ramreddy venkatareddy
-
కేసీఆర్ కు సుచరిత లేఖ
హైదరాబాద్: నాలుగు రోజుల్లో నామినేషన్ల ఘట్టం ముగియనుండగా, పాలేరు ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరితారెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కోరారు. ఖమ్మం జిల్లాకు తన భర్త చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని పోటీ నుంచి విరమించేలా నిర్ణయం తీసుకోవాలని ఆమె అభ్యర్థించారు. ఈ మేరకు సుచరిత ఆదివారం సీఎంకు ఒక లేఖ రాశారు. రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో అనివార్యమైన పాలేరు ఉప ఎన్నికల్లో పలు విపక్షపార్టీలు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. చనిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో పోటీకి దిగొద్దని, ఏకగ్రీవానికి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ విపక్షాలను అభ్యర్థించింది. ఆ మేరకు వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీసీఐ, సీపీఎంలు పోటీకి దిగబోమని ప్రకటించాయి. ఇదే విషయాన్ని సీఎంకు రాసిన లేఖలో ప్రస్తావించిన సుచరితారెడ్డి టీఆర్ఎస్ కూడా ఏకగ్రీవానికి సహకరిస్తుందనే ఆశాభావం వ్యక్తంచేశారు. పాలేరు ఉప ఎన్నికకు ఈ నెల 22న నోటిఫికేషన్ వెలువడింది. 29 వతేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామినేషన్లు పరిశీలన, మే 2న నామినేషన్ల ఉపసంహరణ, మే 16న పోలింగ్, 19న కౌంటింగ్ జరగనుంది. పాలేరులో అధికార టీఆర్ఎస్ తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ మొదటి నుంచీ ఏకగ్రీవ పాట పాడుతున్నప్పటికీ దానిని సకాలంలో, బిగ్గరగా వినిపించడంలో విఫలమైంది. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల అని తేలకముందు వరకు వైఎస్సార్ సీపీ తప్ప మిగతా పార్టీలైన టీడీపీ, సీపీఎం, సీపీఐలు పోటీకి కాలుదువ్వాయి. తుమ్మల రంగంలోకి దిగటంతో మళ్లీ ఏకగ్రీవం అంటూ మాటమార్చాయి. 'సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీకి దిగం' అనే రాసుకోని ఒప్పందానికి వైఎస్సార్ సీపీ ఒక్కటే కట్టుబడింది. -
వెంకటరెడ్డికి క్యాన్సర్ రావడం దురదృష్టకరం: కేసీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ దివంగత నేత రాంరెడ్డి వెంకటరెడ్డి మితభాషి, మృదు స్వభావి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రెండో రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రాంరెడ్డి వెంకటరెడ్డి మృతిపట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ వెంకటరెడ్డి సేవలను కొనియాడారు. ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారని, ఒకసారి పూర్తి కాలం మంత్రిగా పనిచేశారని అన్నారు. వ్యవసాయం, పశుపోషణలో రాంరెడ్డి వెంకటరెడ్డిది మంచి నైపుణ్యం గలవారని అన్నారు. ఎన్నిచోట్ల ఎద్దుల పోటీలు పెట్టినా వెంకటరెడ్డి గిత్తలకే అవార్డు వచ్చేదని అన్నారు. రాజకీయాల్లో కూడా మంచి హుందాను కొనసాగించారని చెప్పారు. అలాంటి నేతకు క్యాన్సర్ రావడం దురదృష్టకరమని, ఆయన వైద్యానికి ప్రభుత్వం తరుపున వైద్య ఖర్చులు కూడా ఇచ్చామని తెలిపారు. వ్యక్తిగతంగా, ప్రభుత్వం తరుపున వెంకటరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వారి కుటుంబానికి మనోస్థైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు. -
రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఇకలేరు
నేడు స్వగ్రామం పాతలింగాలలో అంత్యక్రియలు సాక్షి, ఖమ్మం/హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ రాంరెడ్డి వెంకట్‌రెడ్డి(72) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వెంకట్‌రెడ్డి నాలుగేళ్లుగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నారు. నెల రోజుల కింద ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కిమ్స్‌లో చేర్చారు. చికిత్స సమయంలో ఫిట్స్ రావడంతో కొద్దిరోజుల కిందట అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం మరణించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నేత వరకు ఎదిగిన వెంకట్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. మంత్రిగానూ పనిచేశారు. ఆయనకు భార్య సుచరిత, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వెంకట్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాలలో నిర్వహించనున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర.. రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో నారాయణరెడ్డి-కమలమ్మ దంపతులకు 1944, మే 22న జన్మించారు. ఆయన ఉస్మానియా నుంచి ఎంఏ పూర్తి చేశారు. అప్పటి కాంగ్రెస్ నేత శీలం సిద్ధారెడ్డికి ప్రియశిష్యుడు. 1962లో పాతలింగాల గ్రామ సర్పంచ్‌గా వెంకట్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. వరుసగా 15 ఏళ్లపాటు సర్పంచ్‌గా కొనసాగారు. 1996, 1999, 2004లో సుజాతనగర్ ఎమ్మెల్యేగా, 2009, 2014లో పాలేరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో సహకార, కార్మిక, ఉద్యానవన శాఖల మంత్రిగా పనిచేశారు. అనంతరం రోశయ్య, కిరణ్ కేబినెట్లోనూ కొనసాగారు. కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న ఖమ్మం జిల్లాలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తోడ్పడ్డారు. గత ఏడాది నవంబర్‌లో పీఏసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాజకీయాల్లో ఆయనకు వివాద రహితుడిగా పేరుంది. ఇక రాంరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు వింటేనే ఒంగోలు గిత్తలు, పాడిగేదెలు గుర్తొస్తాయి. రైతుకు వ్యవసాయంతో పాటు పాడిగేదెల పెంపకం అవసరమని ఆయన భావించేవారు. రైతుల కోసం ఎంతో కృషి చేశారు. పాతలింగాలలోని వారి ఇంట్లో దేశంలో ఉన్న అన్ని జాతుల పశు సంపద ఉండడం విశేషం. దేశంలో ఎక్కడ ఎడ్ల బండి, గిత్తల పోటీలు జరిగినా రాంరెడ్డి సోదరుల గిత్తలే విజేతలుగా నిలిచేవి. ప్రముఖుల సంతాపం.. రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మరణవార్త విని ఆయన బంధువులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కిమ్స్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మంత్రులు హరీశ్‌రావు, ఈటెల, జగదీశ్‌రెడ్డి, తుమ్మల, ఇంద్రకరణ్‌రెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్, భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తదితరులు వెంకటరెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, జైపాల్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వంశీచంద్‌రెడ్డి, బీజేపీ నాయకులు జి.కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్ సంతాపం తెలిపారు. తీరని లోటు: కేసీఆర్ రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. వెంకట్‌రెడ్డి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ ఎమ్మెల్యేగా అందరితో అన్యోన్యంగా ఉండేవారని, ఉన్నత వ్యక్తిత్వమున్న వెంకట్‌రెడ్డి పట్ల రాజకీయాలకు అతీతంగా ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు అనారోగ్యంతో కన్నుమూసిన కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించారు. -
భద్రాచలంపై ప్రధానికి జిల్లా ప్రజాప్రతినిధుల లేఖ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్ర ప్రాంతంలో కలిపే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కేంద్రానికి విజ్ఞాపనలను తీవ్రతరం చేశారు. ఇప్పటివరకు పార్టీల వారీగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్న వీరంతా ఇప్పుడు ఒకే వేదికగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అసెంబ్లీలోని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క చాంబర్లో జిల్లాకు చెందిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డితోపాటు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలకు చెందిన 13 మంది ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రధాని మన్మోహన్‌కు మూడు పేజీల లేఖ రాశారు. అందులో భద్రాచలం చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. 1674వ సంవత్సరంలో తానీషా సంస్థానంలో తహశీల్దారుగా పనిచేసిన కంచర్ల గోపన్న భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయాన్ని నిర్మించారని, అప్పటి నుంచి 1948 వరకు భద్రాచలం తెలంగాణలోనే అసఫ్‌జాహీల పాలనలోనే ఉందని, ఆ తర్వాత మూడేళ్ల పాటు మాత్రమే కాకినాడలో కలిపారని, మళ్లీ 1959 నవంబర్ నుంచి ఖమ్మంలో కలిపేశారని తెలిపారు. జిల్లాలోని గిరిజన ప్రజల సంస్కృతి సంప్రదాయాలు కూడా తెలంగాణలో భాగంగానే ఉంటాయని, ఒక్క అంగుళం భూమిని కూడా ఖమ్మం జిల్లా నుంచి సీమాంధ్రలో కలపవద్దని ఆ వినతిపత్రంలో కోరారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిర్మించేందుకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను తగ్గించాలని, తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఆరు బ్యారేజీలతో ప్రాజెక్టు నిర్మించుకుంటే పెద్దగా నష్టం లేకుండానే నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చని అందులో సూచించారు. ఈ వినతిపత్రంపై సంతకం చేసిన వారిలో మంత్రి, డిప్యూటీ స్పీకర్‌తో పాటు ఎమ్మెల్యేలు కుంజా సత్యవతి, రేగా కాంతారావు, మిత్రసేన (కాంగ్రెస్), తుమ్మల నాగేశ్వరావు, సండ్రవెంకటవీరయ్య, ఊకె అబ్బయ్య (టీడీపీ), కూనంనేని సాంబశివరావు, చంద్రావతి (సీపీఐ)లతో పాటు ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు ఉన్నారు. -
ఖమ్మం బరిలో స్పీకర్ నాదెండ్ల ?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గ్రూపు గొడవలు, అంతర్గత కుమ్ములాటలకు నెలవైన జిల్లా కాంగ్రెస్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రేణుకాచౌదరి అనుచరులు వర్గాలుగా విడిపోయి పనిచేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై అధిష్టానం దృష్టి సారించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అభ్యర్థిత్వాన్ని ఢిల్లీ పెద్దలు తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందుకు మనోహర్ సామాజిక వర్గ నేపథ్యంతో పాటు జిల్లా పార్టీలోని రెండు గ్రూపుల నడుమ మధ్యేమార్గాన్ని ఎంచుకోవడమే ఉత్తమమనే భావనకు అధిష్టానం రావడమే కారణమని తెలుస్తోంది. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కష్టమని భావించడంతో పాటు, ఖమ్మంలో స్థానికేతరులకు విజయావకాశాలు ఎక్కువ అని కూడా అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. పార్టీ ఆంతర్యం ఇలా.. గుంటూరు జిల్లాకు చెందిన నాదెండ్ల మనోహర్‌ను ఖమ్మం పంపే విషయంలో అధిష్టానం కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పెద్దల ఆలోచన ప్రకారం... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అసెంబ్లీ స్పీకర్‌గా నిర్వర్తించాల్సిన బాధ్యతను రూల్ పొజిషన్ ప్రకారం ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా మనోహర్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాల సమావేశాలను ప్రోరోగ్ చేసే అంశంలో కూడా ఆయన అధిష్టానానికి పూర్తిగా సహకరించారు. ఎక్కడా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న భావన రానీయలేదు. దీంతో పాటు తెలంగాణకు వ్యతిరేకంగా అధిష్టానంపై ధిక్కారస్వరాన్ని వినిపిస్తూ అంతర్గతంగా సహకరిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి భిన్నంగా తన రాజ్యాంగపరమైన బాధ్యతలను సమర్థవంతంగా చక్కబెడుతున్నారు. ఎన్నికల బరిలో దింపినా తాను సభాపతిగా ఉన్నప్పుడే తెలంగాణ బిల్లును అసెంబ్లీలో చర్చించి పార్లమెంటుకు పంపానని చెప్పుకునే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుడైనప్పటికీ తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. రేణుకాచౌదరి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినంత సులువుగా రాంరెడ్డి వర్గం కూడా స్పీకర్ పట్ల వ్యవహరించలేదు. దీనికి తోడు గతంలో ఆయన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కూడా ఎంపీగా ఖమ్మం పార్లమెంటుకు ప్రాతిని ధ్యం వహించారు. ఆయనకు కూడా ఇక్క డి ప్రజలతో మంచి సంబంధాలున్నాయి. మనోహర్ సామాజికవర్గం కూడా ఇక్కడ ఆయనకు ఉపకరిస్తుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అధిష్టానం మనోహర్ పేరును తీవ్రంగా పరిశీలిస్తున్నదనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. కొట్టుకున్నా... మాకే! ఇదిలా ఉంటే మంత్రి, ఎంపీ గ్రూపులు కూడా ఖమ్మం పార్లమెంట్ స్థానం కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డి ఈసారి ఖమ్మం పార్లమెంటు స్థానంపై కూడా కన్నేశారు. తన సోదరుడు, సూర్యాపేట ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని ఇక్కడి నుంచి పోటీ చేయించేందుకు ఢిల్లీ పెద్దల అనుమతి కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. సర్వోత్తమ్‌రెడ్డికి కూడా వ్యక్తిగతంగా రాహుల్‌గాంధీ వద్ద పలుకుబడి బాగానే ఉంది. ఆయన ఆధ్వర్యంలోని మైనార్టీ మేనిఫెస్టో కమిటీలో సభ్యుడయిన సర్వోత్తమ్ రాహుల్‌కు సన్నిహితుడుగానే పేరొందారు. ఒకవేళ పరిస్థితి మారితే తానే స్వయంగా ఖమ్మం ఎంపీగా పోటీచేయాలనే యోచనలో కూడా మంత్రి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు హస్తినలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఫైర్‌బ్రాండ్ రేణుక కూడా తనకు ఢిల్లీలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని ఎట్టి పరిస్థితుల్లో పట్టు జారకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాగూ తనూ ఎంపీగానే ఉన్నందున సీటు తనకిచ్చే విషయంలో కొంత పట్టువిడుపు ప్రదర్శించినా, పూర్తిగా తన వర్గానికి దక్కకుండా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. తనకు కాకపోతే తన భర్త శ్రీధర్‌చౌదరి, లేదంటే కుమార్తె తేజస్విని పేర్లను ఆమె ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు తన కుటుంబానికి కాదన్నా ఆమె మరో ప్రత్యామ్నాయాన్ని కూడా సిద్ధం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే ప్రముఖ కాంట్రాక్టర్ గరికపాటి వెంకటేశ్వరరావు (జీవీఆర్) పేరును పరిశీలించాలని ఆమె ఢిల్లీ పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తోంది. వీరికి తోడు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కూడా ఖమ్మం ఎంపీ సీటు కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి ఎవరు బరిలో ఉంటారనేది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.