారు. ఎవరు అధికారంలోకి వస్తే.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోనూ టీడీపీ ఉనికిని నిలబెట్టడానికి కమ్మ వర్గం యత్నించింది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుతో ఇక్కడ మొత్తం పార్టీ కకావికలమైంది. దీంతో కమ్మవర్గం వారు ఏ పార్టీకి అధికారం వస్తే అటువైపు మొగ్గు చూపడానికి అధికంగా ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది. గత రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్ ) పాలన పగ్గాలు చేపట్టగా... కమ్మవర్గం ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలిచినా అంతా బీఆర్ఎస్లో చేరిపోయారు. రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి కొందరు టీఆర్ఎస్లో చేరినా, పూర్తిగా ఆ పార్టీకి దూరం కాలేదు. 2018 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంతో కమ్మవర్గం నేతలు కూడా ఆ బాట పట్టారు. కానీ పెద్దగా ఫలితం సాధించలేకపోయారు. టీఆర్ఎస్ పక్షాన పోటీచేసిన ఐదుగురు కమ్మ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. టీడీపీ లేదా కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా గెలవలేదు. చివరికి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనుమరాలు, మాజీ మంత్రి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్పల్లి నుంచి పోటీచేసి ఘోర పరాజయం పొందారు. ఏ వర్గం వారైనా కేవలం కులం ఆధారంగానే గెలవరని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. టీడీపీ సెంటిమెంట్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలవడాన్ని చాలామంది జీర్ణిం చుకోలేకపోయారు. దానికి తోడు విభజిత ఆంధ్రలో అప్పటికే చంద్రబాబుపై ఏర్పడిన విపరీతమైన వ్యతిరేకత కూడా ప్రభావం చూపింది. 2014లో టీఆర్ఎస్ నుంచి ఒక్క కమ్మ అభ్యర్థి గెలుపొందలేదు. ఇద్దరు టీడీపీ నుంచి, ఇద్దరు కాంగ్రెస్ నుంచి , ఒకరు బీఎస్పీ నుంచి విజయం సాధించారు. తదుపరి కాలంలో వీరంతా టీఆర్ఎస్లోకి జంప్ చేశారు. తర్వాత ఒక ఉప ఎన్నిక ద్వారా మరో కమ్మ నేత టీఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్యే అయ్యారు. తెలంగాణలో పెద్దగా బలంగా లేకున్నా.. ఉమ్మడి ఏపీలో ఎన్నికలు జరిగినప్పుడు పరిశీలిస్తే... 2009లో తెలంగాణలో ముగ్గురు గెలవగా, వారిలో ఇద్దరు టీడీపీ, ఒకరు లోక్‌సత్తాకు చెందినవారు. 2004లోనూ ఈ వర్గం వారు ముగ్గురే గెలిచారు. ఒకరు కాంగ్రెస్ నుంచి, ఇద్దరు ఇతరులు కావడం విశేషం. టీడీపీ నుంచి ఎవరూ గెలవలేదు. 1999లో టీడీపీ పక్షాన ముగ్గురు విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి ఎవరూ గెలవలేదు. 1994లో ఆరుగురు విజయం సాధించగా.. టీడీపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ఒకరు, ఇతరులు ఒకరు గెలిచారు. 1989లో ముగ్గురు గెలిస్తే టీడీపీ నుంచి ఒకరు, ఇద్దరు ఇతర పార్టీలవారు. 1985లో మొత్తం ఎనిమిది మందికిగాను ఆరుగురు టీడీపీ, ఇద్దరు టీడీపీ కూటమిలోని ఇతర పార్టీలవారు. తెలంగాణ చరిత్రలో ఈ ఎన్నికలోనే కమ్మ వర్గం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అవడం విశేషం. 1983లో గెలిచిన ఏడుగురు కమ్మ ఎమ్మెల్యేలు టీడీపీ వారే. ఎన్.టి.రామారావు ప్రభంజనం వీయడంతో వీరు విజయం సాధించారు. అంతకుముందు 1978 ఎన్నికలలో కమ్మ వర్గం వారు ఐదుగురు, 1972, 1967లలో నలుగురు 1962లో ఇద్దరు గెలుపొందారు. స్థూలంగా చూస్తే తెలంగాణ ప్రాంతంలో కమ్మ సామాజికవర్గం ఎప్పుడూ పెద్ద బలంగా లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ వర్గం ఓన్ చేసుకోవడానికి యత్నించింది. అది కొంతకాలం బాగానే సాగినా.. తర్వాత అది నెగిటివ్‌గా మారుతోంది. ప్రత్యేకించి 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం వారు ఎక్కువగా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న భావనతో ఇతర వర్గాలవారు ఆ పార్టీకి దూరమయ్యారు. ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పడానికే.. తాజా పరిణామాలలో కమ్మ ఓటర్లను పోలరైజ్ చేయడానికి రేణుకాచౌదరి వంటివారు యత్నిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ వర్గం సంఖ్య కాస్త ఎక్కువగా ఉండటమే కారణం. నిజంగానే కమ్మ వర్గానికి అంత బలముంటే చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకే మద్దతు ఇవ్వవచ్చు కదా! అలా చేయడం లేదంటే కారణం అర్థం చేసుకోవచ్చు. అయినా రేణుక వంటివారు కమ్మ వర్గాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీలో అవినీతి కేసు నమోదై జైలుకు వెళితే దానిని కమ్మ సామాజికవర్గంపై దాడిగా ఆమె ప్రచారం చేసింది. ఎందుకైనా మంచిదని ఇతర పార్టీలవారు కూడా అదే బాటలో మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీనపడిపోయిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు ఆ వర్గం వారిని కాంగ్రెస్‌కు అంటగట్టడానికి యత్నిస్తున్నాయి. నిజానికి ఆ వర్గం కానీ, ఆయా సెటిలర్ వర్గాలుగానీ కొంతకాలం క్రితం వరకు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారన్న అభిప్రాయముంది. కానీ చంద్రబాబు అరెస్టు తర్వాత కమ్మ వర్గాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించడానికి కొందరు వ్యూహాలు పన్నుతున్నారు. నిజానికి ఏ కులం వారైనా తమ ఇష్టం వచ్చిన పార్టీకి మద్దతు ఇవ్వొచ్చు. కానీ ఒక భావజాలాన్ని వ్యాప్తిలోకి తెచ్చి, కమ్మవారు ఫలానా పార్టీకి అనుకూలం అనుకోవాలనేది వారి వ్యూహం. రేణుకాచౌదరి ఖమ్మం జిల్లాలో తనకు, తనవారికి టికెట్లు ఇప్పించుకోవడానికి కులం కార్డు ఉపయోగిస్తున్నారు. నలభై నియోజకవర్గాల్లో కమ్మ వర్గం గణనీయంగా ఉందని.. ముప్పై చోట్ల గెలుపోటములు నిర్ణయించే దశలో ఉందని, పది చోట్ల విజయావకాశాలు కలిగి ఉందని కమ్మ ఐక్యవేదిక కాంగ్రెస్ అధినాయకత్వానికి వివరించింది. వీటిలో ఎక్కువ భాగం హైదరాబాద్ పరిసరాల్లోనివే కాగా.. కొన్ని నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోనివి. జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఖమ్మం, మల్కాజిగిరి, కొత్తగూడెం, కోదాడ, పాలేరు మొదలైన చోట్ల టికెట్లు ఆశిస్తున్నట్లు ఈ వేదిక తెలిపింది. ఒకరకంగా ఇది కులం పేరు చెప్పుకుని కొందరు ఆయా పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాంగ్రెస్‌కు నష్టం చేస్తుందా? ఏ సామాజికవర్గం వారికైనా వారి సత్తాను బట్టి పార్టీలు టికెట్లు ఇస్తాయి. కాకపోతే కమ్మ వర్గం కొంత ఆర్థిక బలం కూడా కలిగి ఉంటుందన్న అభిప్రాయం ఉంది. టీఆర్ఎస్ కమ్మ వర్గానికి చెందిన ఐదుగురికి టికెట్లు కేటాయించింది. కాంగ్రెస్ అంతకు మించి ఇస్తుందా అన్నది సందేహమే. ఈ వర్గం నేతల హడావుడి కారణంగా కాంగ్రెస్ హైకమాండ్ బీసీవర్గం నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదట. అది ఆ పార్టీకి తలనొప్పి అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదేదో కమ్మ వర్గం వారికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వకపోతే నష్టం అనుకుంటే అది పెద్ద పొరపాటు అవుతుంది. పైగా ఇతర వర్గాల్లో అపోహలు పెరిగే అవకాశం ఉండవచ్చు. అసలే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికీ చంద్రబాబుకు సన్నిహితుడన్న ప్రచారం ఉండగా.. ఆయనను రేణుకాచౌదరి వంటివారు ఇలాంటి వివాదాలలోకి తీసుకెళ్లకుండా ఉంటేనే పార్టీకి ప్రయోజనం అని చెప్పాలి. ఏది ఏమైనా అరవై ఐదేళ్ల తెలంగాణ ఎన్నికల చరిత్రను చూస్తే కమ్మ సామాజికవర్గం అంత ప్రభావశీలిగా లేదనే చెప్పాలి. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేయడంలో భాగంగా ఏ పార్టీ అయినా ఇతర కులాలతోపాటు కమ్మవారు కొందరికి కూడా టికెట్లు ఇస్తాయి. కానీ అదే సమయంలో ప్రత్యేకించి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక గ్రూపు తయారై అనవసరంగా రాజకీయాలు చేస్తూ ఆ వర్గం వారికి అప్రతిష్ట తేకుండా ఉంటే అదే పదివేలు అని చెప్పాలి. -
ఎన్నికల వేళ ఇదేం గోల?.. కాంగ్రెస్ నేతలకు క్లాస్.. అయినా!
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఓవైపు ఎన్నికలు తరుముకొస్తుంటే మీరిలా పరస్పరం ఫిర్యాదులు చేయడం, లేఖలు రాయడం ఏమిటి? ఎన్నికల వేళ ఈ లొల్లి ఆగకపోతే ఎలా? కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే రాష్ట్రాల్లో తెలంగాణ తొలి స్థానంలో ఉంది. కష్టపడి పార్టీని గెలిపిస్తే మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యేది మీరే... మేం కాదు. కర్ణాటక నేతలను చూసి నేర్చుకోండి. వారిని ఆదర్శంగా తీసుకొని ఈ 100 రోజులు ఐకమత్యంగా పనిచేయండి’అని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నారు. శనివారం గాంధీ భవన్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యక్షతన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతల అనైక్యత గురించి వేణుగోపాల్ మాట్లాడారు. నేతల మధ్య భేదాభిప్రాయాలను అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకుంటూ నిరంతరం ప్రజల్లోనే ఉండాలని సూచించారు. బరాబర్... కలుగజేసుకుంటాం సమావేశంలో భాగంగా పార్టీ మండల కమిటీల ఏర్పాటుపై టీపీసీసీ మాజీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి అభ్యంతరం తెలిపారు. కమిటీల ఏర్పాటు ఏకపక్షంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ అన్ని జిల్లాల్లోనూ కలుగజేసుకుంటామంటే ఎలా అని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో తీవ్రంగా స్పందించిన ఉత్తమ్... పీసీసీ చీఫ్‌గా పార్టీని నడిపించామని, 30–40 ఏళ్లుగా పారీ్టలో ఉంటున్నామని, తమకు రాష్ట్రమంతా అనుచరులు ఉన్నందున కలుగజేసుకోవద్దంటే ఎలా అని వ్యాఖ్యానించారు. కొత్తగా వచ్చిన వాళ్లు నిర్ణయాలు తీసుకుంటుంటే తాము పట్టించుకోకుండా ఎలా ఉంటామని, బరాబర్ కలుగజేసుకుంటామని స్పష్టం చేశారు. మధ్యలో కలుగజేసుకున్న వేణుగోపాల్ నేతలందరూ సమన్వయంతో పనిచేసి ఈనెల 15లోపు మండల కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించారు. సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ గురించి కసరత్తు చేస్తున్నామని చెప్పగా అన్ని వర్గాల డిక్లరేషన్లనూ పూర్తి చేయాలని వేణుగోపాల్ సూచించారు. చదవండి: Congress Party: కచ్చితంగా గెలిచేవి..41.. కష్టపడితే గెలిచేవి.. 