రేణుకమ్మల పోలరైజ్‌ పాలిటిక్స్‌  | Kamma group which has not made much impact in 65 years of political history | Sakshi
Sakshi News home page

రేణుకమ్మల పోలరైజ్‌ పాలిటిక్స్‌ 

Published Thu, Oct 12 2023 5:04 AM | Last Updated on Thu, Oct 12 2023 6:16 PM

Kamma group which has not made much impact in 65 years of political history - Sakshi

కొమ్మినేని శ్రీనివాసరావు :  తెలంగాణలో కమ్మ సామాజికవర్గ ప్రతినిధిగా తనను తాను ఫోకస్‌ చేసుకోవడానికి కాంగ్రెస్‌నేత రేణుకాచౌదరి చాలా కష్టపడుతున్నారు. అందులో భాగంగా ఆమె కాంగ్రెస్‌ అధిష్టానం వద్దకు కొందరు కమ్మ జేఏసీ నేతలను తీసుకెళ్లారు. వచ్చే అసెంబ్లీఎన్నికల్లో కమ్మ వర్గానికి పన్నెండు సీట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 1982లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఏపీలో రెండు పార్టీల వ్యవస్థ ఆవిర్భవించిందని చెప్పాలి. 1983కు ముందు కమ్మవర్గం కాంగ్రెస్‌తోనే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. తదుపరి టీడీపీ కమ్మ సామాజికవర్గం ఆధిపత్యంలో ఉంటే, కాంగ్రెస్‌ పార్టీ రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యంలో ఉన్నట్టు లెక్కలు వెల్లడిస్తున్నాయి.

ఆయా ఎన్నికల్లో ఇతర సామాజిక వర్గాలను ఎవరు ఆకర్శించగలిగితే ఆ పార్టీ అధికారంలోకి వస్తోంది. రెడ్డి సామాజికవర్గం ఆంధ్ర, తెలంగాణలలో రెండు చోట్ల ప్రాముఖ్యత కలిగి ఉంది. కమ్మ వర్గం ప్రధానంగా ఆంధ్రకే పరిమితమైందని చెప్పాలి. రెడ్డి వర్గం ప్రతి ఎన్నికలోనూ రెండు ప్రాంతాల్లో కలిపి సుమారు ఎనభై నుంచి తొంభైమంది ఎమ్మెల్యేలుగా గెలుస్తుంటే.. కమ్మవర్గం అత్యధికంగా ఆంధ్రలోనే గెలుస్తోంది. రెండు ప్రాంతాల్లో కలిపి వీరు అత్యధికంగా 1994లో 53 మంది, అత్యల్పంగా 2018లో తెలంగాణలో ఐదుగురు, 2019లో ఏపీలో పదిహేడు మంది అంటే రెండు రాష్ట్రాలలో కలిపి ఇరవై రెండు మంది గెలిచారు.

2014లో రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 38 మంది.. ఉమ్మడి ఏపీలో 2009లో 27, 2004లో 35, 1999లో 43, 1994లో 53 , 1989లో 36, 1985లో 52, 1983లో 51, 1978లో 41, 1972లో 35, 1967లో 41, 1962లో 39 మంది గెలిచారు. అయితే ఇప్పటివరకు తెలంగాణలో మాత్రం కమ్మ వర్గం నుంచి 1985లో అత్యధికంగా ఎనిమిది, మిగతా ఎన్నికల్లో రెండు నుంచి ఏడుగురు వరకు మాత్రమే గెలిచారు. 

ఎవరు అధికారంలోకి వస్తే.. 
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోనూ టీడీపీ ఉనికిని నిలబెట్టడానికి కమ్మ వర్గం యత్నించింది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుతో ఇక్కడ మొత్తం పార్టీ కకావికలమైంది. దీంతో కమ్మవర్గం వారు ఏ పార్టీకి అధికారం వస్తే అటువైపు మొగ్గు చూపడానికి అధికంగా ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది. గత రెండు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ (ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ) పాలన పగ్గాలు చేపట్టగా... కమ్మవర్గం ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలిచినా అంతా బీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌ నుంచి కొందరు టీఆర్‌ఎస్‌లో చేరినా, పూర్తిగా ఆ పార్టీకి దూరం కాలేదు.

2018 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడంతో కమ్మవర్గం నేతలు కూడా ఆ బాట పట్టారు. కానీ పెద్దగా ఫలితం సాధించలేకపోయారు. టీఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసిన ఐదుగురు కమ్మ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. టీడీపీ లేదా కాంగ్రెస్‌ నుంచి ఒక్కరు కూడా గెలవలేదు. చివరికి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ మనుమరాలు, మాజీ మంత్రి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్‌పల్లి నుంచి పోటీచేసి ఘోర పరాజయం పొందారు. ఏ వర్గం వారైనా కేవలం కులం ఆధారంగానే గెలవరని ఈ ఎన్నికలు రుజువు చేశాయి.

టీడీపీ సెంటిమెంట్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలవడాన్ని చాలామంది జీర్ణిం చుకోలేకపోయారు. దానికి తోడు విభజిత ఆంధ్రలో అప్పటికే చంద్రబాబుపై ఏర్పడిన విపరీతమైన వ్యతిరేకత కూడా ప్రభావం చూపింది. 2014లో టీఆర్‌ఎస్‌ నుంచి ఒక్క కమ్మ అభ్యర్థి గెలుపొందలేదు. ఇద్దరు టీడీపీ నుంచి, ఇద్దరు కాంగ్రెస్‌ నుంచి , ఒకరు బీఎస్పీ నుంచి విజయం సాధించారు. తదుపరి కాలంలో వీరంతా టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేశారు. తర్వాత ఒక ఉప ఎన్నిక ద్వారా మరో కమ్మ నేత టీఆర్‌ఎస్‌ పక్షాన ఎమ్మెల్యే అయ్యారు. 

తెలంగాణలో పెద్దగా బలంగా లేకున్నా.. 
ఉమ్మడి ఏపీలో ఎన్నికలు జరిగినప్పుడు పరిశీలిస్తే... 2009లో తెలంగాణలో ముగ్గురు గెలవగా, వారిలో ఇద్దరు టీడీపీ, ఒకరు లోక్‌సత్తాకు చెందినవారు. 2004లోనూ ఈ వర్గం వారు ముగ్గురే గెలిచారు. ఒకరు కాంగ్రెస్‌ నుంచి, ఇద్దరు ఇతరులు కావడం విశేషం. టీడీపీ నుంచి ఎవరూ గెలవలేదు. 1999లో టీడీపీ పక్షాన ముగ్గురు విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచి ఎవరూ గెలవలేదు. 1994లో ఆరుగురు విజయం సాధించగా.. టీడీపీ నుంచి నలుగురు, కాంగ్రెస్‌ నుంచి ఒకరు, ఇతరులు ఒకరు గెలిచారు. 1989లో ముగ్గురు గెలిస్తే టీడీపీ నుంచి ఒకరు, ఇద్దరు ఇతర పార్టీలవారు.

1985లో మొత్తం ఎనిమిది మందికిగాను ఆరుగురు టీడీపీ, ఇద్దరు టీడీపీ కూటమిలోని ఇతర పార్టీలవారు. తెలంగాణ చరిత్రలో ఈ ఎన్నికలోనే కమ్మ వర్గం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అవడం విశేషం. 1983లో గెలిచిన ఏడుగురు కమ్మ ఎమ్మెల్యేలు టీడీపీ వారే. ఎన్‌.టి.రామారావు ప్రభంజనం వీయడంతో వీరు విజయం సాధించారు. అంతకుముందు 1978 ఎన్నికలలో కమ్మ వర్గం వారు ఐదుగురు, 1972, 1967లలో నలుగురు 1962లో ఇద్దరు గెలుపొందారు.

స్థూలంగా చూస్తే తెలంగాణ ప్రాంతంలో కమ్మ సామాజికవర్గం ఎప్పుడూ పెద్ద బలంగా లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ వర్గం ఓన్‌ చేసుకోవడానికి యత్నించింది. అది కొంతకాలం బాగానే సాగినా.. తర్వాత అది నెగిటివ్‌గా మారుతోంది. ప్రత్యేకించి 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం వారు ఎక్కువగా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న భావనతో ఇతర వర్గాలవారు ఆ పార్టీకి దూరమయ్యారు. 

ఓటర్లను కాంగ్రెస్‌ వైపు తిప్పడానికే..
తాజా పరిణామాలలో కమ్మ ఓటర్లను పోలరైజ్‌ చేయడానికి రేణుకాచౌదరి వంటివారు యత్నిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ వర్గం సంఖ్య కాస్త ఎక్కువగా ఉండటమే కారణం. నిజంగానే కమ్మ వర్గానికి అంత బలముంటే చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకే మద్దతు ఇవ్వవచ్చు కదా! అలా చేయడం లేదంటే కారణం అర్థం చేసుకోవచ్చు. అయినా రేణుక వంటివారు కమ్మ వర్గాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీలో అవినీతి కేసు నమోదై జైలుకు వెళితే దానిని కమ్మ సామాజికవర్గంపై దాడిగా ఆమె ప్రచారం చేసింది. ఎందుకైనా మంచిదని ఇతర పార్టీలవారు కూడా అదే బాటలో మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీనపడిపోయిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు ఆ వర్గం వారిని కాంగ్రెస్‌కు అంటగట్టడానికి యత్నిస్తున్నాయి.

నిజానికి ఆ వర్గం కానీ, ఆయా సెటిలర్‌ వర్గాలుగానీ కొంతకాలం క్రితం వరకు బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతున్నారన్న అభిప్రాయముంది. కానీ చంద్రబాబు అరెస్టు తర్వాత కమ్మ వర్గాన్ని కాంగ్రెస్‌ వైపు మళ్లించడానికి కొందరు వ్యూహాలు పన్నుతున్నారు. నిజానికి ఏ కులం వారైనా తమ ఇష్టం వచ్చిన పార్టీకి మద్దతు ఇవ్వొచ్చు. కానీ ఒక భావజాలాన్ని వ్యాప్తిలోకి తెచ్చి, కమ్మవారు ఫలానా పార్టీకి అనుకూలం అనుకోవాలనేది వారి వ్యూహం. రేణుకాచౌదరి ఖమ్మం జిల్లాలో తనకు, తనవారికి టికెట్లు ఇప్పించుకోవడానికి కులం కార్డు ఉపయోగిస్తున్నారు.

నలభై నియోజకవర్గాల్లో కమ్మ వర్గం గణనీయంగా ఉందని.. ముప్పై చోట్ల గెలుపోటములు నిర్ణయించే దశలో ఉందని, పది చోట్ల విజయావకాశాలు కలిగి ఉందని కమ్మ ఐక్యవేదిక కాంగ్రెస్‌ అధినాయకత్వానికి వివరించింది. వీటిలో ఎక్కువ భాగం హైదరాబాద్‌ పరిసరాల్లోనివే కాగా.. కొన్ని నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోనివి. జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఖమ్మం, మల్కాజిగిరి, కొత్తగూడెం, కోదాడ, పాలేరు మొదలైన చోట్ల టికెట్లు ఆశిస్తున్నట్లు ఈ వేదిక తెలిపింది. ఒకరకంగా ఇది కులం పేరు చెప్పుకుని కొందరు ఆయా పార్టీలను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నట్టు అనిపిస్తుంది. 

కాంగ్రెస్‌కు నష్టం చేస్తుందా? 
ఏ సామాజికవర్గం వారికైనా వారి సత్తాను బట్టి పార్టీలు టికెట్లు ఇస్తాయి. కాకపోతే కమ్మ వర్గం కొంత ఆర్థిక బలం కూడా కలిగి ఉంటుందన్న అభిప్రాయం ఉంది. టీఆర్‌ఎస్‌ కమ్మ వర్గానికి చెందిన ఐదుగురికి టికెట్లు కేటాయించింది. కాంగ్రెస్‌ అంతకు మించి ఇస్తుందా అన్నది సందేహమే. ఈ వర్గం నేతల హడావుడి కారణంగా కాంగ్రెస్‌ హైకమాండ్‌ బీసీవర్గం నేతలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదట. అది ఆ పార్టీకి తలనొప్పి అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ కూడా అదేదో కమ్మ వర్గం వారికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వకపోతే నష్టం అనుకుంటే అది పెద్ద పొరపాటు అవుతుంది.

పైగా ఇతర వర్గాల్లో అపోహలు పెరిగే అవకాశం ఉండవచ్చు. అసలే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికీ చంద్రబాబుకు సన్నిహితుడన్న ప్రచారం ఉండగా.. ఆయనను రేణుకాచౌదరి వంటివారు ఇలాంటి వివాదాలలోకి తీసుకెళ్లకుండా ఉంటేనే పార్టీకి ప్రయోజనం అని చెప్పాలి. ఏది ఏమైనా అరవై ఐదేళ్ల తెలంగాణ ఎన్నికల చరిత్రను చూస్తే కమ్మ సామాజికవర్గం అంత ప్రభావశీలిగా లేదనే చెప్పాలి.

అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేయడంలో భాగంగా ఏ పార్టీ అయినా ఇతర కులాలతోపాటు కమ్మవారు కొందరికి కూడా టికెట్లు ఇస్తాయి. కానీ అదే సమయంలో ప్రత్యేకించి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక గ్రూపు తయారై అనవసరంగా రాజకీయాలు చేస్తూ ఆ వర్గం వారికి అప్రతిష్ట తేకుండా ఉంటే అదే పదివేలు అని చెప్పాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement