Division of Bhadrachalam
-
‘పోలవరం’ ముంపు గ్రామాలకు...ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలి
పినపాక, న్యూస్‌లైన్: పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని వైఎస్ఆర్ సీపీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లుతో కలిసి పాల్గొన్నారు. పొంగులేటి మాట్లాడుతూ.. భద్రాచలం డివిజన్లోని ఏడు మండలాల్లోని ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ముంపు గ్రామాల ప్రజలు జీవనాధారం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ప్రభుత్వమే దారి చూపించాలని డిమాండ్ చేశారు. రైతులకు పరిహారంపై నిర్లక్ష్యం రైతులకు పంట నష్ట పరిహారాన్ని ఇప్పటివరకూ ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పొంగులేటి ధ్వజమెత్తారు. ‘సాగుకు నీరు లేదు. విత్తనాలు అందుబాటులో లేవు. ఎరువుల ధరలు మండుతున్నాయి. పంటలకు గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయమంటేనే భయపడే పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెలకొన్నాయి’ అని, ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పుడే పరిస్థితులు మెరుగవుతాయని, అందరి కష్టాలు కడతేరతాయని అన్నారు. రాజన్న రాజ్యం స్థాపనకు పార్టీ శ్రేణులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రచారానికే ‘పులుసుబొంత’ ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నిర్మించదలిచిన పులుసుబొంత ప్రాజెక్టు నిర్మాణం కేవలం ప్రచారానికే పరిమితమైందని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. దీనికి ముఖ్యమంత్రి కేవలం 60 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తున్నట్టుగా ప్రకటించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి పూర్తిస్థాయి అనుమతులు ఇంకా రాలేదన్నారు. మహానేత వైఎస్ఆర్ మృతి తరువాత పులుసుబొంత ప్రాజెక్టు పురోగతి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. వైఎస్ఆర్ జీవించినట్టయితే ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యేవని అన్నారు. రాజన్న రాజ్యంలోనే ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందన్నారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఎడవల్లి కృష్ణ (కొత్తగూడెం), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట), సామాన్య కిరణ్ (మధిర), నంబూరి రామలింగేశ్వరరావు (సత్తుపల్లి), జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఉడుముల లక్ష్మిరెడ్డి, మండల కన్వీనర్ గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భద్రాచలంపై ప్రధానికి జిల్లా ప్రజాప్రతినిధుల లేఖ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్ర ప్రాంతంలో కలిపే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కేంద్రానికి విజ్ఞాపనలను తీవ్రతరం చేశారు. ఇప్పటివరకు పార్టీల వారీగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్న వీరంతా ఇప్పుడు ఒకే వేదికగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అసెంబ్లీలోని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క చాంబర్లో జిల్లాకు చెందిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డితోపాటు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలకు చెందిన 13 మంది ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రధాని మన్మోహన్‌కు మూడు పేజీల లేఖ రాశారు. అందులో భద్రాచలం చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. 1674వ సంవత్సరంలో తానీషా సంస్థానంలో తహశీల్దారుగా పనిచేసిన కంచర్ల గోపన్న భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయాన్ని నిర్మించారని, అప్పటి నుంచి 1948 వరకు భద్రాచలం తెలంగాణలోనే అసఫ్‌జాహీల పాలనలోనే ఉందని, ఆ తర్వాత మూడేళ్ల పాటు మాత్రమే కాకినాడలో కలిపారని, మళ్లీ 1959 నవంబర్ నుంచి ఖమ్మంలో కలిపేశారని తెలిపారు. జిల్లాలోని గిరిజన ప్రజల సంస్కృతి సంప్రదాయాలు కూడా తెలంగాణలో భాగంగానే ఉంటాయని, ఒక్క అంగుళం భూమిని కూడా ఖమ్మం జిల్లా నుంచి సీమాంధ్రలో కలపవద్దని ఆ వినతిపత్రంలో కోరారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిర్మించేందుకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను తగ్గించాలని, తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఆరు బ్యారేజీలతో ప్రాజెక్టు నిర్మించుకుంటే పెద్దగా నష్టం లేకుండానే నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చని అందులో సూచించారు. ఈ వినతిపత్రంపై సంతకం చేసిన వారిలో మంత్రి, డిప్యూటీ స్పీకర్‌తో పాటు ఎమ్మెల్యేలు కుంజా సత్యవతి, రేగా కాంతారావు, మిత్రసేన (కాంగ్రెస్), తుమ్మల నాగేశ్వరావు, సండ్రవెంకటవీరయ్య, ఊకె అబ్బయ్య (టీడీపీ), కూనంనేని సాంబశివరావు, చంద్రావతి (సీపీఐ)లతో పాటు ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు ఉన్నారు.