సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారు కోసం స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసుకున్న టీ కాంగ్రెస్... అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితిపై ఓ అంచనాకు వస్తోంది. ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కసరత్తు నివేదిక ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కె.సి.వేణుగోపాల్‌కు అందినట్లు తెలుస్తోంది.
శనివారం హైదరాబాద్‌లో ఆయన పర్యటనకు ముందే సునీల్ కనుగోలు ఈ నివేదికను వేణుగోపాల్‌కు అందజేశారు. ఈ నివేదిక ఆధారంగానే ఏఐసీసీ నియమించిన పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకుల సమావేశంలో వేణుగోపాల్ పలు సూచనలు చేసినట్లు సమాచారం.
సునీల్ కనుగోలు
మూడు రకాలుగా విభజన...
వాస్తవానికి గత నెల 24న జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో పార్లమెంటు నియోజకవర్గాలవారీగా సునీల్ కనుగోలు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ స్థానాల పరిధిలో పార్టీ అంతంత మాత్రంగానే ఉందని, మిగిలిన చోట్ల ప్రత్యర్థులకు పోటీ ఇచ్చే స్థితిలో ఉన్నామని వివరించారు. అయితే ఏ అసెంబ్లీ స్థానంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని ఆయన ఆ సమావేశంలో వెల్లడించలేదు.
తాజాగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకుగాను 41 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ గెలిచే అవకాశముందని, మరో 42 చోట్ల గెలుపు కోసం కష్టపడాల్సి ఉంటుందని, 36 స్థానాల్లో గెలుపు అంత సులభం కాదని, ఆ స్థానాలపై ప్రస్తుత పరిస్థితుల్లో ఆశలు వదులుకోవాల్సిందేనని కె.సి.వేణుగోపాల్‌కు ఇచ్చిన నివేదికలో ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నివేదిక ప్రకా రం గెలుపు అవకాశాలున్న చోట్ల ఎన్నికల వరకు ఇదే ఊపును కొనసాగించాలని, గెలుపు కోసం కష్టపడాల్సిన స్థానాల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని కె.సి.వేణుగోపాల్ సూచించినట్లు సమాచారం.
ఇక, పరిస్థితి ఏమాత్రం బాగాలేని 36 స్థానాల్లో ఏం చేస్తే మెరుగుపడతామన్న దానిపై ప్రత్యేక దృష్టి సారించాలని వేణుగోపాల్ మార్గనిర్దేశం చేసినట్టు తెలు స్తోంది. ఈ సమావేశంలో ఏఐసీసీ నియమించిన స్క్రీనింగ్ కమిటీ సభ్యురాలు దీపాదాస్ మున్షీ, రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షు డు రేవంత్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీధర్‌బాబు, విష్ణునాథ్, మన్సూర్‌అలీఖాన్, రోహిత్‌చౌదరి, వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసి డెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment