'రేణుకాచౌదరిని ఖమ్మం జిల్లాకు రానీవ్వం'
హైదరాబాద్: రేణుకాచౌదరి గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఆమెను ఖమ్మం జిల్లాకు రానివ్వబోమంటూ స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఎంపీ కాబట్టి ఆమె అక్కడే పనిచేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సమీక్ష సమావేశం బుధవారం గాంధీభవన్ లో జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఎంపీ రేణుకాచౌదరి వైఖరిపై మండిపడ్డారు.
తమ జిల్లాకు వెంటనే పార్టీ అధ్యక్షుడ్ని నియమించాలని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను వారు కోరారు. కాగా, పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడంపై న్యాయపోరాటం చేయాలని పొన్నాలను కోరినట్టు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సీపీఐతో పొత్తు, అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు జరగడం వల్లే ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో ఓడిపోయామని ఆయన చెప్పారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు తెలిపారు.