కూసుమంచి : ఆసరా పథకం పింఛన్‌ల పంపిణీ కోసం కూసుమంచిలో శనివారం ఏర్పాటు చేసిన సభ రసాభాసగా మారింది. పింఛన్‌ల పంపిణీకి రాష్ట్ర మంత్రి పద్మారావు ముఖ్య అతిథిగా రాగా పాల్గొన్న ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించారు. దీంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఎమ్మెల్యే మాట్లాడుతూ మేం జిల్లాలో 2.45 లక్షల మందికి పింఛన్‌లు ఇస్తే ఈ ప్రభుత్వం తగ్గిస్తోందని, పింఛన్‌లు ఎందుకు తగ్గిస్తారని, ఏ ఒక్క పింఛన్ పోయినా తాను ఊరుకోనని, పోరాడుతానని అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు కూడా బడ్జెట్‌లో వెయ్యి కోట్లు ఇస్తే ఎందుకు సరిపోవడం లేదని, పెండిండ్ బిల్లులే రూ.1500 కోట్లు ఉన్నాయని, వీరు ఇచ్చింది ఏ ముందని ప్రశ్నించారు. అసలు తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది మేమేనని ఎమ్మెల్యే అనడంతో టీఆర్‌ఎస్ పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బత్తుల సోమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘అసలు మీ ప్రభుత్వం ఏమి చేసిందని ..? మీ ప్రభుత్వంలోనే ఇళ్ల బిల్లులు రాలేదని, మీరే తెలంగాణ ద్రోహి’ అంటూ ఎమ్మెల్యే ప్రసంగానికి అడ్డుతగిలారు. ఆయనకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు మద్దతు పలికి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో డీఎస్సీ బాలకిషన్, సీఐ రవీందర్‌రెడ్డి కలుగ జేసుకుని సోమయ్యను, కార్యకర్తలను శాంతింపజేశారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యేకు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ కార్యకర్త ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీని వేదికపైకి విసిరేందుకు యత్నించగా పోలీసు లు అడ్డుకున్నారు. దీంతో మంత్రి పద్మారావు కల్పించుకుని టీఆర్‌ఎస్ కార్యకర్తలను వారించారు. సభా వేదికపై ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని విమర్శిస్తుండగా జడ్పీ చైర్మన్ కవిత అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో వారి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది.
ఎమ్మెల్యేకు మంత్రి చురకలు...
ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడిన ఎమ్మెల్యేకు మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తనదైన శైలిలో చురకలు వేశారు. మంత్రి మాట్లాడుతూ రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నకు తనకు ముప్పై ఏళ్లుగా పరిచయం ఉందని, ఆయనున్న తాను రామన్న అంటూ పిలుస్తానని కవ్వింపుగా మాట్లాడారు. అన్నా అంటూ పిలిచిన తనను మంచిగా హైదరాబాద్‌కు పంపుతాడేమోనని అనుకుంటే పక్కనే ఉంటూ బొక్కేసిండూ అంటూ చురకలేశాడు.
అన్నా మీరు మాట్లాడింది బాగానే ఉంది కానీ, మీ ప్రభుత్వంలోనే తెలంగాణకు ఒక్క పైసాగూడా ఇవ్వమని అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినప్పుడు మీరు మంత్రిగానే ఉన్నారు కదా..? అప్పుడు తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే నివ్వెర పోయారు. ఈ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలే అవుతోందని, అప్పుడే విమర్శిస్తే ఎలా..? అభివృద్ధికి సహకరించాలంటూ మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
మంత్రి సభలో వాగ్వాదం
Published Sun, Nov 9 2014 4:12 AM | Last Updated on Mon, Aug 20 2018 6:02 PM
Advertisement
Advertisement