సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గ్రూపు గొడవలు, అంతర్గత కుమ్ములాటలకు నెలవైన జిల్లా కాంగ్రెస్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రేణుకాచౌదరి అనుచరులు వర్గాలుగా విడిపోయి పనిచేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై అధిష్టానం దృష్టి సారించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అభ్యర్థిత్వాన్ని ఢిల్లీ పెద్దలు తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇందుకు మనోహర్ సామాజిక వర్గ నేపథ్యంతో పాటు జిల్లా పార్టీలోని రెండు గ్రూపుల నడుమ మధ్యేమార్గాన్ని ఎంచుకోవడమే ఉత్తమమనే భావనకు అధిష్టానం రావడమే కారణమని తెలుస్తోంది. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కష్టమని భావించడంతో పాటు, ఖమ్మంలో స్థానికేతరులకు విజయావకాశాలు ఎక్కువ అని కూడా అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం.
పార్టీ ఆంతర్యం ఇలా..
గుంటూరు జిల్లాకు చెందిన నాదెండ్ల మనోహర్‌ను ఖమ్మం పంపే విషయంలో అధిష్టానం కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పెద్దల ఆలోచన ప్రకారం... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అసెంబ్లీ స్పీకర్‌గా నిర్వర్తించాల్సిన బాధ్యతను రూల్ పొజిషన్ ప్రకారం ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా మనోహర్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాల సమావేశాలను ప్రోరోగ్ చేసే అంశంలో కూడా ఆయన అధిష్టానానికి పూర్తిగా సహకరించారు. ఎక్కడా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న భావన రానీయలేదు.
దీంతో పాటు తెలంగాణకు వ్యతిరేకంగా అధిష్టానంపై ధిక్కారస్వరాన్ని వినిపిస్తూ అంతర్గతంగా సహకరిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి భిన్నంగా తన రాజ్యాంగపరమైన బాధ్యతలను సమర్థవంతంగా చక్కబెడుతున్నారు. ఎన్నికల బరిలో దింపినా తాను సభాపతిగా ఉన్నప్పుడే తెలంగాణ బిల్లును అసెంబ్లీలో చర్చించి పార్లమెంటుకు పంపానని చెప్పుకునే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుడైనప్పటికీ తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. రేణుకాచౌదరి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినంత సులువుగా రాంరెడ్డి వర్గం కూడా స్పీకర్ పట్ల వ్యవహరించలేదు.
దీనికి తోడు గతంలో ఆయన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కూడా ఎంపీగా ఖమ్మం పార్లమెంటుకు ప్రాతిని ధ్యం వహించారు. ఆయనకు కూడా ఇక్క డి ప్రజలతో మంచి సంబంధాలున్నాయి. మనోహర్ సామాజికవర్గం కూడా ఇక్కడ ఆయనకు ఉపకరిస్తుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అధిష్టానం మనోహర్ పేరును తీవ్రంగా పరిశీలిస్తున్నదనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.
కొట్టుకున్నా... మాకే!
ఇదిలా ఉంటే మంత్రి, ఎంపీ గ్రూపులు కూడా ఖమ్మం పార్లమెంట్ స్థానం కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డి ఈసారి ఖమ్మం పార్లమెంటు స్థానంపై కూడా కన్నేశారు. తన సోదరుడు, సూర్యాపేట ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని ఇక్కడి నుంచి పోటీ చేయించేందుకు ఢిల్లీ పెద్దల అనుమతి కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. సర్వోత్తమ్‌రెడ్డికి కూడా వ్యక్తిగతంగా రాహుల్‌గాంధీ వద్ద పలుకుబడి బాగానే ఉంది. ఆయన ఆధ్వర్యంలోని మైనార్టీ మేనిఫెస్టో కమిటీలో సభ్యుడయిన సర్వోత్తమ్ రాహుల్‌కు సన్నిహితుడుగానే పేరొందారు.
ఒకవేళ పరిస్థితి మారితే తానే స్వయంగా ఖమ్మం ఎంపీగా పోటీచేయాలనే యోచనలో కూడా మంత్రి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు హస్తినలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఫైర్‌బ్రాండ్ రేణుక కూడా తనకు ఢిల్లీలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని ఎట్టి పరిస్థితుల్లో పట్టు జారకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాగూ తనూ ఎంపీగానే ఉన్నందున సీటు తనకిచ్చే విషయంలో కొంత పట్టువిడుపు ప్రదర్శించినా, పూర్తిగా తన వర్గానికి దక్కకుండా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. తనకు కాకపోతే తన భర్త శ్రీధర్‌చౌదరి, లేదంటే కుమార్తె తేజస్విని పేర్లను ఆమె ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
అసలు తన కుటుంబానికి కాదన్నా ఆమె మరో ప్రత్యామ్నాయాన్ని కూడా సిద్ధం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే ప్రముఖ కాంట్రాక్టర్ గరికపాటి వెంకటేశ్వరరావు (జీవీఆర్) పేరును పరిశీలించాలని ఆమె ఢిల్లీ పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తోంది. వీరికి తోడు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కూడా ఖమ్మం ఎంపీ సీటు కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి ఎవరు బరిలో ఉంటారనేది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
ఖమ్మం బరిలో స్పీకర్ నాదెండ్ల ?
Published Mon, Jan 27 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
Advertisement
Advertisement