వేణుగోపాల్‌కు స్వాగతం పలుకుతున్న మాణిక్‌రావ్ ఠాక్రే , రేవంత్‌రెడ్డి.
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఓవైపు ఎన్నికలు తరుముకొస్తుంటే మీరిలా పరస్పరం ఫిర్యాదులు చేయడం, లేఖలు రాయడం ఏమిటి? ఎన్నికల వేళ ఈ లొల్లి ఆగకపోతే ఎలా? కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే రాష్ట్రాల్లో తెలంగాణ తొలి స్థానంలో ఉంది. కష్టపడి పార్టీని గెలిపిస్తే మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యేది మీరే... మేం కాదు. కర్ణాటక నేతలను చూసి నేర్చుకోండి.
వారిని ఆదర్శంగా తీసుకొని ఈ 100 రోజులు ఐకమత్యంగా పనిచేయండి’అని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నారు. శనివారం గాంధీ భవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యక్షతన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతల అనైక్యత గురించి వేణుగోపాల్ మాట్లాడారు. నేతల మధ్య భేదాభిప్రాయాలను అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకుంటూ నిరంతరం ప్రజల్లోనే ఉండాలని సూచించారు.
బరాబర్... కలుగజేసుకుంటాం
సమావేశంలో భాగంగా పార్టీ మండల కమిటీల ఏర్పాటుపై టీపీసీసీ మాజీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి అభ్యంతరం తెలిపారు. కమిటీల ఏర్పాటు ఏకపక్షంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ అన్ని జిల్లాల్లోనూ కలుగజేసుకుంటామంటే ఎలా అని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో తీవ్రంగా స్పందించిన ఉత్తమ్... పీసీసీ చీఫ్‌గా పార్టీని నడిపించామని, 30–40 ఏళ్లుగా పారీ్టలో ఉంటున్నామని, తమకు రాష్ట్రమంతా అనుచరులు ఉన్నందున కలుగజేసుకోవద్దంటే ఎలా అని వ్యాఖ్యానించారు.
కొత్తగా వచ్చిన వాళ్లు నిర్ణయాలు తీసుకుంటుంటే తాము పట్టించుకోకుండా ఎలా ఉంటామని, బరాబర్ కలుగజేసుకుంటామని స్పష్టం చేశారు. మధ్యలో కలుగజేసుకున్న వేణుగోపాల్ నేతలందరూ సమన్వయంతో పనిచేసి ఈనెల 15లోపు మండల కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించారు. సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ గురించి కసరత్తు చేస్తున్నామని చెప్పగా అన్ని వర్గాల డిక్లరేషన్‌లనూ పూర్తి చేయాలని వేణుగోపాల్ సూచించారు.
చదవండి: Congress Party: కచ్చితంగా గెలిచేవి..41.. కష్టపడితే గెలిచేవి.. 42
ఆరు సభలు... సోనియా,రాహుల్, ప్రియాంక రాక
ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పలు వర్గాలకు డిక్లరేషన్‌లు ప్రకటించడం కోసం ఆరు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని టీపీసీసీ నేతలు పీఏసీ భేటీలో నిర్ణయించారు. ఈ సభలకు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, సిద్ధరామయ్యలను ఆహ్వానించాలని, సమయాన్నిబట్టి ఒక్కో సభకు ఒక్కో జాతీయ నేతను తీసుకురావాలని, రాహుల్ వీలైనన్ని సభలకు వచ్చేలా చూడాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలను ఆకట్టుకునేలా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు.
సెప్టెంబర్ 15 లోగా 3 బహిరంగ సభలు: షబ్బీర్ అలీ
పీఏసీ సమావేశం అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్‌తో కలసి పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ విలేకరులతో మాట్లాడారు. పార్టీ గెలుపునకు కేసీ వేణుగోపాల్ కీలక సూచనలు చేశారని చెప్పారు. గిరిజన దినోత్సవం రోజున తండాలలో బస చేయాలని, రాష్ట్రంలో భూ కుంభకోణాలు, అమ్మకాలపై చార్జిషీట్ వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15లోగా జహీరాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు. అంతకుముందు కె.సి.వేణుగోపాల్‌కు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment