ramreddy venkat reddy
-
పాలేరు బరిలో రాంరెడ్డి సతీమణి సుచరితారెడ్డి
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి పోటీ చేయనున్నారు. సుచరితారెడ్డిని బరిలోకి దించితేనే ఇతర పార్టీలు మద్దతుతో విజయం సాధిస్తామని రాంరెడ్డి కుటుంబసభ్యులు నిర్ణయించారు. కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆమె పేరును ప్రతిపాదిస్తూ తెలంగాణ పీసీసీకి పంపారు. టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం రాంరెడ్డి కుటుంబీకులతో సమావేశమయ్యారు. సుచరితా రెడ్డిని అభ్యర్థిగా కాంగ్రెస్ హైకమాండ్ ఈ రోజు సాయంత్రం అధికారికంగా ప్రకటించనుంది. -
విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి..
హైదరాబాద్: ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ఆయన ప్రజల కోసం ఎంతో సేవ చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిపక్ష నేత జానారెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రెడ్యానాయక్ నివాళులు అర్పించారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక వారు సభలో మాట్లాడారు. జానారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే రాంరెడ్డి వెంకటరెడ్డి రాజకీయాలపై ఆసక్తిచూపారని అన్నారు. వ్యవసాయం అంటే ఎంతో ఇష్టమని, సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారని గుర్తు చేసుకున్నారు. రాంరెడ్డి వెంకటరెడ్డి లేని లోటు తీర్చలేనిదని, కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. గత 30 ఏళ్లుగా ఆయన సేవలందించారని చెప్పారు. -
వెంకటరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ ఫోనులో పరామర్శ
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఫోన్లో పరామర్శించారు. అలాగే ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాలలోని రాంరెడ్డి వెంకటరెడ్డి స్వగృహంలో ఆయన మృతదేహాన్ని ఖమ్మం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సందర్శించి... ఘనంగా నివాళులర్పించారు. ఈ రోజు మధ్యాహ్నం రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు పాత లింగాలలో నిర్వహించనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ రాంరెడ్డి వెంకట్‌రెడ్డి(72) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఆ క్రమంలో ఆయన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... శుక్రవారం రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించారు. -
రాంరెడ్డి వెంకటరెడ్డి మృతి పట్ల ప్రముఖుల సంతాపం
హైదరాబాద్ : ప్రజా పద్దుల సంఘం చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంరెడ్డి వెంకట రెడ్డి మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్షనాయకులు కె.జానా రెడ్డి, కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌దర్ రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, భాస్కర్‌రావు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు కూడా తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, సౌమ్యునిగా పేరున్న వెంకట రెడ్డి మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వేర్వేరు ప్రకటనల్లో సంతాపాన్ని తెలిపారు. వెంకట రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా గత నాలుగేళ్లుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న రాంరెడ్డి వెంకట రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్ రెడ్డిల హయాంలో మంత్రిగా పనిచేశారు. -
అందుబాటులో ఉంటా..
రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే ‘మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా..ఆదుకుంటా. మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా. అధికారులతో మాట్లాడి మీ సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తా. ప్రభుత్వంతో మాట్లాడి బోదవాపు బాదితులకు ప్రత్యేక సర్టిఫికెట్లు ఇప్పించి..పింఛన్ అందేలా చూస్తా. ఇప్పటికే ఈ విషయమై అసెంబ్లీలో మాట్లాడా. జిల్లా హౌసింగ్ పీడీతో మాట్లాడి ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు వెంటనే మంజూరు చేయిస్తా. ఎన్నెస్పీ అధికారులతో మాట్లాడి సాగర్ రెండో జోన్‌కు కనీసం మార్చి వరకైనా రబీ వరికి నీరివ్వమని కోరుతా. ప్రధాన రోడ్డు నుంచి అతిథిగృహం వరకు సీసీ రోడ్డు మంజూరు చేయిస్తా. గ్రామంలో తాగునీటి కష్టాలు లేకుండా చేస్తా. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయిస్తా. మీ సమస్యలన్నింటినీ పరిష్కరించే వరకు నిత్యం శ్రమిస్తా. రాంరెడ్డి వెంకటరెడ్డి : అమ్మా బాగున్నారా...? మీ గ్రామంలో సమస్యలేంటో చెప్పమ్మా..? కంచర్ల కళావతి : బాగున్నామయ్యా.. మాకు పింఛన్ రావడం లేదయ్యా. ఎన్ని సార్లు దరఖాస్తు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. పింఛన్ ఇప్పించండి సారూ. రాంరెడ్డి : ఓ పెద్దాయనా.. బాగున్నావా? పంటలెలా ఉన్నాయి.? కాంపాటి శేషయ్య : ఏం చెప్పను సారూ.. వానాకాలంలో వేసిన వరి పంటకు దోమపోటు తగిలి సగం కూడా చేతికి రాలేదు. పంటకు చేసిన అప్పులు కూడా తీరేటట్టు లేవు. వేసిన పత్తి కూడా వానల్లేక ఎండిపోయింది. ఇప్పుడు వరి వేద్దామంటే నీళ్లొస్తయో రావో తెలవట్లేదయ్యా.. అప్పులెలా తీర్చాలయ్యా. రాంరెడ్డి : ఏం అక్కా? బాగున్నారా...ఏంటీ సమస్య?? సాలే నక్షత్రమ్మ : ఇళ్ళు కట్టి ఏడాదిన్నర అయ్యింది. ఇంతవరకు ఇళ్ళ బిల్లులు రాలేదయ్యా. అప్పు చేసి ఇళ్ళు కట్టినం. బిల్లు కోసం తిరిగినా ఎవరూ పట్టించుకోవట్లేదయ్యా. మీరైనా ఇప్పించండి సారూ. రాంరెడ్డి : నీ సమస్య ఏంటమ్మా? బొంకూరి పద్మ : పక్కా ఇళ్ళు లేద య్యా. ఇళ్ళు కట్టుకోవడానికి ఇంటి కో సం ఎన్ని సార్లు దరఖాస్తు చేసినా ఇళ్ళు మంజూరు కావడం లేదు. గవర్నమెంట్ ఇళ్ళు ఇప్పించండి సారూ. రాంరెడ్డి : ఏం బాబు.. ఆరోగ్యం ఎలా ఉంది? గోపి : ఏమి లేదు సార్. మూడు చక్రాల బండి కోసం అధికారులను ఎన్నిసార్లు కలిసినా ఎవరూ పట్టించుకోవడంలేదు సార్. వికలాంగుడిని.. నడవలేను. మూడు చక్రాల బండి ఇప్పించండి సార్. రాంరెడ్డి : ఏమ్మా.. వికలాంగుల పింఛన్ వస్తుందా? రావుల శోభమ్మ : నేను బోదకాలు వ్యాధితో బాధపడుతున్నానయ్యా. ఏ పనికి వెళ్ళలేకపోతున్నా. వికలాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసినా అధికారులు సర్టిఫికెట్ తెమ్మంటున్నారు. హస్పిటల్‌కు వెళ్తే బోదవాపుకు వికలాంగుల సర్టిఫికెట్ ఇవ్వమంటున్నారు. మీరైనా పింఛన్ ఇప్పించడయ్యా. రాంరెడ్డి : కాలనీలో మంచినీళ్ళు వస్తున్నాయా? సింగం శంకర్ : మంచినీళ్లు రావట్లేదు సార్. పక్కనే పాలేరు ఉన్నా నీళ్లు దొరకడం లేదు. బోరింగులు పని చేయడం లేదు. ఊళ్ళోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుంటున్నాం. రాంరెడ్డి : అంగన్వాడీ సెంటర్ నడుస్తుందామ్మా? దేశోజు నాగమ్మ : కాలనీలో అంగన్వాడీ సెంటర్ లేదయ్యా. పిల్లలకు ఇబ్బంది అవుతోంది. కాలనీలో పొద్దున లేస్తే అందరూ పనికి పోయే వాళ్ళే. పిల్లలను గ్రామ నడిబొడ్డున అరకిలోమీటరు దూరంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి పంపుతున్నం. రాంరెడ్డి : చేపల వేట ఎలా ఉంది? లాభాలు వస్తున్నాయా? బయ్య వీరస్వామి : చేపల వేట అంతగా బాగలేదు సారూ. గిట్టుబాటు కావడం లేదు. పొద్దస్తమానం తెప్పలు వేసుకొని తిరిగినా రోజుకు వంద రూపాయలూ రావట్లేదు. రాంరెడ్డి : ఏం బాబూ..మీ వాడలో సమస్యలేంటి? రావుల కాంతారావు : ప్రధాన రహదారి నుంచి బెస్తకాలనీ వరకు సీసీ రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నం సారు. వర్షాకాలమైతే మోకాల లోతు నీళ్ళు ఆగుతున్నాయి. సీసీ రోడ్డు మంజూరు చేయించండి సారు. రాంరెడ్డి : ఏమండి ధాన్యానికి గిట్టుబాటు ధర వస్తుందా? కొవ్వూరి శ్యాంసుందర్‌రెడ్డి : ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడంతో పండించిన పంటను దళారులకు అమ్ముకుంటున్నాం సార్. వారి ఇష్టం వచ్చిన ధరకు కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించండి సార్. రాంరెడ్డి : ఏమ్మా.. హోటల్ ఎలా సాగుతోంది? పిల్లలు బడికి పోతున్నారా? కాసాని అన్నపూర్ణమ్మ : ధరలు పెరిగినయి సారు. పెట్టుబడి పెట్టినా ఖర్చులు కూడా రావట్లేదు. పిల్లలను బడికి పంపాలంటే డబ్బులు సరిపోవడం లేదు. డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నా. ఏడాది కాలంగా బ్యాంకుల నుంచి రుణాలు రావట్లేదు. రాంరెడ్డి : ఏమ్మా కొట్టు ఎలా ఉంది? గిట్టుబాటు అవుతుందా? కాసాని శాంతమ్మ : నా భర్త గత మూడేళ్ళ క్రితం కరెంట్ షాక్‌తో చనిపోయాడు సారు. ఆపద్బంధు పథకం కోసం దరఖాస్తు చేశా. ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదు. పెట్టుబడి లేక కొట్టు కూడా నడపలేక పోతున్నా. పూట గడవడమే కష్టంగా ఉంది సార్. ఆపద్బంధు పథకం కింద ప్రభుత్వం నుంచి సాయం అందించండి సారు. రాంరెడ్డి : ఏం సర్పంచ్‌గారు గ్రామంలో అభివృద్ధి పనులెలా సాగుతున్నాయి? దేవర అమల : సార్ గ్రామంలో కొన్ని వీధుల్లో సీసీరోడ్లు లేవు. మెయిన్ రోడ్డు నుంచి ఎన్నెస్పీ అతిథిగృహం వరకు సీసీ రోడ్లు లేవు. బెస్తకాలనీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సెంటర్లలో మంచినీళ్లు రావడం లేదు. కాలనీలో అగన్వాడీ కేంద్రం లేదు. అర్హులైన వితంతువులు, వృద్ధులున్నా పింఛన్ మంజూరు కావడం లేదు సార్. -
మంత్రి సభలో వాగ్వాదం
కూసుమంచి : ఆసరా పథకం పింఛన్ల పంపిణీ కోసం కూసుమంచిలో శనివారం ఏర్పాటు చేసిన సభ రసాభాసగా మారింది. పింఛన్ల పంపిణీకి రాష్ట్ర మంత్రి పద్మారావు ముఖ్య అతిథిగా రాగా పాల్గొన్న ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించారు. దీంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే మాట్లాడుతూ మేం జిల్లాలో 2.45 లక్షల మందికి పింఛన్లు ఇస్తే ఈ ప్రభుత్వం తగ్గిస్తోందని, పింఛన్లు ఎందుకు తగ్గిస్తారని, ఏ ఒక్క పింఛన్ పోయినా తాను ఊరుకోనని, పోరాడుతానని అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు కూడా బడ్జెట్లో వెయ్యి కోట్లు ఇస్తే ఎందుకు సరిపోవడం లేదని, పెండిండ్ బిల్లులే రూ.1500 కోట్లు ఉన్నాయని, వీరు ఇచ్చింది ఏ ముందని ప్రశ్నించారు. అసలు తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది మేమేనని ఎమ్మెల్యే అనడంతో టీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తుల సోమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసలు మీ ప్రభుత్వం ఏమి చేసిందని ..? మీ ప్రభుత్వంలోనే ఇళ్ల బిల్లులు రాలేదని, మీరే తెలంగాణ ద్రోహి’ అంటూ ఎమ్మెల్యే ప్రసంగానికి అడ్డుతగిలారు. ఆయనకు టీఆర్ఎస్ కార్యకర్తలు మద్దతు పలికి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో డీఎస్సీ బాలకిషన్, సీఐ రవీందర్‌రెడ్డి కలుగ జేసుకుని సోమయ్యను, కార్యకర్తలను శాంతింపజేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్త ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీని వేదికపైకి విసిరేందుకు యత్నించగా పోలీసు లు అడ్డుకున్నారు. దీంతో మంత్రి పద్మారావు కల్పించుకుని టీఆర్ఎస్ కార్యకర్తలను వారించారు. సభా వేదికపై ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని విమర్శిస్తుండగా జడ్పీ చైర్మన్ కవిత అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో వారి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేకు మంత్రి చురకలు... ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడిన ఎమ్మెల్యేకు మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తనదైన శైలిలో చురకలు వేశారు. మంత్రి మాట్లాడుతూ రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నకు తనకు ముప్పై ఏళ్లుగా పరిచయం ఉందని, ఆయనున్న తాను రామన్న అంటూ పిలుస్తానని కవ్వింపుగా మాట్లాడారు. అన్నా అంటూ పిలిచిన తనను మంచిగా హైదరాబాద్‌కు పంపుతాడేమోనని అనుకుంటే పక్కనే ఉంటూ బొక్కేసిండూ అంటూ చురకలేశాడు. అన్నా మీరు మాట్లాడింది బాగానే ఉంది కానీ, మీ ప్రభుత్వంలోనే తెలంగాణకు ఒక్క పైసాగూడా ఇవ్వమని అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినప్పుడు మీరు మంత్రిగానే ఉన్నారు కదా..? అప్పుడు తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే నివ్వెర పోయారు. ఈ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలే అవుతోందని, అప్పుడే విమర్శిస్తే ఎలా..? అభివృద్ధికి సహకరించాలంటూ మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. -
షోకాజ్ లొల్లి
రేణుక వర్గానికి ఎదురుదెబ్బ ఐదుగురికి పీసీసీ షోకాజ్ నోటీసులు రాహుల్ బర్త్‌సర్టిఫికెట్ అడిగిన ఫలితం డీసీసీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఖమ్మం: ఇప్పటికే నివురు కప్పిన నిప్పులా ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కలకలం రేగింది. మరోసారి షోకాజ్ లొల్లి తెరపైకి వచ్చింది. ‘రేణుకాచౌదరి ఈ ప్రాంతానికి చెందిన వారు కాదు. ఆమెకు జిల్లాలో రాజకీయాలు చేసే అర్హత లేదు’ అని మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రేణుక వర్గానికి చెందిన నేతలు ‘ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీకి బర్త్‌సర్టిఫికెట్ ఉందా..?’ అని సంవత్సరం క్రితం విమర్శలు చేశారు. ప్రతిఢఫలంగా జిల్లాకు చెందిన ఐదుగురు నేతలకు పీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవలి కాలంలో మళ్లీ జిల్లా పార్టీపై పట్టు సాధించినట్టు కనిపిస్తున్న రేణుక వర్గానికి చెందిన ఐదుగురికి పార్టీ నోటీసులివ్వడం ఆ వర్గాన్ని కలవరపరుస్తోంది. తన వర్గానికి చెందిన 17 మంది నేతలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయించడంతో పాటు తన వర్గీయుడికి ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇప్పించడంలో సఫలీకృతురాలైన రేణుకకు నిజంగా ఇది షాకేనని పార్టీ వర్గాలంటున్నాయి. ఐదుగురికి షోకాజ్ నోటీసులు ‘రేణుక జిల్లా వ్యక్తి కాదంటే..రాహుల్‌గాంధీని ఇక్కడి నుంచి పోటీచేయాలని కోరుతున్న నేతలు ఆయనకు ఖమ్మం జిల్లాలో బర్త్ సర్టిఫికెట్ అడుగుతారా..?’ అని విలేకరుల సమావేశంలో చెప్పిన డీసీసీ జనరల్ సెక్రటరీ దిరిశాల భద్రయ్య, మహిళా కాంగ్రెస్ ఖమ్మం నగర అధ్యక్షురాలు కొల్లు పద్మ, డీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు పరుచూరి మురళి, వైరా నియోజకవర్గం కాంగ్రెస్‌పార్టీ ఇన్చార్జి సూరంపల్లి రామారావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీవీ అప్పారావులకు టీపీసీపీ క్రమశిక్షణ మండలి చైర్మన్ కోదండరెడ్డి మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్న రాహుల్‌గాంధీపై విమర్శలు చేయడం సరైంది కాదని, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్‌సింగ్ సూచనల మేరకు ఈ నోటీసలులిస్తున్నామని అందులో పేర్కొన్నారు. ఈ నోటీసులకు రాతపూర్వకంగా లేదా కమిటీ ముందు ఈనెల 17వ తేదీలోపు హాజరై సమాధానం చెప్పాలని అందులో వెల్లడించారు. రేణుకా వర్గానికి ఎదురు దెబ్బ ఇటు పీసీసీ, అటు ఏఐసీసీలో మార్కు చెల్లుతుందనే ప్రచారం జరుగుతున్న రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరికి ఈ షోకాజ్లతో ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ సీటును తన అనుచరుడు పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఇప్పించుకోవడంలో విజయం సాధించిన ఆమెకు ఆ తర్వాతి పరిణామాల్లో ఎదురు దెబ్బ తగిలింది. తన ముఖ్య అనుచరుడైన పులిపాటి వెంకయ్యను డీసీసీ కార్యాలయం నిర్వాహణ బాధ్యతల నుండి తప్పించారు. ఆయన స్థానంలో మాజీ మంత్రి రాంరెడ్డి వర్గానికి చెందిన శీలంశెట్టి వీరభద్రం, భట్టి విక్రమార్క అనుచరుడు ఐతం సత్యం, పొంగులేటి సుధాకర్‌రెడ్డి అనుచరుడు శ్రీనివాసరెడ్డిలకు కార్యాలయం బాధ్యతలు అప్పగించారు. ఖంగుతిన్న రేణుకాచౌదరి తనకున్న పలుకుబడిని ఉపయోగించి డీసీసీ ఇన్చార్జిల బాధ్యతల్లో తన అనుచరులు వీవీ అప్పారావు, పరుచూరి మురళిని కూడా చేర్పించారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అనుచరులు పొన్నం వెంకటేశ్వర్లు నగర కాంగ్రెస్ పగ్గాలు, యర్రం బాలగంగాధర్‌తిలక్, దొడ్డా అశోక్, అయూబ్‌లకు వివిధ పదవులు అప్పగించారు. ఇదిలా ఉండగా మాజీ డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావును పార్టీలో చేర్పించుకోవద్దని రేణుకాచౌదరి పట్టుపట్టినా వినకుండా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పచ్చజెండా ఊపారు. ఈ షాక్నుండి తేరుకోక ముందే ఇప్పుడు తన అనుచరులు ఐదుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో రేణుకాచౌదరి వర్గానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని జిల్లా కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. -
'రేణుకాచౌదరిని ఖమ్మం జిల్లాకు రానీవ్వం'
హైదరాబాద్: రేణుకాచౌదరి గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఆమెను ఖమ్మం జిల్లాకు రానివ్వబోమంటూ స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఎంపీ కాబట్టి ఆమె అక్కడే పనిచేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సమీక్ష సమావేశం బుధవారం గాంధీభవన్ లో జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఎంపీ రేణుకాచౌదరి వైఖరిపై మండిపడ్డారు. తమ జిల్లాకు వెంటనే పార్టీ అధ్యక్షుడ్ని నియమించాలని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను వారు కోరారు. కాగా, పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడంపై న్యాయపోరాటం చేయాలని పొన్నాలను కోరినట్టు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సీపీఐతో పొత్తు, అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు జరగడం వల్లే ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో ఓడిపోయామని ఆయన చెప్పారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు తెలిపారు. -
జాతీయ పార్టీకి అభ్యర్థులు కావలెను...!
గట్టుసింగారం (కూసుమంచి), న్యూస్‌లైన్: జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తరఫున ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారట...! ఈ విష యాన్ని ఆ పార్టీ నాయకులు తమ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికే నేరుగా చెప్పేశారు...!! ‘నిజమా...?! ఎప్పుడు.. ఎ క్కడ...’ అనేగా మీ ప్రశ్న..! ఇది చదవండి... కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం గట్టుసింగారం వచ్చారు. ఆయన అక్కడ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులతో సమావేశమయ్యారు. మండలంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. ‘ఎంతమంది ఎంపీటీసీలను గెలిపిస్తార’ని ప్రశ్నించారు. దీనికి, సమాధానం చెప్పలేక పార్టీ మండల అధ్యక్షుడు, నాయకులు నీళ్లు నమిలారు. ఇంతలో కొందరు నాయకులు లేచి, పార్టీ మండల నాయకత్వ వైఫల్యాన్ని రాంరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. 17 ఎంపీటీసీ స్థానాలకుగాను ఐదుచోట్ల అసలు అభ్యర్థులనే పోటీకి పెట్టలేదని చెప్పారు. పార్టీలోని కొందరి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది వినగానే.. రాంరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ‘పోటీలో పెట్టేందుకు అభ్యర్థులే దొరకలేదా..?’ అని, మండల నాయకులను నిలదీశారు. ‘ఇంత అభివృద్ధి చేసిన మనకు అభ్యర్థులు కరువా...? మండల నాయకులు సరిగ్గా ఉంటే ఇట్లానే ఉంటుందా..?’ అని, తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ఇంతలో.. కొందరు నాయకులు ఆయన చెవిలో.. ‘మీడియా వాళ్లు ఉన్నార్సార్...’ అంటూ గుసగుసలాడారు. ఆ నేత ఇదేమీ పట్టించుకోకుండా మరోసారి భగ్గుమన్నారు. ‘మీరు చేసిన పనికి ఇప్పుడు సిగ్గుపడడమెందుకు..? మీరేం చే స్తారో నాకు తెలీదు. కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపిం చాలి. ఎంపీపీని కైవసం చేసుకోవాలి’ అని హుకుం జారీ చేశారు. సరేనంటూ నాయకులు తలలూపారు. కొద్ది క్షణాల తరువాత... ‘మీరు ఇట్లా చేస్తే.. అసలు నేను ఎమ్మెల్యేగా పోటీలోనే ఉండను..’ అంటూ, రాంరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు...! దీంతో, అక్కడున్న నాయకులంతా అవాక్కయ్యారు. -
రాస్తారోకో కేసులో ఎమ్మెల్యే చంద్రావతి అరెస్ట్
ఏన్కూరు న్యూస్‌లైన్: ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బాణోతు చంద్రావతిని ఏన్కూరు పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 11న ఏన్కూరులో మంత్రి రాంరెడ్డి భూపట్టాలు పంపిణీ చేసిన సందర్భంగా లబ్ధిదారులకు సరైన సౌకర్యాలు కల్పించ లేదని ఎమ్మెల్యే రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు కల్పించారని ఎమ్మెల్యేతో సహా పలువురిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఎమ్మెల్యేను అరెస్టు చేసి అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. -
‘ఆడబిడ్డ’కు చెక్!
సాక్షి, కొత్తగూడెం: కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రాజుకుంది. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిని టార్గెట్ చేసుకొని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. ఎన్నికల నాటికి ఆమెను జిల్లా రాజకీయాల నుంచి తప్పించడమే వారు ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే... ‘అధికార పదవి అందుకే ఊడింది’ అని తాజాగా లీకులు ఇస్తూ జిల్లాలోని ఆమె క్యాడర్‌ను నిస్తేజంలోకి నెడుతున్నారు. జిల్లాలో మంత్రితో నువ్వా..నేనా..? అనే స్థాయిలో రేణుక అమీతుమీకి సిద్ధమైన సమయంలోనే ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవి నుంచి ఆమెను పక్కనపెట్టారు. దీంతో ఆమె క్యాడర్ అయోమయంలో పడింది. మళ్లీ జిల్లా పర్యటన చేసి కొంతమేర ఆమె అనుచరుల్లో ఉత్సాహం నింపినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సమయానికి ఏమి జరుగుతుందోనన్న ఆందోళన ఆమె వర్గీయుల్లో ఇంకా నెలకొంది. ఆమెనే నమ్ముకుని అసెంబ్లీ టికెట్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా ఇప్పుడు డైలామాలో పడ్డారు. ఇదిలావుంటే... బుధవారంనాడు మంత్రి రాంరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను హైదరాబాద్‌లో కలిసి డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావును పక్కన పెట్టి, తమ అనుచరులకు ఆపదవి కట్టబెట్టాలని కోరిన విషయం విదితమే. అంతేకాకుండా తమ వ్యూహంలో భాగంగా ‘రేణుక పదవి ఎందుకు ఊడిందంటే’...అంటూ అక్కడ మీడియాకు కూడా లీకులిచ్చారు. రే ణుక తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి వసుంధరరాజే (రాజస్థాన్ ముఖ్యమంత్రి)తో స్నేహంగా మెలిగేవారని, ఆమె ముఖ్యమంత్రి కావడంతో.. కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ఓడిపోయినప్పటికీ రేణుక పార్టీ చేసుకున్నారని, ఈ విషయాన్ని ఆంగ్ల పత్రికలు ప్రచురించాయని, ఈ విషయం అధినేత్రి సోనియాగాంధీకి తెలిసి పదవిని ఊడగొట్టారని లీకులు ఇచ్చారు. ఈ లీకులతో పాటు రేణుక ప్రధాన అనుచరుడయిన డీసీసీ అధ్యక్షుడు వనమాను పక్కనపెట్టాలనే ప్రతిపాదనలు తేవడం ద్వారా ఆమె వర్గాన్ని ఊపిరిసలపకుండా ఉంచాలన్న వ్యూహంతో వారు ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. టికెట్ల హామీలపై గుర్రు.. జిల్లాలో అసెంబ్లీ టికెట్లు ఇప్పిస్తానని చాలా మందికి రేణుక హామీ ఇవ్వడంపై కూడా మంత్రి రాంరెడ్డి, పొంగులేటి గుర్రుగా ఉన్నారు. ఖమ్మం పార్లమెంటు సీటుకు సంబంధించి తనకు లేదా తన కుటుంబ సభ్యులకు టికెట్ రాకపోతే, తన వర్గీయుడైన ఓ నేతకు టికెట్ ఇప్పిస్తానని, అదీ కుదరకపోతే మరో ప్రముఖ వ్యాపారికైనా టికెట్ ఓకే చేయిస్తానని ఆమె హామీ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే వైరా నియోజకవర్గానికి సంబంధించి వచ్చిన వారికల్లా టికెట్ నీదేనని హామీ ఇవ్వడంతో ఎవరికివారు అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. ఇదే పరిస్థితి మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా నెలకొంది. ఈ పరిస్థితుల్లో తమ ప్రయత్నాలకు అడ్డు తగలకుండా ఉండ డంతో పాటు... తమ అనుచరుల టికెట్లకు అడ్డంకులు రాకుండా ఉండేందుకు గాను రేణుకకు ఎసరుపెట్టక తప్పదని రాంరెడ్డి, పొంగులేటి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంతోనే వారు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాహుల్‌కు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధం.. గతంలో రాహుల్‌గాంధీ ‘ప్లేస్ ఆఫ్ బర్త్’ విషయాన్ని రేణుక అనుచరులు నేరుగా ప్రశ్నించడాన్నే ఇరువురు నేతలు తమకు అనుకూల అస్త్రంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. అప్పట్లో ఈ అంశం పీసీసీ వరకు వెళ్లగా రేణుక అనుచరులను మందలించారు. అయితే ఇదే అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి ఏకంగా రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేసేందుకు మంత్రి, పొంగులేటి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇలా చేస్తే జిల్లా రాజకీయాల నుంచి రేణుకకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చని, ఇక జిల్లాలో తమదే ఆధిపత్యం కొనసాగుతుందని వారు భావిస్తున్నట్లు పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పటివరకూ మౌనంగా ఉన్న రేణుక ఘాటుగానే స్పందిస్తారని, హస్తినలో ఆమె కూడా ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. మొత్తంగా ఆడబిడ్డను సాగనంపుతారా....లేక ఫైర్‌బ్రాండ్ ఎత్తులకు ఇద్దరు నేతలు చిత్తవుతారా తేలాల్సి ఉందనే చర్చ ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. -
‘పోడు’ పట్టాల ఘనత వైఎస్‌దే
బయ్యారం, న్యూస్‌లైన్: సంవత్సరాల తరబడి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిచ్చి, ఆ భూములపై భరోసా కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర ఉద్యానవన శాఖా మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం బయ్యారంలోని కోదండ రామచంద్రస్వామి ఫంక్షన్హల్లో ఏడో విడత భూపంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు ఆరు విడతలలో 21,462 మంది రైతులకు 31,330 ఎకరాల భూమి పంపిణీ చేశామని, ప్రస్తుతం ఏడో విడుతలో 6741 మంది రైతులకు 14,352 ఎకరాల భూమి పంపిణీ చేస్తామని వివరించారు. ఇంత కాలం అనుభవిస్తున్న భూమిపై హక్కులు లేని నిరుపేదలు ఇక నుంచి ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని రాయితీలు పొందవచ్చన్నారు. 2004లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకే ఇప్పటికీ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అమలవుతోందని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తెల్ల రేషన్‌కార్డు ఉన్న పేదలకు కార్పొరేట్ ఆస్పత్రులలో ఉచిత వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల అబివృద్ధికి దేశంలోనే తొలిసారి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలులోకి తెచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రూ. 5 వేల కోట్లతో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీనిద్వారా స్థానికులు ఐదువేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. జిల్లాలో అత్యధికంగా గిరిజన రైతులకు భూపంపిణీ చేస్తున్నామన్నారు. బయ్యారం చెరువు అబివృద్ధికి రూ.35 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య, కొత్తగూడెం ఆర్డీఓ అమయ్‌కుమార్, ల్యాండ్ సర్వే ఏఓ ప్రభాకర్, తహశీల్దార్ పుల్లయ్య, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఏఓ కిశోర్‌బాబు, సొసైటీ అధ్యక్షుడు బిక్షం, ఆయా గ్రామాల సర్పంచులు కవిత, విజయకుమారి, శ్రీనివాస్, కైక, రంగీలాల్, కోటమ్మ, అనసూర్య తదితరులు పాల్గొన్నారు. సమస్యలపై పలువురి వినతులు... మండలంలోని పలు గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులకు వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, బీజేపీ నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. కాగా, మంత్రుల పర్యటనను పురస్కరించుకుని ఇల్లెందు డీఎస్పీ క్రిష్ణ ఆద్వర్యంలో గార్ల-బయ్యారం సీఐ జైపాల్ పర్యవేక్షణలో భారీగా పోలీసు బందోబస్త్ నిర్వహించారు. -
రేణుక, రాంరెడ్డి వెంకటరెడ్డి వర్గాల ఘర్షణ