విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి..
హైదరాబాద్: ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ఆయన ప్రజల కోసం ఎంతో సేవ చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిపక్ష నేత జానారెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రెడ్యానాయక్ నివాళులు అర్పించారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక వారు సభలో మాట్లాడారు.
జానారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే రాంరెడ్డి వెంకటరెడ్డి రాజకీయాలపై ఆసక్తిచూపారని అన్నారు. వ్యవసాయం అంటే ఎంతో ఇష్టమని, సర్పంచ్గా రాజకీయ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారని గుర్తు చేసుకున్నారు. రాంరెడ్డి వెంకటరెడ్డి లేని లోటు తీర్చలేనిదని, కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. గత 30 ఏళ్లుగా ఆయన సేవలందించారని చెప్పారు.