షోకాజ్ లొల్లి
రేణుక వర్గానికి ఎదురుదెబ్బ
ఐదుగురికి పీసీసీ షోకాజ్ నోటీసులు
రాహుల్ బర్త్‌సర్టిఫికెట్ అడిగిన ఫలితం
డీసీసీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు
ఖమ్మం: ఇప్పటికే నివురు కప్పిన నిప్పులా ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కలకలం రేగింది. మరోసారి షోకాజ్ లొల్లి తెరపైకి వచ్చింది. ‘రేణుకాచౌదరి ఈ ప్రాంతానికి చెందిన వారు కాదు. ఆమెకు జిల్లాలో రాజకీయాలు చేసే అర్హత లేదు’ అని మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రేణుక వర్గానికి చెందిన నేతలు ‘ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీకి బర్త్‌సర్టిఫికెట్ ఉందా..?’ అని సంవత్సరం క్రితం విమర్శలు చేశారు. ప్రతిఢఫలంగా జిల్లాకు చెందిన ఐదుగురు నేతలకు పీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
ఇటీవలి కాలంలో మళ్లీ జిల్లా పార్టీపై పట్టు సాధించినట్టు కనిపిస్తున్న రేణుక వర్గానికి చెందిన ఐదుగురికి పార్టీ నోటీసులివ్వడం ఆ వర్గాన్ని కలవరపరుస్తోంది. తన వర్గానికి చెందిన 17 మంది నేతలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయించడంతో పాటు తన వర్గీయుడికి ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇప్పించడంలో సఫలీకృతురాలైన రేణుకకు నిజంగా ఇది షాకేనని పార్టీ వర్గాలంటున్నాయి.
ఐదుగురికి షోకాజ్ నోటీసులు
‘రేణుక జిల్లా వ్యక్తి కాదంటే..రాహుల్‌గాంధీని ఇక్కడి నుంచి పోటీచేయాలని కోరుతున్న నేతలు ఆయనకు ఖమ్మం జిల్లాలో బర్త్ సర్టిఫికెట్ అడుగుతారా..?’ అని విలేకరుల సమావేశంలో చెప్పిన డీసీసీ జనరల్ సెక్రటరీ దిరిశాల భద్రయ్య, మహిళా కాంగ్రెస్ ఖమ్మం నగర అధ్యక్షురాలు కొల్లు పద్మ, డీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు పరుచూరి మురళి, వైరా నియోజకవర్గం కాంగ్రెస్‌పార్టీ ఇన్‌చార్జి సూరంపల్లి రామారావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీవీ అప్పారావులకు టీపీసీపీ క్రమశిక్షణ మండలి చైర్మన్ కోదండరెడ్డి మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
పార్టీలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్న రాహుల్‌గాంధీపై విమర్శలు చేయడం సరైంది కాదని, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్‌సింగ్ సూచనల మేరకు ఈ నోటీసలులిస్తున్నామని అందులో పేర్కొన్నారు. ఈ నోటీసులకు రాతపూర్వకంగా లేదా కమిటీ ముందు ఈనెల 17వ తేదీలోపు హాజరై సమాధానం చెప్పాలని అందులో వెల్లడించారు.
రేణుకా వర్గానికి ఎదురు దెబ్బ
ఇటు పీసీసీ, అటు ఏఐసీసీలో మార్కు చెల్లుతుందనే ప్రచారం జరుగుతున్న రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరికి ఈ షోకాజ్‌లతో ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ సీటును తన అనుచరుడు పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఇప్పించుకోవడంలో విజయం సాధించిన ఆమెకు ఆ తర్వాతి పరిణామాల్లో ఎదురు దెబ్బ తగిలింది. తన ముఖ్య అనుచరుడైన పులిపాటి వెంకయ్యను డీసీసీ కార్యాలయం నిర్వాహణ బాధ్యతల నుండి తప్పించారు. ఆయన స్థానంలో మాజీ మంత్రి రాంరెడ్డి వర్గానికి చెందిన శీలంశెట్టి వీరభద్రం, భట్టి విక్రమార్క అనుచరుడు ఐతం సత్యం, పొంగులేటి సుధాకర్‌రెడ్డి అనుచరుడు శ్రీనివాసరెడ్డిలకు కార్యాలయం బాధ్యతలు అప్పగించారు.
ఖంగుతిన్న రేణుకాచౌదరి తనకున్న పలుకుబడిని ఉపయోగించి డీసీసీ ఇన్‌చార్జిల బాధ్యతల్లో తన అనుచరులు వీవీ అప్పారావు, పరుచూరి మురళిని కూడా చేర్పించారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అనుచరులు పొన్నం వెంకటేశ్వర్లు నగర కాంగ్రెస్ పగ్గాలు, యర్రం బాలగంగాధర్‌తిలక్, దొడ్డా అశోక్, అయూబ్‌లకు వివిధ పదవులు అప్పగించారు. ఇదిలా ఉండగా మాజీ డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావును పార్టీలో చేర్పించుకోవద్దని రేణుకాచౌదరి పట్టుపట్టినా వినకుండా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పచ్చజెండా ఊపారు. ఈ షాక్‌నుండి తేరుకోక ముందే ఇప్పుడు తన అనుచరులు ఐదుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో రేణుకాచౌదరి వర్గానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని జిల్లా కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.