
సాక్షి, హైదరాబాద్ : తమను సస్సెండ్ చేసే అధికారం అధికారపక్షానికి లేనేలేదని విపక్ష కాంగ్రెస్ వాదిస్తోంది. గవర్నర్ ప్రసంగం సదర్భంగా జరిగిన ఘటనలపై నిర్ణయాధికారం గవర్నర్‌దేతప్ప అసెంబ్లీదో, రాష్ట్రప్రభుత్వానిదో కాదని ప్రతిపక్షనేత జానారెడ్డి అన్నారు. నియంతృత్వ ధోరణిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడి రాజీనామాలు చేయనున్నట్లు తెలిపారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. అసలు చైర్మన్ స్వామిగౌడ్‌పై దాడి జరగనేలేదని, దమ్ముంటే వీడియోలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో టీఆర్‌ఎస్ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని శ్రేణులకు సూచించింది.
అది గవర్నర్ పరిధిలోని అంశం : ‘‘నిన్న సభలో జరిగిన ఘటన గవర్నర్ పరిధిలోని అంశం. చర్యలు తీసుకునే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. అందరినీ సస్పెండ్ చేయడం రాజ్యంగ విరుద్ధం. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది కాబట్టే ప్రజల దృష్టిని మరల్చేందుకు సస్పెన్షన్లను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం అవలంభిస్తోన్న అప్రజాస్వామిక చర్యలను అందరూ ఖండించాలి’’ అని సీఎల్పీనేత జానారెడ్డి అన్నారు.
దమ్ముంటే వీడియోలు బయటపెట్టండి : ‘‘కావాలనే మమ్మల్ని సభ నుంచి గెంటేశారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశాడు. సభలో జరిగిందివేరు.. బయట సీఎం నడిపిన డ్రామా వేరు. మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై దాడి జరిగిందనడం అవాస్తవం. మావాళ్లు హెడ్‌సెట్ విసిరిన దృశ్యాలే చూపెడుతున్నారుగానీ, వేరే దృశ్యాలు చూపెట్టట్లేదంటే ఏమిటి అర్థం? దమ్ముంటే అన్ని వీడియోలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సభ ముగిశాక చైర్మన్.. గవర్నర్‌ను కారుదాకా తీసుకెళ్లి, నవ్వుతూ సాగనంపారని, ఆ తర్వాత సీఎం పథకం ప్రకారం నాటకానికి తెరలేచింది. ఈ సస్పెన్షన్లకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదు. న్యాయం కోసం ప్రజల్లోకి వెళతాం..’ అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు.