న్యూఢిల్లీ: 2019 ఎన్నికలకు బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్‌లో ఇప్పుడే ఇంటిపోరు మొదలైంది. మిగతా పార్టీలతో సర్దుకుపోయేందుకు ఆయా రాష్ట్రాల్లో పార్టీ నేతలే ససేమిరా అంటున్నారు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు అన్ని రాష్ట్రాల పార్టీ నేతలతో ఈ వారంలో విడివిడిగా సమావేశాలు జరపాలని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరు సాగించాలన్న అధిష్టానం నిర్ణయం పశ్చిమబెంగాల్ విభాగంలో విభేదాలకు ఆజ్యం పోసింది.
రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం సీపీఎంతో జట్టు కట్టాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్ రంజన్ కోరుతుండగా, తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీకి దిగాలని రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే మైనుల్ హక్ పట్టుబడుతున్నారు. హక్ తన మద్దతుదారులతో కలిసి‡ టీఎంసీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో రాహుల్ లెఫ్ట్ పార్టీతో ఎన్నిలకు వెళతారా అనేది తేలాల్సి ఉంది. ‘మేం పార్టీని వదిలి వెళ్లడం లేదు. రాహుల్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం’ అని హక్ తెలిపారు. ‘గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు సీపీఎంతో కలిసి బరిలోకి దిగాం. అయితే, మా అభ్యర్ధులకు సీపీఎం ఓట్లేమీ పడలేదు. ఆ పార్టీకి రాష్ట్రంలో ప్రస్తుతం పట్టులేదు. ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లడమంటే ఆత్మహత్యతో సమానం’ అని అన్నారు.
ఆప్‌తో జట్టు కట్టేది లేదు
ఆప్‌తో కలిసి పోటీ చేసే విషయమై రాహుల్ నిర్ణయం తీసుకోకమునుపే.. ఢిల్లీ అధికార పార్టీతో ఎలాంటి భాగస్వామ్యం ఉండదని రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. బీజేపీతో ఆప్ చేతులు కలిపిందని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా అజయ్ మాకెన్ ఆరోపిస్తున్నారు.. ఆప్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ జట్టు కట్టేది లేదని పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ కుండబద్దలు కొడుతోంది. బీఎస్‌పీతో కలిసి పోటీ చేసే విషయంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతల్లో విభేదాలున్నాయి. అసెంబ్లీలో నామమాత్రంగా బలం కలిగిన బీఎస్‌పీతో అంగీకారం అంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఆత్మహత్యతో సమానమని మాజీ సీడబ్ల్యూసీ సభ్యుడు అనిల్ శాస్త్రి వ్యాఖ్యానించారు. బరిలో ఎలా దిగినా పార్టీ నేతల రాజకీయ భవితవ్యంపై ప్రభావం పడకుండా చూస్తామని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు. రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ కూడా స్థానికంగా బీఎస్‌పీతో పొత్తు విషయంలో అనుకూలంగా లేరు.
Comments
Please login to add a commentAdd a comment