42 ఆరు సభలు... సోనియా,రాహుల్, ప్రియాంక రాక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పలు వర్గాలకు డిక్లరేషన్లు ప్రకటించడం కోసం ఆరు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని టీపీసీసీ నేతలు పీఏసీ భేటీలో నిర్ణయించారు. ఈ సభలకు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, సిద్ధరామయ్యలను ఆహ్వానించాలని, సమయాన్నిబట్టి ఒక్కో సభకు ఒక్కో జాతీయ నేతను తీసుకురావాలని, రాహుల్ వీలైనన్ని సభలకు వచ్చేలా చూడాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలను ఆకట్టుకునేలా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 15 లోగా 3 బహిరంగ సభలు: షబ్బీర్ అలీ పీఏసీ సమావేశం అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్‌తో కలసి పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ విలేకరులతో మాట్లాడారు. పార్టీ గెలుపునకు కేసీ వేణుగోపాల్ కీలక సూచనలు చేశారని చెప్పారు. గిరిజన దినోత్సవం రోజున తండాలలో బస చేయాలని, రాష్ట్రంలో భూ కుంభకోణాలు, అమ్మకాలపై చార్జిషీట్ వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15లోగా జహీరాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు. అంతకుముందు కె.సి.వేణుగోపాల్‌కు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. -
ఖమ్మంలో కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు
-
28 మందిని పొట్టనపెట్టుకున్న పాపం కేసీఆర్‌దే
సాక్షి, ఖమ్మం : రాష్ట్రంలో 28 మంది విద్యార్థులను పొట్టనపెట్టుకున్న పాపం కేసీఆర్‌దే అంటూ కాంగ్రెస్ మాజీ మంత్రి రేణుకా చౌదరి మండిపడ్డారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇంటర్ బోర్టు ఘటన టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు నిదర్శనమన్నారు. ఇంటర్‌బోర్డు అవకతవకలపై ప్రభుత్వ తీరును ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి అద్దం పట్టేలా ఖమ్మం పార్లమెంట్ ఎన్నిక జరిగిందని తెలిపారు. జిల్లాలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దేశంలో నేటి అభివృద్ధి.. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణల పుణ్యమే అన్నారు. 23న కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని ఆమె స్పష్టం చేశారు. -
'రేణుకాచౌదరిని ఖమ్మం జిల్లాకు రానీవ్వం'
హైదరాబాద్: రేణుకాచౌదరి గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఆమెను ఖమ్మం జిల్లాకు రానివ్వబోమంటూ స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఎంపీ కాబట్టి ఆమె అక్కడే పనిచేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సమీక్ష సమావేశం బుధవారం గాంధీభవన్ లో జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఎంపీ రేణుకాచౌదరి వైఖరిపై మండిపడ్డారు. తమ జిల్లాకు వెంటనే పార్టీ అధ్యక్షుడ్ని నియమించాలని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను వారు కోరారు. కాగా, పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడంపై న్యాయపోరాటం చేయాలని పొన్నాలను కోరినట్టు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సీపీఐతో పొత్తు, అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు జరగడం వల్లే ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో ఓడిపోయామని ఆయన చెప్పారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు తెలిపారు. -
‘మేడమ్’పై ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఫైర్‌బ్రాండ్, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు అందింది. రేణుకపై ఫిర్యాదు అనగానే జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులే చేసి ఉంటారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. ఈసారి ఆ అవకాశాన్ని ఇతర జిల్లాల నాయకులు తీసుకున్నారు. జిల్లాలో ఆమెను వ్యతిరేకించే నేతలతో సంబంధం లేకుండానే ఇతర జిల్లాలకు చెందిన పార్లమెంటు సభ్యులు పార్టీ అధినేత్రికి లేఖ రాశారు. వివరాల్లోకి వెళితే.... రానున్న సార్వత్రిక ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇటీవలే తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎంపీ రేణుకాచౌదరికి కూడా స్థానం కల్పించారు. మొత్తం 23 మంది సభ్యులున్న ఈ కమిటీలో రేణుకకు స్థానం కల్పించడాన్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేక ృందానికి కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ నేతృత్వం వహిస్తున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. తెలంగాణ ఉ ద్యమాన్ని, ఈ ప్రాంత ప్రజల పోరాటాన్ని అవమానపరిచేలా మాట్లాడిన రేణుకకు తెలంగాణ ప్ర దేశ్ ఎన్నికల కమిటీలో ఎలా స్థానం కల్పిస్తారని ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలోనే ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే, దిగ్విజయ్‌ను పొన్నం ప్రశ్నిస్తున్న సమయంలో సమావేశంలోనే ఉన్న రేణుక మాత్రం మౌనంగానే ఉన్నారని సమాచారం. అంతటితో ఆగకుండా ఎంపీ పొన్నం ఏకంగా పార్టీ అధినేత్రి సోనియాకు ఫిర్యాదు లేఖ రాశారని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. ఈ ఫిర్యాదుపై తెలంగాణ ప్రాంతానికి చెందిన అందరు ఎంపీల సంతకాలను కూడా తీసుకున్నట్లు సమాచారం.ఎట్టి పరిస్థితుల్లో రేణుకకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో స్థానం కల్పించవద్దని ఆ లేఖలో సోని యాను కోరినట్లు తెలిసింది. మరి ఈ ఫిర్యాదును పరిగణనలోనికి తీసుకుంటారా? రేణుకకు అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడి పనిచేస్తుందా? ఏం జరుగుతుందన్నది తేలాల్సి ఉంది. -
ఖమ్మం బరిలో స్పీకర్ నాదెండ్ల ?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గ్రూపు గొడవలు, అంతర్గత కుమ్ములాటలకు నెలవైన జిల్లా కాంగ్రెస్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రేణుకాచౌదరి అనుచరులు వర్గాలుగా విడిపోయి పనిచేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై అధిష్టానం దృష్టి సారించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అభ్యర్థిత్వాన్ని ఢిల్లీ పెద్దలు తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందుకు మనోహర్ సామాజిక వర్గ నేపథ్యంతో పాటు జిల్లా పార్టీలోని రెండు గ్రూపుల నడుమ మధ్యేమార్గాన్ని ఎంచుకోవడమే ఉత్తమమనే భావనకు అధిష్టానం రావడమే కారణమని తెలుస్తోంది. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కష్టమని భావించడంతో పాటు, ఖమ్మంలో స్థానికేతరులకు విజయావకాశాలు ఎక్కువ అని కూడా అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. పార్టీ ఆంతర్యం ఇలా.. గుంటూరు జిల్లాకు చెందిన నాదెండ్ల మనోహర్‌ను ఖమ్మం పంపే విషయంలో అధిష్టానం కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పెద్దల ఆలోచన ప్రకారం... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అసెంబ్లీ స్పీకర్‌గా నిర్వర్తించాల్సిన బాధ్యతను రూల్ పొజిషన్ ప్రకారం ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా మనోహర్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాల సమావేశాలను ప్రోరోగ్ చేసే అంశంలో కూడా ఆయన అధిష్టానానికి పూర్తిగా సహకరించారు. ఎక్కడా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న భావన రానీయలేదు. దీంతో పాటు తెలంగాణకు వ్యతిరేకంగా అధిష్టానంపై ధిక్కారస్వరాన్ని వినిపిస్తూ అంతర్గతంగా సహకరిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి భిన్నంగా తన రాజ్యాంగపరమైన బాధ్యతలను సమర్థవంతంగా చక్కబెడుతున్నారు. ఎన్నికల బరిలో దింపినా తాను సభాపతిగా ఉన్నప్పుడే తెలంగాణ బిల్లును అసెంబ్లీలో చర్చించి పార్లమెంటుకు పంపానని చెప్పుకునే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుడైనప్పటికీ తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. రేణుకాచౌదరి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినంత సులువుగా రాంరెడ్డి వర్గం కూడా స్పీకర్ పట్ల వ్యవహరించలేదు. దీనికి తోడు గతంలో ఆయన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కూడా ఎంపీగా ఖమ్మం పార్లమెంటుకు ప్రాతిని ధ్యం వహించారు. ఆయనకు కూడా ఇక్క డి ప్రజలతో మంచి సంబంధాలున్నాయి. మనోహర్ సామాజికవర్గం కూడా ఇక్కడ ఆయనకు ఉపకరిస్తుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అధిష్టానం మనోహర్ పేరును తీవ్రంగా పరిశీలిస్తున్నదనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. కొట్టుకున్నా... మాకే! ఇదిలా ఉంటే మంత్రి, ఎంపీ గ్రూపులు కూడా ఖమ్మం పార్లమెంట్ స్థానం కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డి ఈసారి ఖమ్మం పార్లమెంటు స్థానంపై కూడా కన్నేశారు. తన సోదరుడు, సూర్యాపేట ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని ఇక్కడి నుంచి పోటీ చేయించేందుకు ఢిల్లీ పెద్దల అనుమతి కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. సర్వోత్తమ్‌రెడ్డికి కూడా వ్యక్తిగతంగా రాహుల్‌గాంధీ వద్ద పలుకుబడి బాగానే ఉంది. ఆయన ఆధ్వర్యంలోని మైనార్టీ మేనిఫెస్టో కమిటీలో సభ్యుడయిన సర్వోత్తమ్ రాహుల్‌కు సన్నిహితుడుగానే పేరొందారు. ఒకవేళ పరిస్థితి మారితే తానే స్వయంగా ఖమ్మం ఎంపీగా పోటీచేయాలనే యోచనలో కూడా మంత్రి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు హస్తినలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఫైర్‌బ్రాండ్ రేణుక కూడా తనకు ఢిల్లీలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని ఎట్టి పరిస్థితుల్లో పట్టు జారకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాగూ తనూ ఎంపీగానే ఉన్నందున సీటు తనకిచ్చే విషయంలో కొంత పట్టువిడుపు ప్రదర్శించినా, పూర్తిగా తన వర్గానికి దక్కకుండా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. తనకు కాకపోతే తన భర్త శ్రీధర్‌చౌదరి, లేదంటే కుమార్తె తేజస్విని పేర్లను ఆమె ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు తన కుటుంబానికి కాదన్నా ఆమె మరో ప్రత్యామ్నాయాన్ని కూడా సిద్ధం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే ప్రముఖ కాంట్రాక్టర్ గరికపాటి వెంకటేశ్వరరావు (జీవీఆర్) పేరును పరిశీలించాలని ఆమె ఢిల్లీ పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తోంది. వీరికి తోడు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కూడా ఖమ్మం ఎంపీ సీటు కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి ఎవరు బరిలో ఉంటారనేది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. -
రాష్ట్ర విభజనపై సీఎం వాదన సరైందే
కూసుమంచి, న్యూస్‌లైన్: రచ్చబండలో సీఎం ఫ్లెక్సీలు చించటం, తగులబెట్టటం ఏంటి నాన్సెన్స్..ఇది శోచనీయం.. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయనే ప్రభుత్వ సారధి, ఆయనకు రెండు ప్రాంతాల ప్రయోజనాలు చూడాల్సిన బాధ్యత ఉంది... రాష్ట్ర విభజనపై సీఎం వాదనలో తప్పేం లేదు, సీఎం క్రమశిక్షణ కలిగిన నాయకుడు’- అంటూ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని సమర్థిస్తూ వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌నుంచి జిల్లా పర్యటనకు వచ్చిన రేణుకాచౌదరికి జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఆమె పైవిధంగా స్పందించారు. సీఎం సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడుతున్నారు... తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్నప్పుడు ఆయనకు ఈలెక్కలు గుర్తుకు రాలేదా అంటూ విలేకరులు ప్రశ్నించగా నాడు ఆయన కూడా ఆత్మహత్యలు వద్దని అప్పీలు చేశారుగా, సీఎం ఏప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు..రెండు ప్రాంతాలకు సమన్యాయం గురించి మాట్లాడుతున్నారే తప్ప మరోలా కాదు అంటూ రేణుకాచౌదరి బదులిచ్చారు. ఒక సమస్య వలన మరో సమస్య తలెత్తకూడదనేది సీఎం ఆలోచనని అన్నారు. సీఎం రాష్ట్ర విభజనపై తలెత్తే సమస్యలను ముందుంచుతున్నారు.. ఆయనను కేంద్రం సీఎంగా నియమించింది తన భాధ్యతను తాను నిర్వర్తించాల్సిన బాధ్యత ఆయనపై ఉందని అన్నారు. ‘జిల్లా ఆడబిడ్డగా భద్రాచలం నుంచి గడ్డిపోచను కూడా పోనివ్వను..ఖబడ్దార్’ అంటూ ఈ సందర్భంగా రేణుకాచౌదరి అన్నారు. భద్రాద్రి రాముడు ఆశీస్సులతో, కాంగ్రెస్ కార్యకర్తల అండతో భద్రాచలాన్ని కాపాడేందుకు పోరాడతానని అన్నారు. నేను జిల్లా ఆడబిడ్డగా జిల్లాకోసం పోరాడుతున్నా ..నాకు అడ్డుచెప్పేవారు ఉంటే ముందుకు రమ్మనండి అంటూ సవాల్ విసిరారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రేస్ నాయకులు సోమ్లా నాయక్, అయితం సత్యం, పోరిక లక్ష్మీబాయి, రాయల నాగేశ్వరరావు, పరుచూరి మురళీకృష్ణ , కొరివి వెంకటరత్నం, పోటు లెనిన్ తదితరులు పాల్గొన్నారు. -
రామనామం...ప్రత్యర్థులపై బాణం!
సాక్షి, కొత్తగూడెం: ‘భద్రాచలం రాముడు తెలంగాణ దేవుడు.. ఈ ప్రాంతానికే రాములోరు దక్కేలా నినదించాలి’ అంటూ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చేపట్టిన భద్రాచలం జైత్రయాత్ర వెలవెలపోయింది. అనుంగు నేతలు ఆమె పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసినా చివరకు క్యాడర్ లేకపోవడంతో కార్యకర్తల సమావేశాలు కూడా రద్దయ్యాయి. ఊహించని రీతిలో క్యాడర్ దూరం కావడంతో సదరు నేతల అంచనాలు తలకిందులయ్యాయి. కాగా, పర్యటన యావత్తూ పార్టీలోని ప్రత్యర్థులపై విమర్శలకే రేణుక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ఇటీవలి కాలంలో తమ వర్గానికి షాక్ ఇచ్చేలా పార్టీలోని ప్రత్యర్థి వర్గం ఎత్తులు వేయడంతో నైరాశ్యంలో ఉన్న రేణుక అనుచర నేతలు జిల్లా పర్యటనకు రావాలని ఆమెను కోరినట్లు సమాచారం. ఇదేసమయంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవి నుంచి కూడా ఆమెను పక్కన పెట్టారు. మొత్తంగా తన అనుచరులలో ఉత్సాహం నింపాలన్న ఉద్దేశంతో రేణుక జిల్లా పర్యటన చేపట్టారు. దీంతో పాలేరు నుంచి భద్రాచలం వరకు నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు పెట్టాలని ఆమె పర్యటనకు నాలుగు రోజుల ముందే ఆయా నేతలు షెడ్యూల్ ఖరారు చేశారు. ఊహించని రీతిలో రేణుక పర్యటనను సక్సెస్ చేసి ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని భావించారు. అయితే శనివారం నాటి జిల్లా పర్యటనలో... గతంలో ఆమె వెంట ఉన్న నేతలు మినహా మిగతా వారేవరూ రాకపోవడంతో ఆమె వర్గీయులు ఆశించిన స్థాయిలో జరగలేదు. నాయకన్‌గూడెం నుంచి భద్రాచలం వరకు ఇదే పరిస్థితి. పార్టీ శ్రేణులు లేకపోవడంతో ఖమ్మం, వైరా, కొత్తగూడెం, ఖమ్మంరూరల్‌లో కార్యకర్తల సమావేశాలు రద్దు అయ్యాయి. దీంతో ఆమె కొణిజర్ల, వైరా, ఏన్కూరు, జూలూరుపాడు, కొత్తగూడెం, పాల్వంచసెంటర్లలో కాన్వాయ్ ఆపి అక్కడ ఉన్న కొద్దిమంది కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తల్లాడలో గతంలో ఉన్న ఆమె అనుచర నేతల నుంచి కూడా స్పందన కూడా లేకపోవడం గమనార్హం. కొత్తగూడెం, పాల్వంచలో కొంతమంది క్యాడర్ కనిపించగా.. మిగతా చోట్ల అంతా పేలవంగానే ఆమె యాత్ర సాగింది. ప్రత్యర్థులపైనే విమర్శనాస్త్రాలు.. రేణుక పర్యటన అంతా పార్టీలో తనను ప్రశ్నిస్తున్న ప్రత్యర్థులను ఉద్దేశించిందిగానే సాగింది. ‘నేను సైనికుడిని బిడ్డను.. దేశంలో ఎక్కడైనా తిరుగుతా.. ఈ జిల్లాలో పుట్టినవారు జిల్లాకు ఏమైనా చేశారా..? నేను 27 ఏళ్లుగా జిల్లాకు రూ.కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేశాను. జిల్లా ఆడబిడ్డగా ఇలా అభివృద్ధి చేస్తుంటే.. నన్ను చేయనివ్వరు.. వాళ్లు చేయరు. వాళ్లు జిల్లాకు ఏంచేశారో..? నేను ఏంచేశానో బహిరంగ చర్చకు సిద్ధం’ అని ఆమె పరోక్షంగా మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఆమె ప్రసంగించిన చోటల్లా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రత్యర్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాష్ట్ర విభజన ద్వారా తలెత్తే సమస్యలనూ సీఎం అధిష్టానానికి విన్నవిస్తున్నారని, ఆయన ఫ్లెక్సీలు చించేవారు మూర్ఖులతో సమానం అంటూ విమర్శించారు. అనుంగు నేతల హల్చల్.. జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం మొదలు భద్రాచలం వరకు ఆమె అనుచర నేతల హల్చల్తోనే రేణుకాచౌదరి పర్యటన కొనసాగింది. ఖమ్మంలో ఉన్న కొద్దిమంది నేతలు నాయకన్‌గూడెం వెళ్లి స్వాగతం పలకడంతో పాటు అక్కడి నుంచి భద్రాచలం వరకు ఆమె పర్యటనలో కొనసాగారు. పాలేరులో కొంత సేపు ఆగగా.. అక్కడి సర్పంచ్ మాధవిరెడ్డి తన వాహనంలో ఖమ్మం తీసుకెళ్లారు. దీంతో మంత్రికి వ్యతిరేకంగా పాలేరు నియోజకవర్గంలో కుంపటి పెట్టాలని ఆమె వ్యూహంలో ఉన్నట్లు పార్టీవారే చర్చించుకున్నారు. క్యాడర్ లేక కార్యకర్తల సమావేశాలు రద్దు కావడం, అసలు పర్యటన ఫలితం ఏముంటుందని భావించే రేణుకాచౌదరి.. ‘భద్రాచలం జైత్రయాత్ర’ అని ఆమె పర్యటనకు పేరుపెట్టుకున్నట్లు పార్టీలోని నేతలు చర్చించుకుంటున్నారు. పలువురు ముఖ్యనేతలు, వారి వర్గం వారు రేణుక పర్యటనకు దూరంగా ఉన్నారు. కాగా, తెలంగాణవాదులు, ఆమె ప్రత్యర్థి వర్గం అనుచరులు ఎవరైనా ఆమె పర్యటనను అడ్డుకుంటారేమోనని పోలీసులు మాత్రం భారీ బందోబస్తు చేపట్టారు.