సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్ర ప్రాంతంలో కలిపే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కేంద్రానికి విజ్ఞాపనలను తీవ్రతరం చేశారు. ఇప్పటివరకు పార్టీల వారీగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్న వీరంతా ఇప్పుడు ఒకే వేదికగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అసెంబ్లీలోని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క చాంబర్‌లో జిల్లాకు చెందిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డితోపాటు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలకు చెందిన 13 మంది ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారు ప్రధాని మన్మోహన్‌కు మూడు పేజీల లేఖ రాశారు. అందులో భద్రాచలం చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. 1674వ సంవత్సరంలో తానీషా సంస్థానంలో తహశీల్దారుగా పనిచేసిన కంచర్ల గోపన్న భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయాన్ని నిర్మించారని, అప్పటి నుంచి 1948 వరకు భద్రాచలం తెలంగాణలోనే అసఫ్‌జాహీల పాలనలోనే ఉందని, ఆ తర్వాత మూడేళ్ల పాటు మాత్రమే కాకినాడలో కలిపారని, మళ్లీ 1959 నవంబర్ నుంచి ఖమ్మంలో కలిపేశారని తెలిపారు.
జిల్లాలోని గిరిజన ప్రజల సంస్కృతి సంప్రదాయాలు కూడా తెలంగాణలో భాగంగానే ఉంటాయని, ఒక్క అంగుళం భూమిని కూడా ఖమ్మం జిల్లా నుంచి సీమాంధ్రలో కలపవద్దని ఆ వినతిపత్రంలో కోరారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిర్మించేందుకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను తగ్గించాలని, తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
ఆరు బ్యారేజీలతో ప్రాజెక్టు నిర్మించుకుంటే పెద్దగా నష్టం లేకుండానే నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చని అందులో సూచించారు. ఈ వినతిపత్రంపై సంతకం చేసిన వారిలో మంత్రి, డిప్యూటీ స్పీకర్‌తో పాటు ఎమ్మెల్యేలు కుంజా సత్యవతి, రేగా కాంతారావు, మిత్రసేన (కాంగ్రెస్), తుమ్మల నాగేశ్వరావు, సండ్రవెంకటవీరయ్య, ఊకె అబ్బయ్య (టీడీపీ), కూనంనేని సాంబశివరావు, చంద్రావతి (సీపీఐ)లతో పాటు ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు ఉన్నారు.
భద్రాచలంపై ప్రధానికి జిల్లా ప్రజాప్రతినిధుల లేఖ
Published Sat, Feb 8 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement
Advertisement