బయ్యారం, న్యూస్‌లైన్:
సంవత్సరాల తరబడి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిచ్చి, ఆ భూములపై భరోసా కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర ఉద్యానవన శాఖా మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం బయ్యారంలోని కోదండ రామచంద్రస్వామి ఫంక్షన్‌హల్‌లో ఏడో విడత భూపంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు ఆరు విడతలలో 21,462 మంది రైతులకు
31,330 ఎకరాల భూమి పంపిణీ చేశామని, ప్రస్తుతం ఏడో విడుతలో 6741 మంది రైతులకు 14,352 ఎకరాల భూమి పంపిణీ చేస్తామని వివరించారు. ఇంత కాలం అనుభవిస్తున్న భూమిపై హక్కులు లేని నిరుపేదలు ఇక నుంచి ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని రాయితీలు పొందవచ్చన్నారు.
2004లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకే ఇప్పటికీ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అమలవుతోందని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తెల్ల రేషన్‌కార్డు ఉన్న పేదలకు కార్పొరేట్ ఆస్పత్రులలో ఉచిత వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల అబివృద్ధికి దేశంలోనే తొలిసారి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలులోకి తెచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రూ. 5 వేల కోట్లతో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీనిద్వారా స్థానికులు ఐదువేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. జిల్లాలో అత్యధికంగా గిరిజన రైతులకు భూపంపిణీ చేస్తున్నామన్నారు. బయ్యారం చెరువు అబివృద్ధికి రూ.35 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య, కొత్తగూడెం ఆర్డీఓ అమయ్‌కుమార్, ల్యాండ్ సర్వే ఏఓ ప్రభాకర్, తహశీల్దార్ పుల్లయ్య, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఏఓ కిశోర్‌బాబు, సొసైటీ అధ్యక్షుడు బిక్షం, ఆయా గ్రామాల సర్పంచులు కవిత, విజయకుమారి, శ్రీనివాస్, కైక, రంగీలాల్, కోటమ్మ, అనసూర్య తదితరులు పాల్గొన్నారు.
సమస్యలపై పలువురి వినతులు...
మండలంలోని పలు గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, బీజేపీ నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. కాగా, మంత్రుల పర్యటనను పురస్కరించుకుని ఇల్లెందు డీఎస్పీ క్రిష్ణ ఆద్వర్యంలో గార్ల-బయ్యారం సీఐ జైపాల్ పర్యవేక్షణలో భారీగా పోలీసు బందోబస్త్ నిర్వహించారు.
‘పోడు’ పట్టాల ఘనత వైఎస్‌దే
Published Mon, Dec 16 2013 1:59 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM
Advertisement
Advertisement