సాక్షి, హైదరాబాద్ : తమపై శాసనసభ సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్ల వేటును విపక్ష కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది. స్పీకర్ చర్యలను తీవ్రంగా నిరసిస్తూ ఈమేరకు సంచలన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు ప్రకటించింది. అందరికీ అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని సీఎల్పీ నేత జానారెడ్డి చెప్పారు. ‘ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తున్నది. ఏ నిబంధన ప్రకారం మా సభ్యుల సభ్యత్వాలు రద్దు చేస్తారు? ఏం తప్పు చేశామని సస్సెన్షన్ విధించారు? కనీసం వివరణ తీసుకోకుండా ఇంత తీవ్ర నిర్ణయం తీసుకుంటారా? ఇక మీతో మాట్లాడి ప్రయోజనం లేదు. ప్రజాక్షేత్రంలోనే అమీతుమీ తేల్చుకుంటాం..’ అని కాంగ్రెస్ పక్షనేత జానా రెడ్డి అన్నారు.
అధిష్టానం గ్రీన్ సిగ్నల్ తర్వాతే.. : మంగళవారం శాసన సభ ప్రారంభమైన వెంటనే 11 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్న తీర్మానం ఆమోదం పొందింది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ల సభ్యత్వాల రద్దు, ఇతర సభ్యులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో సభ నుంచి బయటికొచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ ఆఫీసులో అత్యవసరంగా సమావేశమయ్యారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ‘‘వాళ్లు సస్పెండ్ చెయ్యడం కాదు.. మనమే మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం..’ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఢిల్లీ అధిష్టానానికి కూడా తెలియజేశామని, అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రాజీనామాలు చేస్తామని నేతలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment