పినపాక, న్యూస్‌లైన్: పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని వైఎస్‌ఆర్ సీపీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్‌లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లుతో కలిసి పాల్గొన్నారు. పొంగులేటి మాట్లాడుతూ.. భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాల్లోని ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ముంపు గ్రామాల ప్రజలు జీవనాధారం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ప్రభుత్వమే దారి చూపించాలని డిమాండ్ చేశారు.
రైతులకు పరిహారంపై నిర్లక్ష్యం
రైతులకు పంట నష్ట పరిహారాన్ని ఇప్పటివరకూ ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పొంగులేటి ధ్వజమెత్తారు. ‘సాగుకు నీరు లేదు. విత్తనాలు అందుబాటులో లేవు. ఎరువుల ధరలు మండుతున్నాయి. పంటలకు గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయమంటేనే భయపడే పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెలకొన్నాయి’ అని, ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పుడే పరిస్థితులు మెరుగవుతాయని, అందరి కష్టాలు కడతేరతాయని అన్నారు. రాజన్న రాజ్యం స్థాపనకు పార్టీ శ్రేణులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రచారానికే ‘పులుసుబొంత’
ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నిర్మించదలిచిన పులుసుబొంత ప్రాజెక్టు నిర్మాణం కేవలం ప్రచారానికే పరిమితమైందని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. దీనికి ముఖ్యమంత్రి కేవలం 60 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తున్నట్టుగా ప్రకటించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి పూర్తిస్థాయి అనుమతులు ఇంకా రాలేదన్నారు. మహానేత వైఎస్‌ఆర్ మృతి తరువాత పులుసుబొంత ప్రాజెక్టు పురోగతి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు.
వైఎస్‌ఆర్ జీవించినట్టయితే ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యేవని అన్నారు. రాజన్న రాజ్యంలోనే ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందన్నారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఎడవల్లి కృష్ణ (కొత్తగూడెం), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట), సామాన్య కిరణ్ (మధిర), నంబూరి రామలింగేశ్వరరావు (సత్తుపల్లి), జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఉడుముల లక్ష్మిరెడ్డి, మండల కన్వీనర్ గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘పోలవరం’ ముంపు గ్రామాలకు...ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలి
Published Wed, Feb 12 2014 2:45 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement