సాక్షి, కొత్తగూడెం: కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రాజుకుంది. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిని టార్గెట్ చేసుకొని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. ఎన్నికల నాటికి ఆమెను జిల్లా రాజకీయాల నుంచి తప్పించడమే వారు ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే... ‘అధికార పదవి అందుకే ఊడింది’ అని తాజాగా లీకులు ఇస్తూ జిల్లాలోని ఆమె క్యాడర్‌ను నిస్తేజంలోకి నెడుతున్నారు.
జిల్లాలో మంత్రితో నువ్వా..నేనా..? అనే స్థాయిలో రేణుక అమీతుమీకి సిద్ధమైన సమయంలోనే ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవి నుంచి ఆమెను పక్కనపెట్టారు. దీంతో ఆమె క్యాడర్ అయోమయంలో పడింది. మళ్లీ జిల్లా పర్యటన చేసి కొంతమేర ఆమె అనుచరుల్లో ఉత్సాహం నింపినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సమయానికి ఏమి జరుగుతుందోనన్న ఆందోళన ఆమె వర్గీయుల్లో ఇంకా నెలకొంది. ఆమెనే నమ్ముకుని అసెంబ్లీ టికెట్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా ఇప్పుడు డైలామాలో పడ్డారు. ఇదిలావుంటే... బుధవారంనాడు మంత్రి రాంరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను హైదరాబాద్‌లో కలిసి డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావును పక్కన పెట్టి, తమ అనుచరులకు ఆపదవి కట్టబెట్టాలని కోరిన విషయం విదితమే.
అంతేకాకుండా తమ వ్యూహంలో భాగంగా ‘రేణుక పదవి ఎందుకు ఊడిందంటే’...అంటూ అక్కడ మీడియాకు కూడా లీకులిచ్చారు. రే ణుక తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి వసుంధరరాజే (రాజస్థాన్ ముఖ్యమంత్రి)తో స్నేహంగా మెలిగేవారని, ఆమె ముఖ్యమంత్రి కావడంతో.. కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ఓడిపోయినప్పటికీ రేణుక పార్టీ చేసుకున్నారని, ఈ విషయాన్ని ఆంగ్ల పత్రికలు ప్రచురించాయని, ఈ విషయం అధినేత్రి సోనియాగాంధీకి తెలిసి పదవిని ఊడగొట్టారని లీకులు ఇచ్చారు. ఈ లీకులతో పాటు రేణుక ప్రధాన అనుచరుడయిన డీసీసీ అధ్యక్షుడు వనమాను పక్కనపెట్టాలనే ప్రతిపాదనలు తేవడం ద్వారా ఆమె వర్గాన్ని ఊపిరిసలపకుండా ఉంచాలన్న వ్యూహంతో వారు ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది.
టికెట్ల హామీలపై గుర్రు..
జిల్లాలో అసెంబ్లీ టికెట్లు ఇప్పిస్తానని చాలా మందికి రేణుక హామీ ఇవ్వడంపై కూడా మంత్రి రాంరెడ్డి, పొంగులేటి గుర్రుగా ఉన్నారు. ఖమ్మం పార్లమెంటు సీటుకు సంబంధించి తనకు లేదా తన కుటుంబ సభ్యులకు టికెట్ రాకపోతే, తన వర్గీయుడైన ఓ నేతకు టికెట్ ఇప్పిస్తానని, అదీ కుదరకపోతే మరో ప్రముఖ వ్యాపారికైనా టికెట్ ఓకే చేయిస్తానని ఆమె హామీ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే వైరా నియోజకవర్గానికి సంబంధించి వచ్చిన వారికల్లా టికెట్ నీదేనని హామీ ఇవ్వడంతో ఎవరికివారు అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. ఇదే పరిస్థితి మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా నెలకొంది. ఈ పరిస్థితుల్లో తమ ప్రయత్నాలకు అడ్డు తగలకుండా ఉండ డంతో పాటు... తమ అనుచరుల టికెట్లకు అడ్డంకులు రాకుండా ఉండేందుకు గాను రేణుకకు ఎసరుపెట్టక తప్పదని రాంరెడ్డి, పొంగులేటి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంతోనే వారు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాహుల్‌కు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధం..
గతంలో రాహుల్‌గాంధీ ‘ప్లేస్ ఆఫ్ బర్త్’ విషయాన్ని రేణుక అనుచరులు నేరుగా ప్రశ్నించడాన్నే ఇరువురు నేతలు తమకు అనుకూల అస్త్రంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. అప్పట్లో ఈ అంశం పీసీసీ వరకు వెళ్లగా రేణుక అనుచరులను మందలించారు. అయితే ఇదే అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి ఏకంగా రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేసేందుకు మంత్రి, పొంగులేటి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇలా చేస్తే జిల్లా రాజకీయాల నుంచి రేణుకకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చని, ఇక జిల్లాలో తమదే ఆధిపత్యం కొనసాగుతుందని వారు భావిస్తున్నట్లు పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పటివరకూ మౌనంగా ఉన్న రేణుక ఘాటుగానే స్పందిస్తారని, హస్తినలో ఆమె కూడా ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. మొత్తంగా ఆడబిడ్డను సాగనంపుతారా....లేక ఫైర్‌బ్రాండ్ ఎత్తులకు ఇద్దరు నేతలు చిత్తవుతారా తేలాల్సి ఉందనే చర్చ ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
‘ఆడబిడ్డ’కు చెక్!
Published Fri, Jan 24 2014 3:20 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement