వెంకటరెడ్డికి క్యాన్సర్ రావడం దురదృష్టకరం: కేసీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ దివంగత నేత రాంరెడ్డి వెంకటరెడ్డి మితభాషి, మృదు స్వభావి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రెండో రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రాంరెడ్డి వెంకటరెడ్డి మృతిపట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ వెంకటరెడ్డి సేవలను కొనియాడారు. ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారని, ఒకసారి పూర్తి కాలం మంత్రిగా పనిచేశారని అన్నారు. వ్యవసాయం, పశుపోషణలో రాంరెడ్డి వెంకటరెడ్డిది మంచి నైపుణ్యం గలవారని అన్నారు.
ఎన్నిచోట్ల ఎద్దుల పోటీలు పెట్టినా వెంకటరెడ్డి గిత్తలకే అవార్డు వచ్చేదని అన్నారు. రాజకీయాల్లో కూడా మంచి హుందాను కొనసాగించారని చెప్పారు. అలాంటి నేతకు క్యాన్సర్ రావడం దురదృష్టకరమని, ఆయన వైద్యానికి ప్రభుత్వం తరుపున వైద్య ఖర్చులు కూడా ఇచ్చామని తెలిపారు. వ్యక్తిగతంగా, ప్రభుత్వం తరుపున వెంకటరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వారి కుటుంబానికి మనోస్థైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు.